బైడెన్ శాసించాడు.. సీఐఏ పాటించింది

బైడెన్ శాసించాడు.. సీఐఏ పాటించింది

బైడెన్ శాసించాడు.. సీఐఏ పాటించింది

రష్యా గ్యాస్ పైప్ లైన్ల పేల్చివేతపై అమెరికా జర్నలిస్టు ఆరోపణ

వాషింగ్టన్ : బాల్టిక్​ సముద్ర గర్భంలో రష్యాకు చెందిన నార్డ్  స్ట్రీం 1, స్ట్రీం2 (ఎస్ఎస్ 2) గ్యాస్  పైప్‌‌‌‌‌‌‌‌ లైన్లను అమెరికాకు చెందిన సెంట్రల్  ఇంటెలిజెన్స్  ఏజెన్సీ (సీఐఏ) పేల్చివేసిందని ఆ దేశ ఇన్వెస్టిగేటివ్  జర్నలిస్టు సేమోర్ హెర్ష్  ఆరోపించారు. ప్రెసిడెంట్​ జో బైడెన్ ఆదేశాలతో నిరుడు సెప్టెంబరులో ఈ రహస్య ఆపరేషన్  జరిగిందని పేర్కొన్నారు. యూఎస్  నేవీకి చెందిన డీప్ సీ డైవర్లు ఆ పైప్ లైన్ల వెంట 2022 జూన్ లో మందుపాతర్లు అమర్చి, సెప్టెంబర్ లో రిమోట్  సాయంతో వాటిని బ్లాస్ట్  చేశారని తాను స్వయంగా పబ్లిష్  చేసుకున్న  బ్లాగ్ లో హెర్ష్  చెప్పారు. నాలుగు నార్డ్  స్ట్రీం పైప్ లైన్లలో మూడు దెబ్బతిన్నాయని తెలిపారు. ఈ ఆపరేషన్ కు ముందు నేషనల్  సెక్యూరిటీ అధికారులతో ప్రెసిడెంట్  బైడెన్ తొమ్మిది నెలలపాటు చర్చలు నిర్వహించారని, జాతీయ భద్రతా సలహాదారు జేక్  సల్లివాన్, విదేశాంగ శాఖ మంత్రి ఆంటొనీ బ్లింకెన్ తదితరులు ఈ చర్చల్లో పాల్గొన్నారని హెర్ష్  తన బ్లాగ్ లో  పేర్కొన్నారు. ‘‘రష్యా నుంచి జర్మనీ, యూరోప్  దేశాలకు చవకగా గ్యాస్​ను సరఫరా చేసేందుకు బాల్టిక్  సముద్ర గర్భంలో ఈ గ్యాస్ పైప్ లైన్లు వేశారు. ఈ పైప్ లైన్లు జర్మనీ ఆర్థిక వ్యవస్థకు వరంగా ఉపయోగపడుతున్నాయి.

రష్యా సహజ వాయువును ఎంతో చీప్ గా వాడుకున్న జర్మనీ.. మిగులు గ్యాస్ ను మిగతా వెస్టర్న్ యూరోప్  దేశాలకు అమ్మి మంచి లాభాలు సంపాదించింది’’ అని హెర్ష్  అన్నారు. ఆ గ్యాస్  పైప్ లైన్లను పేల్చివేయడానికి 2021 డిసెంబర్ లోనే ప్లాన్  చేశారని, సబ్ మెరైన్  సాయంతో వాటిని పేల్చివేయాలని నేవీ ప్రతిపాదించగా.. బాంబులు వేసి రిమోట్  ద్వారా పేల్చివేయాలని ఎయిర్ ఫోర్స్  ప్రతిపాదించిందని ఆయన చెప్పారు. అయితే హెర్ష్​ ఆరోపణలను వైట్ హౌస్  ఖండించింది. ఆయన ఆరోపణలు పూర్తిగా అవాస్తమని, కట్టుకథ అని సీఐఏ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు.