యుద్ధ సమయంలో కీలక నిర్ణయం తీసుకున్న కమలా హ్యారిస్

యుద్ధ సమయంలో కీలక నిర్ణయం తీసుకున్న కమలా హ్యారిస్

ఉక్రెయిన్‎పై రష్యా దాడులు 10వ రోజు కొనసాగుతూనే ఉన్నాయి. ఉక్రెయిన్‎లోని ముఖ్యమైన సిటీ ఖార్కివ్‎లో వరుస పేలుళ్లు చోటుచేసుకుంటున్నాయి. ఖార్కివ్‎లోని ప్రజలు దగ్గర్లోని షెల్టర్లకు వెళ్లాలని ఉక్రెయిన్ ప్రభుత్వం సూచించింది. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఉక్రెయిన్ సరిహద్దు దేశాల్లో పర్యటించాలని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 9 నుంచి 11 మధ్య ఉక్రెయిన్ సరిహద్దులోని పోలాండ్, రోమేనియాలో పర్యటించనున్నారు. రష్యాకు వ్యతిరేకంగా నాటో భాగస్వామ్య  దేశాలను ఏకాతాటిపై తెచ్చేందుకు కమలా హారిస్ ఈ పర్యటన చేస్తున్నట్లు ఆమె డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ సబ్రినా సింగ్ తెలిపారు. ఉక్రెయిన్‎కు భద్రత, ఆర్థిక, మానవతా సాయంపై ఆయా దేశాలతో హారిస్ చర్చించనున్నట్లు తెలిపారు.

ఉక్రెయిన్‎లోని రెండో అతిపెద్ద అణు కేంద్రం మైకోలైన్ ఒబ్లాస్ట్‎లోని న్యూక్లియర్ పవర్ ప్లాంటును రష్యా దళాలు చేరుకుంటున్నాయి. పవర్ ప్లాంటుకు 20 మైళ్ల దూరంలోనే రష్యా దళాలు ఉన్నట్లు అమెరికా తెలిపింది. ఇప్పటికే జపోరిజియా న్యూక్లియర్ ప్లాంటుపై దాడులు చేసిన రష్యా సేనలు... ప్లాంటును ఆక్రమించుకున్నట్లు ప్రకటించాయి.

ఉక్రెయిన్‎లోని ప్రధాన నగరాలను చేజిక్కించుకునేందుకు రష్యా సేనలు శక్తిమంతమైన ఆయుధాలు వాడుతున్నాయి. ముఖ్యంగా సౌత్ ఉక్రెయిన్ పైన  దృష్టి పెట్టిన రష్యా... సముద్రతీరంలోని ఒక్కో ప్రాంతాన్ని ఆక్రమిస్తుంది. చెర్నిహివ్‎లోని నివాస ప్రాంతాలపై బాంబుల వర్షం కురిపించడంతో.. 33 మంది చనిపోయారు. బ్లాక్ సీ పోర్టు సమీపంలోని ఖేర్సన్ సిటీని స్వాధీనం చేసుకున్నట్లు రష్యా సైన్యం తెలిపింది. మరో సిటీ మరియుపోల్‎లో భీకర దాడులు కొనసాగుతున్నాయి. దాంతో చెట్లను కూల్చి, బారికేడ్లు పెట్టి ఇళ్లను రక్షించుకోవాలని.. శత్రసైన్యంపై దాడులు చేయాలని ఉక్రెయిన్ ప్రభుత్వం సూచనలు చేసింది.

కాగా.. రష్యాతో మూడోసారి చర్చలు జరపాలని ఉక్రెయిన్ ప్లాన్ చేస్తుంది. యుద్ధాన్ని ఆపేందుకు ఇప్పటికే రష్యాతో రెండు సార్లు చర్చలు జరిపినా ఎలాంటి పురోగతి కనిపించలేదు. అయితే ఈ పోరుకు ముగింపు పలకడానికి మూడోసారి రష్యాతో చర్చలు జరపాలని ఉక్రెయిన్ ఆలోచిస్తుంది. మరో రెండు రోజుల్లో చర్చలు జరిపే అవకాశముందని ఉక్రెయిన్ అధ్యక్షుడి సలహాదారు తెలిపారు. ఉక్రెయిన్‎లోని ఎయిర్ స్పేస్‎ని నో ఫ్లై జోన్‎గా ప్రకటించడాన్ని నాటో తిరస్కరించింది. ఉక్రెయిన్‎ను నో ఫ్లై జోన్‎గా మార్చాలంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ నాటోను కోరారు. 

ఉక్రెయిన్‎పై భీకర దాడులు చేస్తున్న రష్యాపై ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. రష్యాకు చిప్స్, స్మార్ట్ ఫోన్లు, హౌస్ హోల్డ్ అప్లయన్సెన్స్ సరఫరాను నిలిపివేసినట్లు సామ్ సంగ్ ఎలక్ట్రానిక్స్ ప్రకటించింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా... ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. మరోవైపు.. ఉక్రెయిన్‎కు సామ్ సంగ్ 6 మిలయన్ డాలర్ల హ్యుమానిటీ హెల్ప్ అందించినట్లు కీవ్ మీడియా తెలిపింది.