కశ్మీర్పై అమిత్షా హైలెవల్ మీటింగ్

కశ్మీర్పై అమిత్షా హైలెవల్ మీటింగ్

కేంద్ర హోంమంత్రి అమిత్ షా లేహ్, లద్దాఖ్ సహా జమ్మూకశ్మీర్ లోని పలు సమస్యలపై ఇవాళ సాయంత్రం ఢిల్లీలో సమావేశం నిర్వహించారు. అనంతరం జమ్మూకశ్మీర్ అధికారులతో ఆయన భేటీ అయ్యారు.  ఇవాళ జమ్మూ ఏరియాలో భారీ ఎన్ కౌంటర్, ఉగ్ర కుట్ర భగ్నం నేపథ్యంలో జరిగిన ఈ భేటీ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఈ మీటింగ్ లో BSF, CRPF అధికారులు, జమ్మూకశ్మీర్ పోలీస్ ఉన్నతాధికారులు ,ఐబీ, రిసెర్చ్ అండ్ ఎనాలసిస్ వింగ్ అధికారులు పాల్గొన్నారు. 

ఇవాళ జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదుల భారీ కుట్రను పోలీసులు, భద్రతా సిబ్బంది భగ్నం చేశారు. భారీ విధ్వంసం చేసేందుకు పెద్ద ఎత్తున ఆయుధాలతో నలుగురు ఉగ్రవాదులు శ్రీనగర్ వైపు వెళ్తుండగా.. ఎన్ కౌంటర్ లో హతమార్చారు. లారీ అనుమానాస్పదంగా కనిపించడంతో భద్రతా సిబ్బంది ఆపి చెకింగ్ చేశారు. దీంతో టెర్రరిస్టులు అక్కడి నుంచి పరారై ఓ ఇంట్లో దాక్కున్నారు. భద్రతా సిబ్బంది వారిని రౌండాఫ్ చేశారు. ఇంకోవైపు లారీ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. 

ఉదయం జమ్మూ ప్రాంతంలోని సిధ్రా ఏరియాలో ఈ ఎన్ కౌంటర్ జరిగింది. 2 గంటల పాటు అక్కడ హైటెన్షన్ నెలకొంది. ఇంట్లో దాక్కున్న టెర్రరిస్టులు ఫైరింగ్ చేయడం, భద్రతా దళాలు చుట్టుముట్టి కాల్పులు జరపడంతో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. లారీలో పెద్ద ఎత్తున ఆయుధాలతో వెళ్తున్నట్లు గుర్తించారు. ఎన్ కౌంటర్ తర్వాత 7 ఏకే 47 రైఫిల్స్, 3 పిస్టల్స్ సహా మరికొన్ని ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. సిధ్రా ఏరియాలో కూంబింగ్ కంటిన్యూ చేస్తున్నారు. మరోవైపు జమ్మూలో హై అలర్ట్ ప్రకటించారు. జనవరి 26 సమీపిస్తుండడంతో భద్రతా చర్యలు పెంచామని ఆర్మీ అధికారులు తెలిపారు. లారీ ఎవరిదన్నది ఎంక్వైరీ చేస్తున్నారు. ఈ లారీ జమ్మూ నుంచి శ్రీనగర్ వెళ్తున్నట్లు గుర్తించారు.