2019లో గెలవలేకపోయిన 144 సీట్లపై గురి

2019లో గెలవలేకపోయిన 144 సీట్లపై గురి

ఢిల్లీలోని బీజేపీ జాతీయ కార్యాలయంలో  2024 సార్వత్రిక ఎన్నికలపై కీలకమైన మేధోమథన సమావేశం జరిగింది. ఇందులో పార్టీ అగ్రనేతలు పాల్గొని భవిష్యత్ ప్రణాళికలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రధానంగా 2019 ఎన్నికల్లో బీజేపీ గెలవలేకపోయిన 144 లోక్ సభ స్థానాలపై ముఖ్యమైన డిస్కషన్ జరిగింది. పక్కా ప్రణాళిక, క్షేత్ర స్థాయి సంసిద్ధత ద్వారా వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఆ 144 స్థానాల్లో గెలుపుబావుటా ఎగరేయడం సాధ్యమేననే అభిప్రాయానికి బీజేపీ అగ్రనాయకత్వం వచ్చిందని తెలుస్తోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా అధ్యక్షతన, కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలో జరిగిన ఈ మేధోమధన సమావేశంలో పలువురు కేంద్ర మంత్రులు కూడా పాల్గొన్నారు.

పశ్చిమ బెంగాల్, తెలంగాణ, మహారాష్ట్ర, పంజాబ్, యూపీ రాష్ట్రాల్లో బీజేపీ బలపడేందుకు చేయాల్సిన కసరత్తుపై ఈ సమావేశంలో చర్చించారు.  ప్రతి కేంద్ర మంత్రి కనీసం మూడు నుంచి నాలుగు లోక్ సభ స్థానాలపై ప్రత్యేక ఫోకస్ చేస్తే.. వచ్చే ఎన్నికల్లో సత్ఫలితాలు వస్తాయని అమిత్ షా, జె.పి.నడ్డా దిశానిర్దేశం చేశారని అంటున్నారు. పార్టీ ప్రయోజనాల రీత్యా వివిధ  లోక్ సభ స్థానాల పరిధిలో పర్యటించినప్పుడు..  గుర్తించిన అంశాలపై ఫీడ్ బ్యాక్ ను ‘సరళ్’ పోర్టల్ ద్వారా అందించాలని కేంద్ర మంత్రులకు ఈ సమావేశం సందర్భంగా నిర్దేశించారట.

వివిధ మంత్రిత్వ శాఖల ద్వారా అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలు ఏయే లోక్ సభ నియోజకవర్గాల్లో.. ఏవిధంగా అమలవుతున్నాయనే సమాచారాన్ని కూడా అందించాలని కేంద్ర మంత్రులను పార్టీ అగ్రనాయకత్వం ఆదేశించిందట. క్షేత్రస్థాయి నుంచి అందే సమాచారం ఆధారంగానే ఈసారి ఒక్కో లోక్ సభ స్థానానికి సంబంధించిన ఎన్నికల వ్యూహాన్ని బీజేపీ సిద్ధం చేయనుందని అంటున్నారు.