ఓట్ల కోసమే హిందుత్వంపై ద్వేషం.. ప్రతిపక్ష ఇండియా కూటమిపై అమిత్ షా ఫైర్

ఓట్ల కోసమే హిందుత్వంపై ద్వేషం.. ప్రతిపక్ష ఇండియా కూటమిపై అమిత్ షా ఫైర్

దుంగర్పూర్: ప్రతిపక్ష పార్టీల ఇండియా కూటమి.. హిందుత్వాన్ని వ్యతిరేకిస్తోందని, మన సంస్కృతీ సంప్రదాయాలపై దాడి చేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మండిపడ్డారు. ఆదివారం రాజస్థాన్ దుంగర్పూర్ జిల్లాలోని బేనేశ్వర్ ధామ్ లో బీజేపీ ‘పరివర్తన్ యాత్ర’ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పబ్లిక్ ర్యాలీలో అమిత్​షా మాట్లాడుతూ.. సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన కామెంట్లపై స్పందించారు. ప్రతిపక్ష పార్టీలు ఓట్ల కోసం సనాతన ధర్మాన్ని అవమానిస్తున్నాయని మండిపడ్డారు.

 ‘‘ఓటు బ్యాంక్, బుజ్జగింపు రాజకీయాల కోసం ఇండియా కూటమి పార్టీల నేతలు సనాతన ధర్మాన్ని అవమానిస్తూ మాట్లాడుతున్నారు. ఇలా చేయడం ఆ పార్టీల నేతలకు అలవాటే. ఇంతకుముందు రాహుల్ గాంధీ.. లష్కరే తాయిబా లాంటి టెర్రర్ సంస్థల కంటే హిందూ ఆర్గనైజేషన్లు ప్రమాదకరమైనవని అన్నారు. ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఇండియా కూటమి నేతలు ఎంతకైనా తెగిస్తారు” అని ఫైర్ అయ్యారు. ‘‘మోదీ మళ్లీ గెలిస్తే ‘సనాతన పాలన’ వస్తుందని ప్రతిపక్షాలు అంటున్నాయి. కానీ సనాతన ధర్మం ప్రజల హృదయాలను గెలుచుకుంది. దేశంలో పాలన రాజ్యాంగం ఆధారంగానే జరుగుతుంది” అని చెప్పారు.

అయోధ్య గుడి నిర్మాణాన్ని కాంగ్రెస్ అడ్డుకున్నది..  

కాంగ్రెస్ ఏండ్ల తరబడి అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని అడ్డుకున్నదని అమిత్ షా ఆరోపించారు. సుప్రీంకోర్టు తీర్పుతో అద్భుతంగా అయోధ్యలో రామాలయం నిర్మిస్తున్నామని, అది జనవరి నాటికి పూర్తవుతుందని చెప్పారు. ఇప్పుడు దాన్ని ఇండియా కూటమి అడ్డుకోలేదన్నారు. ‘‘రాజస్థాన్ సర్కార్ వందల కోట్లలో అవినీతికి పాల్పడింది. సీఎం అశోక్ గెహ్లాట్ అవినీతి అక్రమాలన్నీ రెడ్ డైరీలో ఉన్నాయి. 

మైనింగ్ స్కామ్, టీచర్ల ట్రాన్స్ ఫర్స్ స్కామ్ వివరాలన్నీ అందులో ఉన్నాయి” అని పేర్కొన్నారు. గెహ్లాట్ కు దమ్ముంటే, తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని ప్రజల ముందు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలని సవాల్ విసిరారు. ‘‘యూపీఏ ప్రభుత్వం రాజస్థాన్ కు చేసిందేమీ లేదు. యూపీఏ హయాంలో పదేండ్లలో రాష్ట్రానికి రూ.1.60 లక్షల కోట్లు ఇస్తే, మోదీ తొమ్మిదేండ్లలో ఏకంగా రూ.8.71 లక్షల కోట్లు ఇచ్చారు” అని పేర్కొన్నారు.