అమెరికాలో యాక్సిడెంట్.. మనోళ్లు ముగ్గురు మృతి

అమెరికాలో యాక్సిడెంట్.. మనోళ్లు ముగ్గురు మృతి

నారాయణపేట జిల్లా పెద్దచింతకుంటలో విషాదం

శుభకార్యానికి వెళ్లి వస్తుండగా టెక్సాస్​లో ప్రమాదం

మరికల్ (నారాయణపేట)​, వెలుగు: పిల్లలిద్దరూ అమెరికాలో సెటిలయ్యారు. ఓ ఇల్లు కొన్నారు. తల్లిదండ్రులను తీసుకెళ్లి గృహ ప్రవేశం చేశారు. శనివారం (అక్కడి టైం ప్రకారం) దగ్గరి బంధువుల ఇంట్లో శుభకార్యం ఉంటే అందరూ కలిసి వెళ్లారు. కానీ తిరిగి వస్తుండగా మృత్యువు వెంటాడింది. మూడు ప్రాణాలను బలి తీసుకుంది. అమెరికాలోని టెక్సాస్ సిటీకి దగ్గర్లో జరిగిన యాక్సిడెంట్​లో రాష్ట్రానికి చెందిన ముగ్గురు చనిపోయారు. మరొకరు తీవ్రగాయాలై ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు.

దగ్గరి బంధువు ఇంటి వెళ్లి వస్తుండగా..

నారాయణపేట జిల్లా మరికల్ మండలం పెద్దచింతకుంట గ్రామానికి చెందిన నర్సింహా రెడ్డి (57), లక్ష్మి (50) దంపతులకు కూతురు మౌనిక, కొడుకు భరత్‌‌ ఉన్నారు. హైదరాబాద్​-1 డిపోలో కండక్టర్​గా నర్సింహారెడ్డి పని చేస్తున్నారు. జనవరిలో ఆయన రిటైర్ కావాల్సి ఉంది. పిల్లలిద్దరూ అమెరికాలోని టెక్సాస్​లో ఉంటున్నారు. అక్కడే చదువుకుని, సాఫ్ట్​వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. తాము సంపాదించిన డబ్బుతో టెక్సాస్​లో ఓ ఇల్లు కొన్నారు. నాలుగు నెలల  కిందట హైదరాబాద్​కు వచ్చిన కొడుకు.. ఇంటి ఓపెనింగ్ కోసమని తల్లిదండ్రులను టెక్సాస్​కు తీసుకెళ్లారు. గత నెల 29న గృహ ప్రవేశం చేశారు. శనివారం అందరూ కలిసి నర్సింహారెడ్డికి దగ్గరి బంధువు ఇంట్లో శుభకార్యానికి వెళ్లారు. తిరిగి వస్తుండగా దారిలో ప్రమాదం జరిగింది. దీంతో నర్సింహా రెడ్డి, లక్ష్మి, భరత్‌‌ అక్కడికక్కడే చనిపోయారు. మౌనిక తీవ్రంగా గాయపడ్డారు. అక్కడున్న వారు వెంటనే మౌనికను ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆమె పరిస్థతి విషమంగా ఉన్నట్లు సమాచారం.

పెద్దచింతకుంటలో విషాదఛాయలు

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోవడంతో పెద్దచింతకుంటలో విషాదఛాయలు అలుముకున్నాయి. తమ వారి డెడ్ బాడీలను త్వరగా ఊరికి చేర్చాలని ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులను కుటుంబసభ్యులతో పాటు గ్రామస్తులు కోరారు.