దళిత బంధు ప్లేస్​లో అంబేద్కర్ అభయహస్తం.. ఒక్కొక్కరికి రూ.12 లక్షల సాయం

దళిత బంధు ప్లేస్​లో అంబేద్కర్ అభయహస్తం.. ఒక్కొక్కరికి రూ.12 లక్షల సాయం
  • ఒక్కొక్కరికి రూ.12 లక్షల సాయం..  రాష్ట్ర సర్కార్ కసరత్తు
  • పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టినప్పుడు ప్రకటించే చాన్స్
  • కొత్త గైడ్​లైన్స్​తో స్కీమ్ అమలు
  • కలెక్టర్ల ఆధ్వర్యంలోనే ఎంపిక ప్రక్రియ

హైదరాబాద్, వెలుగు:  దళిత బంధు ప్లేస్​లో అంబేద్కర్ అభయ హస్తం స్కీమ్ అమలు చేయాలని రాష్ట్ర సర్కార్ భావిస్తున్నది. ఇందుకు కార్యాచరణ కూడా ప్రారంభించింది. ఈ పథకం కింద దళితులకు రూ.12 లక్షలు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రకటించింది. ఈ క్రమంలో స్కీమ్ అమలుపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నది. అప్పుడే అంబేద్కర్ అభయహస్తంపై అధికారిక ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయి. గైడ్​లైన్స్ ఖరారు, బడ్జెట్ కేటాయింపుపై కూడా ప్రభుత్వం అప్పుడే స్పష్టత ఇవ్వనున్నట్టు అధికార వర్గాలు చెప్తున్నాయి. అదేవిధంగా, అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఆయా రంగాల మేధావులతో అఖిలపక్షం మీటింగ్ ఏర్పాటు చేసి సలహాలు, సూచనలు తీసుకోనున్నది.

గత ప్రభుత్వ హయాంలో అనర్హులకు స్కీమ్ అమలు 

ఇప్పుడున్న దళితబంధు గైడ్​లైన్స్ ను మార్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో అనర్హులకు కూడా ఈ స్కీమ్ వర్తింపజేశారనే ఆరోపణలు ఉన్నాయి. తమ పార్టీ అనుచరులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యేలు దళితబంధు ఇప్పించుకున్నారనే విమర్శలు వచ్చాయి. రాజకీయ పదవుల్లో ఉన్నవారికి కూడా బీఆర్ఎస్ సర్కార్ దళితబంధు ఇచ్చింది. చివరికి ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈ స్కీమ్​తో లబ్ధి పొందారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. గత ప్రభుత్వం స్కీమ్ అమలు, లబ్ధిదారుల ఎంపిక, గ్రౌండింగ్ వంటి అన్ని బాధ్యతలు కలెక్టర్​లకే అప్పగించింది. ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ సర్కార్ మాత్రం ఉమ్మడి జిల్లాలకు ఇన్​చార్జ్​లుగా మంత్రులను నియమించింది. లబ్ధిదారుల ఎంపికలో వీరిని కూడా భాగస్వామ్యం చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. లబ్ధిదారులు ఎక్కువగా ఉండటం.. నిధుల కొరత నేపథ్యంలో ఆర్థిక సాయం దశలవారీగా ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తున్నది. గత బీఆర్ఎస్ హయాంలో రూ.10 లక్షలు ఇస్తే.. అందులో అధికార పార్టీ ఎమ్మెల్యేలు రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల దాకా వసూలు చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. అప్పటి సీఎం కేసీఆర్ కూడా ఎమ్మెల్యేల వైఖరిపై బహిరంగంగానే ఆరోపణలు చేయడం.. రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులు, అవినీతి మళ్లీ రిపీట్ కాకుండా పకడ్బందీగా అమలు చేయాలని కాంగ్రెస్ సర్కార్ భావిస్తున్నది. 

ఒక్క హుజురాబాద్​లోనే 25 వేల మంది

గత బీఆర్ఎస్ సర్కార్ దళితబంధు కింద 38 వేల మందికి రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేసినట్టు అధికారిక లెక్కలు చెప్తున్నాయి. ఇందులో ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం నుంచే 25 వేల మంది ఉన్నట్టు తెలుస్తున్నది. ఈ స్కీమ్ అమలు.. అప్పటి సర్కార్ ఖజానాకు పెద్ద ఇబ్బందిగా మారింది. లబ్ధిదారులు ఎక్కువగా ఉండటం, ప్రభుత్వం దగ్గర నిధుల్లేకపోవడం, ఒకే వర్గానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం చేయడం, ప్రభుత్వ ఉద్యోగులు కూడా లబ్ధి పొందడంతో రాష్ట్రంలో 60 శాతానికి పైగా ఉన్న బీసీ వర్గాలు వ్యతిరేకించాయి. తర్వాత బీసీ బంధు స్కీమ్ ప్రవేశపెట్టి కేవలం రూ.లక్ష సాయం చేయడం మరింత వివాదాస్పదమైంది. ఈ అంశాలన్నింటిని పరిగణనలోకి తీసుకుని అలాంటి తప్పులు జరగకుండా, ఇతర వర్గాల నుంచి విమర్శలు రాకుండా అంబేద్కర్ అభయహస్తం అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది.