ఎన్ని వందల మందిని జైలుకు పంపినా వైసీపీని అణచలేరు: అంబటి రాంబాబు

ఎన్ని వందల మందిని జైలుకు పంపినా వైసీపీని అణచలేరు: అంబటి రాంబాబు

వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ ఏపీ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ఆదివారం ( జులై 20 ) ఏపీ లిక్కర్ స్కాం కేసులో మిథున్ రెడ్డికి రిమాండ్ విధించింది ఏసీబీ కోర్టు. ఈ క్రమంలో మిథున్ రెడ్డి అరెస్ట్ పై స్పందించిన మాజీ మంత్రి అంబటి రాంబాబు చంద్రబాబును ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఎన్ని వందల మందిని అరెస్ట్ చేసినా వైసీపీ అణచలేరని అన్నారు అంబటి. గత టిడిపి ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా ఎక్కడబడితే అక్కడ, ఎమ్మార్పీ రేట్లకంటే ఎక్కువ అమ్మారని అన్నారు. 

 గత ఐదు సంవత్సరాల వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు  మద్యం వాడకాన్ని తగ్గించాలని ఉద్దేశంతో రేట్లు పెంచమని..  వాడకాన్ని తగ్గించి ఆదాయాన్ని పెంచామని అన్నారు. కాలేజీ రోజుల నుంచే పెద్దిరెడ్డి అంటే చంద్రబాబుకు కక్ష అని.. అందుకే మిథున్ రెడ్డిపై అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేసారని అన్నారు. ఎన్ని వందల మందిని అరెస్ట్ చేసి జైలుకు పంపిన వైసీపీని అణచలేరని అన్నారు.  

అక్రమ అరెస్టులతో చంద్రబాబు ఏం సాధించారో చెప్పాలని అన్నారు అంబటి. చంద్రబాబు నాయుడు కంటే మలినం, క్రిమినల్ ఎవరున్నారు చెప్పాలని అన్నారు. చంద్రబాబు జగన్ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని అన్నారు అంబటి. చంద్రబాబు నాయుడు హయాంలోనే అసలైన మద్యం స్కాన్ జరిగిందని.. గతంలో చంద్రబాబు సోనియా గాంధీ డైరెక్షన్లో పనిచేశారని అన్నారు. చంద్రబాబు తడిగుడ్డతో గొంతు కోసే రకం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు అంబటి.