అవినీతిపరుల నుంచి ప్రతి పైసా కక్కిస్తం: అమిత్ షా

అవినీతిపరుల నుంచి ప్రతి పైసా కక్కిస్తం: అమిత్ షా

చత్తీస్​గఢ్​ పర్యటనలో  కేంద్ర హోంమంత్రి అమిత్​షా

రాజ్‌‌నంద్‌‌గాం(చత్తీస్​గఢ్): వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రాగానే అవినీతిపరుల నుంచి ప్రతి పైసా కక్కిస్తామని, వారిని కిందకు వేలాడదీసి ఉరితీస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్​షా ఘాటు వ్యాఖ్యలు చేశారు. సోమవారం చత్తీస్​గఢ్​లోని రాజ్‌‌నంద్‌‌గాంలో నిర్వహించిన ర్యాలీలో షా పాల్గొన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఫుడ్ చైన్ లాగా ఢిల్లీ వరకు కరప్షన్​ చైన్ ​నిర్మించిందన్నారు. ఒకప్పుడు బీమార్ ​రాష్ట్రంగా ఉండే చత్తీస్​గఢ్​ను గతంలో రమణసింగ్​ ప్రభుత్వం ఎంతో అభివృద్ధి చేసిందని, బాఘేల్ ​ప్రభుత్వం చత్తీస్​గఢ్​ను స్కామ్​ల రాష్ట్రంగా మార్చిందని విమర్శించారు. 

తన ప్రజా జీవితంలో ఇంత పెద్ద స్కామ్​లను ఎన్నడూ చూడలేదని అన్నారు. మద్యం, బొగ్గు, బెట్టింగ్, గేమింగ్​యాప్​ల కుంభకోణం సహా చివరకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిక్రూట్‌‌మెంట్‌‌లోనూ స్కామ్​లు చేశారని షా విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ‘తీస్ టాకా, భూపేష్ కాకా’(30% కమీషన్ బాఘెల్ ప్రభుత్వం)గా అభివర్ణించారు. కాంగ్రెస్  ప్రభుత్వం ఇచ్చిన 315 హామీలను నెరవేర్చలేదని, బీజేపీ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలనూ నిలిపివేసిందని అన్నారు. చత్తీస్‌‌గఢ్ భవిష్యత్తును నాశనం చేసిన భూపేష్ బాఘెల్‌‌కు మరో అవకాశం ఇస్తారా ? అని ప్రజలను ఆయన అడిగారు. అందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో స్పందిస్తూ.. లేదని జవాబిచ్చారు. 

చత్తీస్‌‌గఢ్‌‌లో బీజేపీకి ఓటు వేసి 2024లో కేంద్రంలో మోదీ ప్రభుత్వాన్ని మళ్లీ అధికారంలోకి తీసుకురావాలని కోరారు. ర్యాలీ తర్వాత, రమణ్ సింగ్, మరో ముగ్గురు బీజేపీ అభ్యర్థులు నామినేషన్ వేశారు.