న్యూఢిల్లీ, వెలుగు: కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై దేశ ప్రజల్లో ఉన్న తీవ్ర ఆగ్రహం కళ్లముందు కనిపిస్తుంటే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ‘ప్రజాస్వామ్య పరిరక్షణ’ పేరిట తెలంగాణలో పాదయాత్ర చేయడం హాస్యాస్పదంగా ఉందని కాంగ్రెస్ ఎంపీల కన్వీనర్ డాక్టర్ మల్లు రవి ఎద్దేవా చేశారు. సోమవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో అమిత్ షా చేపడుతున్న పాదయాత్రపై మండిపడ్డారు.
అమిత్ షా పాదయాత్ర చేయడం రావణాసురుడు ప్రజాస్వామ్య నీతులు వల్లించినట్లుగా ఉందని విమర్శించారు. ఒకవైపు రాజ్యాంగం, రాజ్యాంగబద్ధ వ్యవస్థలపై దాడులు చేస్తూ... మరోవైపు ‘పరిరక్షణ యాత్రలు’ చేస్తుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజల పోరాట చైతన్యం ముందు బీజేపీ నేతల మాటల గారడీలు సాగవని హితవు పలికారు. సమున్నతమైన సాయుధ పోరాటం, ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమాల చరిత్ర కలిగిన తెలంగాణ ప్రజలు ఎంతో చైతన్యవంతులని... గుజరాత్ నేతలు వచ్చి చెప్పే మాటలు వినడానికి ఇక్కడి ప్రజలు సిద్ధంగా లేరని స్పష్టం చేశారు. అమిత్ షా చేపడుతున్న యాత్రల వెనుక ఉన్న అసలు రాజకీయ ఉద్దేశాలు త్వరలోనే బయటపడతాయని పేర్కొన్నారు.
మూసీ, మెట్రో-2 ప్రాజెక్టులకు సహకరించండి
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతోన్న మూసీ నది పునరుజ్జీవం, రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టులు, మెట్రో-2 ప్రాజెక్టు, రోడ్డు కనెక్టివిటీ విస్తరణ వంటి అభివృద్ధి పథకాలకు సహకరించాలని జపాన్ పొలిటికల్ అఫైర్స్ మినిస్టర్ సతోషి జింబోకు ను ఎంపీ మల్లు రవి విజ్ఞప్తి చేశారు. సోమవారం జపాన్ రాయబార కార్యాలయంలో జింబోతో ఎంపీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా భారత్-జపాన్ వ్యూహాత్మక భాగస్వామ్యంలో భాగంగా తెలంగాణ అభివృద్ధి ప్రాధాన్యతలపై చర్చించారు. మూసీ పునజ్జీవం, రోడ్డు కనెక్ట్ విటీ, మెట్రో విస్తరణ ప్రాజెక్టుల్లో జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ (జికా) వహించాల్సిన పాత్ర గురించారు. దాదాపు అరగంట పాటు సాగిన భేటీలో.. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం పటిష్టమైన మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమిస్తోందని జింబోకు వివరించారు.
మూసీ పునరుజ్జీవంతో పాటు హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-2, ఔటర్ రింగ్ రోడ్డును రీజినల్ రింగ్ రోడ్డుతో అనుసంధానించే రేడియల్ రోడ్ల నిర్మాణానికి జైకా ఆర్థిక, సాంకేతిక మద్దతును ప్రభుత్వం ఆశిస్తోందని పేర్కొన్నారు. జపాన్ భాగస్వామ్యం ద్వారా రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు, సుస్థిరమైన మౌలిక సదుపాయాలు, ప్రజలకు మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని మల్లు రవి ఆశాభావం వ్యక్తం చేశారు.
