పాతిక వేలకు డజను బకెట్లు

పాతిక వేలకు డజను బకెట్లు

అవి సాధారణ ప్లాస్టిక్ బకెట్లు. అయితేనేం అమెజాన్ లో 12 బకెట్ల సెట్ రూ.25,999 దాకా బంపర్ ధర పలుకుతోంది. దీన్ని చూసిన ఎంతోమంది అవాక్కవుతున్నారు. బాత్ రూమ్ లలో, ఇంటి అవసరాలకు వాడే ప్లాస్టిక్ బకెట్ల సెట్ కు ఇంత ధరను ఎలా నిర్ణయిస్తారు ? అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు. వాస్తవానికి వీటి ధర రూ.35,900. 28 శాతం రాయితీపోనూ రూ.25,999 కే ప్రస్తుతం లభిస్తున్నాయి. స్టాక్ అయిపోయింది. ఒకే ఒక  బకెట్ సెట్  మిగిలింది.. అంటూ అమెజాన్ లో ట్యాగ్ లైన్ కూడా పెట్టారు. ఆ ధరేంటి ? ఆ ధర పై డిస్కౌంట్ ఏంటి ?  బకెట్ల స్టాక్ అయిపోవడమేంటి ? అని నెటిజన్లు  నవ్వుకుంటున్నారు. ప్రస్తుతం ఈ బకెట్ల సెట్ కు సంబంధించిన ధమాకా ధర పై ట్విటర్ లోనూ వాడివేడి చర్చ నడుస్తోంది.

కామెంట్ల వర్షం.. 

డజను ప్లాస్టిక్ బకెట్ల సెట్ కూడా లగ్జరీ ఐటమ్ గా మారిపోయిందా అని పలువురు కామెంట్లు చేశారు. బహుశా.. పొరపాటున ఇంత భారీ ధరను టైప్ చేసి ఉంటారని ఇంకొందరు అభిప్రాయపడ్డారు. ‘దీన్ని కొనేందుకు ఈఎంఐ  ఆప్షన్ కూడా ఇవ్వడం గొప్ప అదృష్టం’ అని ఓ నెటిజన్ సరదాగా  వ్యాఖ్యానించాడు. అమెజాన్ లో అమ్ముతున్న ఆ ప్లాస్టిక్ బకెట్ల సెట్  స్క్రీన్ షాట్ తో మరెంతో మంది పోస్ట్ లు చేశారు. ‘ ప్రతి ఒక్కరి బకెట్ లిస్ట్ లో ఈ బకెట్ల సెట్ ఉండాల్సిందే’ అని కెప్టెన్ వెంకట్ అనే నెటిజన్ పేర్కొన్నాడు. ‘ఈ బకెట్లతో  పాటు బాత్ రూమ్ ను కూడా కాంప్లిమెంటరీగా ఇస్తారేమో’ అని మరో వ్యక్తి కామెంట్ చేశాడు. ‘ ఆ బకెట్లను తిప్పి చూడండి. మరో వైపు యాపిల్ లోగో ఉంటుంది’ అని ఇంకొకరు అన్నారు. ‘ఈ బకెట్లు నీళ్లను కూడా లిక్కర్ గా మారుస్తాయేమో’  అని ఓ వ్యక్తి వ్యాఖ్యానించాడు. ‘ఈ బకెట్ల సెట్ ను కొనడానికి కిడ్నీలను అమ్ముకోవాల్సి వస్తుందేమో’ అని మరో వ్యక్తి పేర్కొన్నాడు. ఈవిధంగా ఈ ప్లాస్టిక్ బకెట్ల సెట్ పై  తీరొక్క కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. 

మరిన్ని వార్తలు.. 

తుంగభద్ర జలాశయం సరికొత్త రికార్డు
రాష్ట్రానికి వర్ష సూచన