ఎలక్ట్రాన్స్​పై ప్రయోగాలకు..ఫిజిక్స్​లో ముగ్గురికి నోబెల్

ఎలక్ట్రాన్స్​పై ప్రయోగాలకు..ఫిజిక్స్​లో ముగ్గురికి నోబెల్
  • ఆటో సెకండ్​లో పరమాణువుల పరిశీలన
  • అణువుల్లోని ఎలక్ట్రాన్లపై పరిశోధనలకు బాటలు
  • పెర్రీ అగొస్తిని, ఫెరెన్స్ క్రౌజ్, హ్యులియర్​ను వరించిన నోబెల్

స్టాక్​హోం : అణువుల్లో ఎలక్ట్రాన్‌‌ డైనమిక్స్‌‌ను అధ్యయనం చేయడంలో భాగంగా కాంతి తరంగాల ఆటో సెకండ్‌‌ పల్స్‌‌ను ఉత్పత్తి చేయడంపై చేసిన పరిశోధనలకుగానూ ముగ్గురు సైంటిస్ట్​లకు నోబెల్ ప్రైజ్ దక్కింది. అమెరికాకు చెందిన పెర్రీ అగొస్తిని, జర్మనీకి చెందిన ఫెరెన్స్‌‌ క్రౌజ్‌‌, స్వీడన్‌‌కు చెందిన అన్నె ఎల్‌‌ హ్యులియర్‌‌ నోబెల్‌‌ బహుమతి అందుకోనున్నారు. భౌతిక శాస్త్రంలో ఈ అవార్డును రాయల్‌‌ స్వీడిష్‌‌ అకాడమీ ఆఫ్‌‌ సైన్సెస్‌‌ మంగళవారం ప్రకటించింది. పెర్రీ అగొస్తిని.. అమెరికాలోని ఓహియో స్టేట్ యూనివర్సిటీలో, ఫెరెన్స్ క్రౌజ్

జర్మనీ మ్యూనిచ్​లోని లుడ్విగ్ మాక్సిమిలియన్ యూనివర్సిటీతో పాటు మాక్స్ ప్లాంక్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ క్వాంటం ఆప్టిక్స్​లో, అన్నె ఎల్ హ్యులియర్.. స్వీడన్​లోని లుండ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్లుగా సేవలు అందిస్తున్నారు. ఫిజిక్స్ విభాగంలో నోబెల్ పొందిన 5వ మహిళా శాస్త్రవేత్తగా హ్యులియర్ నిలిచారు. 1903లో మేరీ క్యూరీ, 1963లో మరియా గొప్పెర్డ్​ మేయర్, 2018లో డొన్నా స్ట్రిక్​లాండ్, 2020లో ఘెజ్ నోబెల్ ప్రైజ్ అందుకున్నారు. 

 

పెర్రీ అగొస్తిని (అమెరికా)..

1941 జులై 23న టునీషియాలో క్యాథలిక్ ఫ్రెంచ్ ఫ్యామిలీలో పుట్టారు. 1959లో ఫ్రాన్స్ లా ఫ్లేచేలోని ఫ్రెంచ్ ప్రిటానీ నేషనల్ మిలిటైర్ లో స్కూల్​ ఎడ్యుకేషన్ పూర్తి చేశారు. 1961లో యాక్స్​మార్సెల్లీ యూనివర్సిటీలో ఫిజిక్స్ విభాగంలో డిప్లామా కంప్లీట్ చేశారు. 1962లో మాస్టర్ ఆఫ్ అడ్వాన్స్ స్టడీస్​(ఎంఏఎస్), 1968లో పీహెచ్​డీ పూర్తి అయింది.

1969లో పారిస్ సక్లే యూనివర్సిటీలోని అటామిక్ ఎనర్జీ కమిషన్​(సీఈఏ) రీసెర్చర్​గా చేరారు. 2002 వరకు అక్కడే ఉన్నారు. 2002 నుంచి 2004 మధ్య బ్రూక్​హావెన్ నేషనల్ ల్యాబోరేటరీలో విజిటింగ్ సైంటిస్ట్​గా చేశారు. 2005 నుంచి ఓహియో స్టేట్ యూనివర్సిటీలో ప్రొఫెసర్​గా పనిచేస్తున్నారు.

ఫెరెన్స్‌‌ క్రౌజ్‌‌ (జర్మనీ)..

1962, మే 17న హంగేరిలో ఫెరెన్స్ క్రౌజ్ పుట్టారు. హంగేరియన్ – ఆస్ట్రియన్ ఫిజిక్స్ సైంటిస్ట్ అయిన క్రౌజ్.. ఆటో సెకండ్ సైన్స్​లో పని చేస్తున్నారు. ఈట్వోస్ లోరాండ్ యూనివర్సిటీలో థియోరాటికల్ ఫిజిక్స్ చదివారు. హంగేరి బుడాపెస్ట్​లోని టెక్నికల్ యూనివర్సిటిలో ఎలక్ట్రిక్ ఇంజినీరింగ్ స్టడీ పూర్తి చేశారు. ఆస్ట్రియాలోని టెక్నికల్ యూనివర్సిటీ ఆఫ్ వియన్నాలో విద్యాభ్యాసం చేసి..

అక్కడే ప్రొఫెసర్​ అయ్యారు. 2003లో గార్చింగ్​లోని మాక్స్​ప్లాంక్ ఇన్​స్టిట్యూట్​ఫర్ క్వాంటం ఆప్టిక్స్ డైరెక్టర్ అయ్యారు. 2004 నుంచి జర్మనీ మ్యూనిచ్​లోని లుడ్విగ్ మాక్సిమిలియన్ యూనివర్సిటీతో పాటు మాక్స్ ప్లాంక్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ క్వాంటం ఆప్టిక్స్​లో ప్రొఫెసర్​గా పని చేస్తున్నారు.

అన్నె ఎల్ హ్యులియర్ (స్వీడన్​)..

1958 ఆగస్టు 16న అన్నె ఎల్ హ్యులియర్ జన్మించారు. ఈమె ఫ్రెంచ్ ఫిజిక్స్ సైంటిస్ట్. ఆటో సెకన్ ఫిజిక్స్ గ్రూప్​కు నాయకత్వం వహిస్తున్నారు. ఆటో సెకన్స్​ కాలంలో ఎలక్ట్రాన్ల కదలికలపై అధ్యయనం చేస్తున్నారు. ఇది పరమాణు స్థాయిలో రసాయన ప్రతిచర్యలను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. 2003లో ఆమె బృందం.. 170 ఆటో సెకన్ల అతి చిన్న లేజర్ పల్స్​తో ప్రపంచ రికార్డును అధిగమించింది.

థియోరిటికల్ ఫిజిక్స్, మ్యాథమెటిక్స్​లో మాస్టర్ ఆఫ్ సైన్స్ పూర్తి చేశారు. స్వీడన్​లోని గోథెన్​బర్గ్, అమెరికాలోని లాస్ ఏంజిలిస్​లో ఉన్న హ్యులియర్.. 1986లో శాక్లే న్యూక్లియర్ రీసెర్చ్ సెంటర్​లో పర్మనెంట్ ఎంప్లాయ్​గా చేరారు. 1994లో స్వీడన్​కు వెళ్లిపోయారు. 1995లో లుండ్ యూనివర్సిటీలో లెక్చరర్​గా చేరి.. 1997లో ప్రొఫెసర్ ​స్థాయికి చేరుకున్నారు.

ముగ్గురు సైంటిస్టులు చేసిన పరిశోధన ఏంటి?

ఒక పదార్థంలోని ఎలక్ట్రాన్ డైనమిక్స్ పై పెర్రీ అగొస్తిని, ఫెరెన్స్‌‌ క్రౌజ్‌‌, అన్నె ఎల్‌‌ హ్యులియర్‌‌ పరిశోధనలు చేశారు. స్ప్లిట్ (ఆటో) సెకన్ కాలంలో వీరు పరమాణువులను పరిశీలించారు. అణువులు, అణువుల లోపల ఉన్న ఎలక్ట్రాన్ల ప్రపంచాన్ని అన్వేషించడానికి ఈ ముగ్గురు సైంటిస్ట్​లు ప్రయోగాత్మక విధానాలకు బాటలు వేశారు. ఎలక్ట్రాన్లు కదిలే లేదా శక్తిని మార్చే వేగవంతమైన ప్రక్రియలను కొలిచేందుకు ఉపయోగించే ఓ ప్రయోగాత్మక పద్ధతిని వీరు కనుగొన్నారు. ఈ ప్రక్రియ అంతా స్ల్పిట్ సెకన్ కాలంలోనే పూర్తవుతుంది.

వీరి పరిశోధనలతో పరమాణువులు, అణువులలో ఎలక్ట్రాన్స్ గురించి మరింత స్టడీ చేసేందుకు సరికొత్త ఆవిష్కరణలు అందుబాటులోకి వచ్చాయి. వాయువులోని పరమాణువులతో లేజర్ కాంతి పరస్పర చర్య నుండి కొత్త ప్రభావాన్ని అన్నె ఎల్‌‌ హ్యులియర్‌‌ కనుగొంటే.. పెర్రీ అగొస్తిని, ఫెరెన్స్‌‌ క్రౌజ్‌‌లు ఈ ప్రభావాన్ని గతంలో సాధ్యమైన దానికంటే తక్కువ కాంతి పల్స్‌‌లను రూపొందించడానికి ఉపయోగించొచ్చని నిరూపించారు.