గోధుమల కన్నా జొన్నలే బెటర్..

గోధుమల కన్నా జొన్నలే బెటర్..
  • గోధుమల కన్నా జొన్నలే బెటర్..
  • టెంపరేచర్లు పెరిగితే.. జొన్న పంటే తట్టుకుంటది 
  • 2040 నాటికి గోధుమ దిగుబడులు 5% తగ్గుతయ్  
  • నీటి వాడకం12 శాతం పెరుగుతది 
  • జొన్నలకు నీటి వాడకం పెరుగుదల 4 శాతమే  
  • దిగుబడులు గణనీయంగా పెరుగుతయ్ 
  • ఐఎస్బీ, ఐఐటీ బాంబే, యేల్ యూనివర్సిటీ స్టడీలో వెల్లడి

హైదరాబాద్, వెలుగు : ఎక్కువ టెంపరేచర్ లను తట్టుకుని పంట నిలబడాలన్నా, అధిక దిగుబడి కావాలన్నా, ఎక్కువ పోషకాలతో కూడిన ఫుడ్ అందాలన్నా.. గోధుమల కంటే జొన్నలే బెటర్ అని సైంటిస్టులు స్పష్టం చేస్తున్నారు. గోధుమల కన్నా జొన్నల సాగుకు నీళ్లు తక్కువ అవసరమని, టెంపరేచర్లు బాగా పెరిగినా జొన్న పంట తట్టుకుని నిలబడ్తదని చెప్తున్నారు. టెంపరేచర్లు పెరిగితే గోధుమల దిగుబడులు పడిపోతాయని, కానీ జొన్నల దిగుబడి మాత్రం పెరుగుతుందని ఈ మేరకు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ), ఐఐటీ బాంబే, యేల్ యూనివర్సిటీ (అమెరికా) సైంటిస్టులు చేసిన అధ్యయనంలో వెల్లడైంది. వరి పంటతో పోల్చినా కూడా జొన్నలే మంచి ప్రత్యామ్నాయం అని వారు పేర్కొన్నారు. 

వరి కన్నా కూడా జొన్నలే మేలు 

రబీ సీజన్​లో మిగతా పంటలతో పోలిస్తే గోధుమ పంట కాలం ఎక్కువగా ఉంటుంది. జొన్న పంటతో పోలిస్తే గోధుమలకు1.4 రెట్లు ఎక్కువ నీళ్లు అవసరమని సైంటిస్టులు తేల్చారు. అయితే నానాటికీ పెరుగుతున్న టెంపరేచర్లతో గోధుమ పంటకు 2040 నాటికి నీటి వాడకం12 శాతం ఎక్కువైతుందని అంచనా వేశారు. అంతేగాకుండా గోధుమ దిగుబడులు 5 శాతం మేర పడిపోతాయని కూడా తేల్చారు. కానీ జొన్న పంట విషయంలో మాత్రం పరిస్థితి కొంచెం మెరుగ్గా ఉంది. 2040 నాటికి జొన్న పంటకు నీటి వాడకం పెరుగుదల 4 శాతం ఉంటుందని పేర్కొన్నారు. 

దిగుబడులు గణనీయంగా పెరుగుతాయన్నారు. టెంపరేచర్​ను జొన్న పంట తట్టుకున్నంతగా గోధుమ పంట తట్టుకోలేకపోవడమే ఇందుకు కారణమని రీసెర్చర్లు చెప్తున్నారు. ఎండలు పెరిగే కొద్దీ గోధుమలు నీటిని ఎక్కువగా తాగేస్తుంటాయని అంటున్నారు. జొన్న మొక్కలు మాత్రం నీటిని ఒడిసిపట్టుకుని స్టోర్ చేసుకుంటాయని, ఎండలు పెరిగినప్పుడు ఆ నీటిని వాడుకుంటాయని చెప్తున్నారు. ఈ కారణం వల్లే జొన్న పంటను క్లైమేట్ రెసీలియెంట్ క్రాప్ అని పిలుస్తున్నారు. రబీ సీజన్ లో వరి పంటతో పోల్చినా జొన్నలే మంచి ఆప్షన్ అవుతుందని స్పష్టం చేస్తున్నారు. పోషకాల కోణంలో చూసినా జొన్న పంటవైపు మళ్లాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు.