మంచు తుఫానుకు అమెరికాలో 50 మంది మృతి

మంచు తుఫానుకు అమెరికాలో 50 మంది మృతి

వాషింగ్టన్ : ఎముకలు కొరికే చలితో అమెరికన్లు అల్లాడుతున్నారు. మంచు తుఫాను కారణంగా వివిధ రాష్ట్రాల్లో ఇప్పటి వరకు 50 మంది చనిపోయారు. వెస్టర్న్ న్యూయార్క్ లో మూడున్నర అడుగుల ఎత్తులో మంచు పేరుకుపోయింది. చాలా నగరాల్లో ఇండ్లను మంచు కమ్మేసింది. ఇండ్ల ముందు పార్క్​చేసిన వాహనాలు మంచులో ఇరుక్కుపోయాయి. పలు రాష్ట్రాల్లో కరెంట్  లేక లక్షల ఇండ్లు చీకట్లోనే ఉండిపోయాయి. విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. న్యూయార్క్ స్టేట్​లో మంచు తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంది. రాష్ట్రంలోని బఫేలో సిటీలో ఎమర్జెన్సీ సర్వీసులు కూడా బంద్  అయ్యాయి. సిటీలో కొంతమంది కార్లలోనే చనిపోయారు. బాధితులకు సహాయం చేయడానికి బయల్దేరిన రెస్క్యూ టీంలు, ఎమర్జెన్సీ వెహికల్స్  కూడా మంచులో చిక్కుకున్నాయి.

ఆదివారం మంచును తవ్వి అంబులెన్స్ లను బయటకు తీశారు. మంచులో ఇరుక్కున్న సిబ్బందిని రెస్క్యూ టీం కాపాడిందని న్యూయార్క్ లోని ఎరీ కౌంటీ పోలీసులు తెలిపారు. ఈ కౌంటీలో కూడా రోడ్లపై నిలిపిన కార్లలోనే పలువురు ప్రాణాలు కోల్పోయారు. న్యూయార్క్  రాష్ట్రంలో కార్లలో చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు కొన్ని వందల నేషనల్  గార్డ్  ట్రూప్స్ ను తరలించారు. వారికి పోలీసులు కూడా సాయంగా వెళ్లారు. పరిస్థితి ఇంకా ప్రమాదకరంగా ఉందని న్యూయార్క్  గవర్నర్  క్యాతీ హోకల్ వెల్లడించారు. పౌరులు ఇండ్లలోనే ఉండాలని ఆమె కోరారు. ఎరీ కౌంటీలో వాహనాల డ్రైవింగ్ పై నిషేధం ఉందన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. సోమవారం న్యూయార్క్ సిటీలో మీడియాతో ఆమె మాట్లాడారు.‘‘వారం రోజులుగా మంచు తుఫాను కారణంగా వేల ఫ్లైట్లను క్యాన్సిల్  చేశాం. సదరన్  స్టేట్స్ లోని ఓర్లాండో, జాక్సన్ విల్లే, తలహస్సీ, మొబైల్, మాంట్ గోమరీ, బర్మింగ్ హాం వంటి నగరాల్లో కోటి మంది మంచు గుప్పిట చిక్కుకున్నారు” అని క్యాతీ పేర్కొన్నారు.