మామూలుగా అయితే ఎవరికైనా యాక్సిడెంట్ జరిగితే కొన్ని సందర్భాల్లో గతాన్ని మరిచిపోతుంటారు. కానీ, ఓ కార్ సేల్స్మ్యాన్కు మాత్రం తనలో అప్పటిదాకా లేని కొత్త ట్యాలెంట్ పుట్టుకొచ్చింది. మంచి ‘పెయింటర్’ను చేసింది. అవును, అమెరికాలోని నార్త్కరోలినాకు చెందిన 42 ఏళ్ల స్కాట్ మీలీ కథ ఇది. 2015లో ఓ ఇంటర్సెక్షన్ దగ్గర ఆపి ఉన్న తన కారును వేగంగా వస్తున్న ఇంకో కారు ఢీకొట్టింది. ఆ ప్రమాదంలో స్కాట్ తలకు తీవ్రగాయాలయ్యాయి. దాని ప్రభావం మెదడుపై పడింది. ఆ ప్రమాదం నుంచి బయటపడినా డిప్రెషన్, యాంగ్జైటీతో బాధపడ్డాడు. ఆ తర్వాత కొన్ని నెలలకు తన పిల్లలతో కలిసి షాపుకెళ్లిన స్కాట్, పెయింటింగ్ బ్రష్, ఇతర వస్తువులను కొన్నాడు.
అప్పటిదాకా ఆ బ్రష్ పట్టుకోవడం కూడా తెలియని అతడు, అద్భుతమైన బొమ్మలు గీశాడు. దీంతో తానేనా ఇంత మంచి పెయింటింగ్ వేసింది అని అనుకున్నాడు. మళ్లీ ఇంకో పెయింటింగ్ వేశాడు. అదీ సూపరే. అయితే, దానికీ కారణముందని చెబుతున్నారు డాక్టర్లు. పదిలక్షల మందిలో ఒకరికి ఇలా జరుగుతుందని అంటున్నారు. దాన్నే ‘అక్వైర్డ్ సావంత్ సిండ్రోమ్’ అని చెబుతున్నారు. అంటే ఏదైనా ప్రమాదం, లేదా ఆటిజంతో బాధపడుతున్న వాళ్లు రికవరీ అయ్యాక సడన్గా ఇలాంటి లేని ట్యాలెంట్లు పుట్టుకొస్తాయని చెబుతున్నారు. ఎందుకు అలా జరుగుతుందో చెప్పలేమంటున్న సైంటిస్టులు, బ్రెయిన్లోని ఓ రీజియన్ యాక్టివేట్ అవ్వడం వల్ల ఇలాంటి ట్యాలెంట్లు వస్తుండొచ్చని చెబుతున్నారు. అయితే, ఆడవాళ్లతో పోలిస్తే మగవాళ్లలోనే ఇలాంటి సడన్ ట్యాలెంట్లు వస్తుంటాయని అంటున్నారు. ప్రస్తుతం ప్రపంచం మొత్తంలో ఇలాంటి కేసులు 33 దాకా ఉండొచ్చని అంచనా.
