గెలిచే ఛాన్స్ ట్రంప్ కేనా..?

గెలిచే ఛాన్స్ ట్రంప్ కేనా..?

ట్రంప్ వర్సెస్ జో బిడెన్

మరో వారం రోజుల్లో అమెరికా ప్రెసిడెంట్ ఎలక్షన్స్ జరగనున్నాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం అనేక కీలక రాష్ట్రాల్లో డొనాల్డ్ ట్రంప్ కంటే ఆయన ప్రత్యర్థి జో బిడెన్ ముందంజలో ఉన్నట్టు తెలుస్తోంది. కింది స్థాయిలోనూ బిడెన్‌‌కు భారీ మద్దతు ఉందని అనిపిస్తోంది. అలాగే ఆయనకు ఓటువేసే వారు తమ ఎంపిక విషయంలో గొంతును బలంగా వినిపిస్తున్నారు. బిడెన్ ఓటర్లు తమ ఎంపికకు కారణాలను బహిరంగంగా, ప్రభావవంతంగా వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో ట్రంప్ ఓటర్ల ప్రచారంలో తెలియని స్తబ్దత కనిపిస్తోంది. కానీ, ఈ మౌనం.. సునామీ రాకకు సంకేతమని నాకనిపిస్తోంది. ఓటర్ల తీరు, భావోద్వేగాలు, ఇటీవల చోటుచేసుకున్న సివిల్ అన్​రెస్ట్, కరోనాలను పరిగణనలోకి తీసుకుంటే తీర్పు స్పష్టంగానే ఉంటుందని అనిపిస్తోంది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ తిరిగి ఎన్నికయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. రాజకీయాల్లో వారం అంటే సుదీర్ఘ సమయమని నాకు తెలుసు. బిడెన్​కు అనుకూలంగా వస్తున్న అన్ని సంకేతాలకు భిన్నంగా అభిప్రాయం ఉండటానికి నాకు కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల ఫలితం ట్రంప్ కు అనుకూలంగా ఉంటుందని, ప్రజల ఓట్లు, ఎలక్టోరల్​ కాలేజీ ఓట్లు ఆయనను విజయపథానికి చేర్చుతాయని నేను భావిస్తున్నాను.

అమెరికా సీఈవో:

ట్రంప్ తన పదవీ కాలంలో ఏనాడు కమాండర్ ఇన్ చీఫ్ గా వ్యవహరించలేదు. అమెరికా, మిగతా ప్రపంచం ఏనాడు చూడని ఒక భిన్నమైన రాజ్యాధినేతగా కొనసాగారు. వాస్తవానికి ఆయన ఒక సీఈవోగా వ్యవహరించారు. ట్రంప్ పాలసీల ప్రభావాన్ని వాస్తవ సంఖ్యలతో మదింపు చేసి చూస్తే అందులో ఆయన సక్సెస్​ అయ్యారని చెప్పవచ్చు. అమెరికాను పునర్ నిర్మించేందుకు గతంలో తీసుకున్న అనేక నిర్ణయాలను ఆయన పక్కనపెట్టారు. అంతర్జాతీయ ఒప్పందాల నుంచి వైదొలిగారు. అసమంజసమైన వాణిజ్య ఒప్పందాలను విచ్ఛినం చేశారు. పీడించే మిత్రులను విడిచిపెట్టారు. యునైటెడ్​ నేషన్స్ సంస్థలకు మద్దతు ఉపసంహరించారు. అమెరికాను తిరిగి గొప్ప రాజ్యంగా తీర్చిదిద్దే తన ఎజెండా సాధించేందుకు కొత్త టారిఫ్​లు అమలు చేస్తానని వాణిజ్య భాగస్వాములను బెదిరించారు. సంప్రదాయ అమెరికా అధ్యక్షుడిగా ఎవరైనా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం అసాధ్యం. అనేక నియమాలు, సంప్రదాయాలు, విధానాలను ట్రంప్ మార్చి సరికొత్త మార్గాన్ని సొంతంగా నిర్మించారు. ట్రంప్ పూర్తి పదవీ కాలాన్ని విశ్లేషిస్తే ఓటర్ల అంచనాలను ఆయన దాటేయడమే కాదు, అమెరికా సీఈవోగా ఓటర్ల దృష్టిలో నిలిచారు.

కరోనా ఆ తర్వాత పరిణామాలు:

కరోనా ఆ తర్వాత పరిణామాలేవి కూడా ట్రంప్ సృష్టించినవి కావు. ఆయన పాలనావ్యవస్థ ఈ సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్న తీరు వల్ల సంప్రదాయ ఓటర్లే కాదు, ఊగిసలాటలో ఉండే ఓటర్లు కూడా ట్రంప్ కు అండగా నిలుస్తారు. కరోనా కారణంగా అమెరికాలో చోటు చేసుకున్న మరణాలకు కారణం ఆ మహమ్మారిని కంట్రోల్​ చేసేందుకు తగిన ట్రీట్​మెంట్​ అందుబాటులో లేకపోవడం తప్ప ప్రభుత్వ లోపమేమీ కాదు. యూరోప్, ఇతర దేశాల మాదిరిగా కరోనాను చూసి ట్రంప్ బెదిరిపోయి దానికి లొంగిపోలేదు. తప్పనిసరిగా దేశవ్యాప్తంగా పూర్తి లాక్ డౌన్ విధించాలన్న ప్రపంచ ఆలోచన, సాధారణ ప్రజల వైఖరికి భిన్నంగా దృఢమైన నిర్ణయం కలిగి ఉన్నారు. కీలకమైన ఆ నిర్ణయం కారణంగా అనేక ఉద్యోగాలకు, ఆర్థిక వ్యవస్థకు రక్షణ లభించింది. మహమ్మారి ప్రభావం నేరుగా ప్రజల జీవితాలపై పడకుండా చూసి సాంత్వన కల్పించేందుకు సకాలంలో సరైన నిర్ణయాలు తీసుకున్నారు. చిన్న వ్యాపారులు, మధ్య తరహా సంస్థలకు అనేక ఉపశమన చర్యలు ప్రకటించారు. అలాగే ట్రీట్​మెంట్, వ్యాక్సిన్ కోసం మిలియన్ల డాలర్లు గుమ్మరించారు. కరోనా తీవ్రంగా ఉన్న దేశాల్లో టాప్​లో అమెరికా నిలిచినా ట్రంప్ తీసుకున్న మొండి నిర్ణయాల కారణంగా మిగిలిన దేశాలతో పోల్చితే తక్కువ సమయంలోనే అమెరికాలో జీవితం, వ్యాపారాలు యథాస్థితికి చేరాయి.

కలిసొచ్చిన మొండి నిర్ణయాలు

కరోనా పట్ల తన వైఖరితో జనంలో ట్రంప్​ ప్రతిష్ట మసకబారింది. భద్రతా ప్రమాణాలను పాటించకపోవడం వల్ల కొంత మంది నమ్మకస్తులైన ఓటర్లను తాత్కాలికంగా ఆయన కోల్పోయి కూడా ఉండవచ్చు. ట్రంప్ అంటే ఇష్టం లేని వారు ఎంత అనుకున్నా దేశంలో సాధారణ పరిస్థితి విజయవంతంగా తిరిగి నెలకొనడం గొప్ప విషయం. ట్రంప్ పోకడల వల్ల నిరాశ చెందిన ఓటర్లు, బిడెన్​ కన్నా ట్రంపే మెరుగని నమ్ముతారు. తన పదవీకాలం తుది దశలో ట్రంప్ ఎదుర్కొన్న అతి పెద్ద అడ్డంకి కరోనా. అదే ప్రస్తుత ఎన్నికను తీవ్ర పోటీగా మార్చింది. మహమ్మారి కష్టాలు 10 నెలల పాటు ఉండకపోయి ఉంటే ట్రంప్ తిరిగి గెలవడం నల్లేరు మీద నడకయ్యేది. కరోనాను సమర్థంగా ట్రంప్ ఎదుర్కోవడం, రాష్ట్రాలకు చేయూత అందించడం, జాతీయ ఆరోగ్య మౌలికసదుపాయాలను తగినట్టుగా విస్తరిస్తూ సకాలంలో తీసుకున్న నిర్ణయాలు, తీవ్రతను తగ్గించేందుకు ఆయన అందించిన హాస్యగుళికల కారణంగా కరోనాకు ముందున్న ఎన్నికల పరిస్థితిని ట్రంప్ సృష్టించుకోగలిగారు.

బిడెన్​ అంశం

కమలా హ్యారిస్​ను బిడెన్​ ఎంపిక చేయడం ట్రంప్ పనిని సులువు చేసింది.   దాదాపు రిటైరైన బిడెన్ కన్నా డెమోక్రాట్లలో దూకుడైన వాగ్దాటి, ఒప్పించే గుణం కలిగిన న్యూయార్క్ గవర్నర్ క్యూమో వంటి వారు బరిలో ఉంటే ట్రంప్ కు  గట్టి పోటీ ఉండేది. స్పష్టమైన దార్శనికత, సమర్థవంతమైన కార్యనిర్వహణ, అసాధారణమైన తెలివితేటలే కాదు, ఉద్యోగాలు, ఆర్థిక వ్యవస్థ, విద్య, ఆరోగ్యం, సామాజిక భద్రత వంటి కీలకమైన జాతీయ సమస్యల విషయంలో మచ్చలేని సానుకూల రికార్డును ట్రంప్​ పొందగలిగారు. వివిధ రాష్ట్రాల ఓటింగ్ తీరును బట్టి బిడెన్, హ్యారిస్ తీవ్ర నిరాశను చూస్తారు. అంతే కాదు మిషిగాన్, ఫ్లోరిడా, పెన్సిల్వేనియా, ఒహాయో, నార్త్ కరోలినా వంటి ఊగిసలాట రాష్ట్రాలను వారు కోల్పోతారని అనిపిస్తోంది. ఇప్పటి వరకు ఒహాయో మినహా మిగిలిన ఈ రాష్ట్రాల్లో డెమోక్రాట్లు భారీ ఆధిక్యతను చూపుతున్నారు. ట్రంప్ కు ఉన్న విజువల్​ పవర్, జనాభిప్రాయం, దూకుడు వంటి విషయాల్లో మౌనంగా, నిస్సత్తువగా, జనాభిప్రాయం లేని బిడెన్, హ్యారిస్ సరిజోడు కాదు. ఊగిసలాట రాష్ట్రాల్లోనూ ఈ అంశం ప్రభావం చూపుతుంది.

సంప్రదాయ జాతీయవాదం

డెమొక్రాట్ గవర్నర్ల పాలనలోని రాష్ట్రాల్లో దోపిడీలు, విధ్వంసాలను అరికట్టలేకపోవడం, వాటిని సరైన రీతిలో ఖండించకపోవడం పార్టీలకతీతంగా జనాలను నిరాశపరిచింది. జాతి వివక్ష, అసమానతలు, అన్యాయం, పోలీసుల బలప్రయోగం వంటి వాటిపై పోరాటం చేయడమన్నది ప్రజాస్వామ్యంలో తిరుగులేని కారణాలు. కానీ, ఈ ఊహించని ప్రజాస్వామ్య నిరసనలు దేశాన్ని విద్వేషం వైపు మళ్లించి వ్యక్తిగత ఆస్తుల విధ్వంసానికి, దోపిడీలకు దారితీయడం తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. జాతీయ గౌరవం, శాంతి భద్రతలు, రాజ్యాంగ ప్రక్రియ ఎజెండాగా కలిగిన రిపబ్లికన్ ఓటర్లకు ఇది ఆగ్రహం తెప్పించింది. అంతే కాదు ఊగిసలాట, మధ్యస్థాయి ఓటర్లను ఇది షాక్​కు గురిచేసింది. నిరసనల పేరుతో చేపట్టిన దోపిడీలు, చట్టధిక్కార ధోరణిని లెఫ్ట్​ ఐడియాలజీ కలిగిన చాలా మంది డెమొక్రాట్లు కూడా తిరస్కరిస్తారు. ఇటీవల చోటుచేసుకున్న అల్లర్లు, దోపిడీలు, విధ్వంసాలు చూసి ఆగ్రహంతో ఉన్న అమెరికన్ ఓటరు ఈ ఎన్నికల్లో డెమొక్రాట్ అభ్యర్థిని పక్కన పెట్టి ట్రంప్ ను ఎన్నుకుంటారని అనిపిస్తోంది. -కె.కృష్ణసాగర్ రావు, బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి

FOR MORE NEWS…

పాలన వదిలేసి.. దుబ్బాకపైనే ఫోకస్