బ్రిడ్జి కూలిన ఘటనపై జో బైడెన్‌ దిగ్ర్భాంతి

బ్రిడ్జి కూలిన ఘటనపై జో బైడెన్‌ దిగ్ర్భాంతి

గుజరాత్‌ మోర్బీ ఘటనలో ఇప్పటివరకూ 141మ-ృత్యువాత పడ్డారు. ఇంకా పలువురి జాడ తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై ఇప్పటికే పలువురు ప్రముఖులు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. తాజాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఈ ప్రమాదంపై స్పందించారు. కేబుల్ బ్రిడ్జి దుర్ఘటన చాలా దిగ్భ్రాంతికరమన్న బైడెన్.. ఈ ప్రమాదంలో ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు జిల్‌, తాను ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో భారతీయులకు అండగా నిలుస్తామని బైడెన్‌ ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు. 

గుజరాత్‌‌లోని మోర్భీలో జరిగిన ఘోర ప్రమాదంలో చనిపోయిన వారి సంఖ్య  141కి చేరింది. గల్లంతైన వారి కోసం ఇప్పటికే అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. పరిమితికి మించి భారీగా జనం వెళ్లడంతో మచ్చు నదిపై కట్టిన తీగల వంతెన కుప్పకూలిపోయింది. దీంతో వంతెనపై ఉన్న వందలాది మంది సందర్శకులు మచ్చు నదిలో పడిపోయారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 9మందిని అరెస్టు చేశారు. వారిపై 304, 308 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ‘‘ఒరెవా కంపెనీకి చెందిన ఇద్దరు మేనేజర్లు, ఇద్దరు టికెట్ బుకింగ్ క్లర్క్‌‌లతోపాటు ఇద్దరు రిపైరింగ్ కాంట్రాక్టర్లను, ముగ్గురు సెక్యూరిటీ సిబ్బందిని అరెస్టు చేశామని ఐజీ అశోక్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు.