అమెరికా విమానం రెక్కలు తాలిబాన్లకు ఉయ్యాలలు!

అమెరికా విమానం రెక్కలు తాలిబాన్లకు ఉయ్యాలలు!
  • అమెరికా విమానం రెక్కలు తాలిబాన్లకు ఉయ్యాలలు!
  • చైనా అధికారి ఎగతాళి
  • వృధా ఖర్చులు వద్దని తాలిబాన్లు ప్రమాణ స్వీకార వేడుకలు రద్దు చేస్కున్నరు

బీజింగ్: అఫ్గానిస్తాన్​లో అమెరికా వదిలేసిన ఆర్మీ విమానాలు తాలిబాన్లకు ఆటబొమ్మలు అయ్యాయంటూ యూఎస్ ను చైనా విదేశాంగ అధికారి లిజియాన్ ఝావో ఎద్దేవా చేశారు. తాలిబాన్లు యూఎస్ ఆర్మీ విమానం రెక్కకు తాళ్లు కట్టి ఉయ్యాల ఊగుతున్న వీడియోను ఆయన శుక్రవారం ట్విట్టర్​లో పోస్ట్ చేశారు. ‘‘సామ్రాజ్యాల శ్మశానం.. వాళ్ల వార్ మెషీన్లు..” అంటూ కామెంట్ చేశారు. అఫ్గాన్​లోని గుర్తుతెలియని ప్రాంతంలో వదిలేసి ఉన్న అమెరికా విమానాల వద్ద కొందరు తాలిబాన్లు ఉయ్యాల ఊగుతూ, ఆడుకుంటున్న ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిపోయింది. కాగా, అఫ్గాన్ నుంచి అమెరికా బలగాలు వెనక్కి వెళ్లడానికి కొన్ని వారాల ముందు అఫ్గాన్ ఎయిర్ ఫోర్స్ వద్ద 108 హెలికాప్టర్లు, 59 మిలిటరీ విమానాలు ఉన్నాయి. బలగాల ఉపసంహరణకు ముందు అమెరికా 46 విమానాలను, 24 హెలికాప్టర్లను మాత్రమే ఉజ్బెకిస్తాన్​కు తరలించగలిగింది. మిగతావి పనిచేయకుండా ధ్వంసం చేసింది. విమానాల్లోని ఏవియానిక్స్ సిస్టంలు, ప్రొపెల్లర్లు, గన్స్ ను తొలగించింది. టైర్లు సైతం ధ్వంసం చేసి, వాటిని తాలిబాన్లు ఉపయోగించుకోకుండా చేసింది. ఇప్పటికి తాలిబాన్ల వద్ద 48 ఆర్మీ విమానాలు ఉన్నప్పటికీ, వాటిలో పనిచేసే స్థితిలో ఉన్నవి ఎన్ని? అన్న విషయంలో క్లారిటీ లేదు. వాటిలో చాలా విమానాలు 1980ల నాటివి కావడంతో ఎప్పటికప్పుడు సర్వీసింగ్, కొత్త పార్ట్స్ అవసరం అవుతాయని, అందువల్ల వాటిని తాలిబాన్లు ఎన్నిరోజులు నడపగలరన్నదీ డౌటేనని చెప్తున్నారు.  

ప్రమాణ స్వీకారం రద్దు.. 
అఫ్గాన్​లో కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని తాలిబాన్లు రద్దు చేసుకున్నారు. డబ్బులు, వనరుల వృథా ఖర్చును నివారించేందుకే ప్రమాణ స్వీకార వేడుకను పక్కన పెడ్తున్నట్లు తాలిబాన్ లు శుక్రవారం ప్రకటించారు. ఇస్లామిక్ ఎమిరేట్ కొత్త కేబినెట్ ను ఇదివరకే ప్రకటించిందని, మంత్రులు తమ విధులు కూడా ప్రారంభించారని తాలిబాన్ నేత ఇనాముల్లా వెల్లడించారు. షెడ్యూల్ ప్రకారం శనివారం (సెప్టెంబర్ 11) తాలిబాన్ సర్కార్ ఇనాగ్యురల్ సెర్మనీ జరగాల్సి ఉండగా, ఇప్పటికే రష్యా, ఇరాన్, చైనా, ఖతర్, పాకిస్తాన్ వంటి దేశాలకు తాలిబాన్లు ఆహ్వానం పంపారు. అయితే అమెరికాతో సహా నాటో దేశాల నుంచి వచ్చిన ప్రెజర్ కారణంగానే ప్రమాణ స్వీకార కార్యక్రమం రద్దు అయినట్లు రష్యాకు చెందిన టాస్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. టెర్రరిస్ట్ నేతలు మంత్రులుగా నియమితులు కావడం, అందరూ ఒకే వేదికపై ప్రమాణంచేయడం వల్ల తాలిబాన్లకు అంతర్జాతీయ గుర్తింపు మరింత ప్రమాదంలో పడుతుందని అమెరికా హెచ్చరించినట్లు తెలిపింది.