మణిపూర్‌‌‌‌లో అమిత్ షా

 మణిపూర్‌‌‌‌లో అమిత్ షా

పరిస్థితిని చక్కబెట్టేందుకు వరుస భేటీలు, సమీక్షలు
ధరలను నియంత్రించేందుకు భారీగా నిత్యావసరాల తరలింపు
సీఎం బీరేన్ సింగ్‌‌తో సమావేశంలో నిర్ణయం

ఇంఫాల్/చురాచంద్‌‌పూర్/న్యూఢిల్లీ : అల్లర్లు, ఘర్షణలతో అట్టుడికిన మణిపూర్‌‌‌‌లో పరిస్థితిని చక్కబెట్టేందుకు అమిత్ షా స్వయంగా రంగంలోకి దిగారు. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం రాత్రే ఇంఫాల్‌‌కు చేరుకున్నారు. తొలుత సీఎం బీరేన్ సింగ్‌‌తో సమావేశమై.. రాష్ట్రంలో పరిస్థితిపై సమీక్షించారు. మంగళవారం అల్లర్లు చెలరేగిన చురాచంద్‌‌పూర్ ఏరియాకు వెళ్లారు. కుకీ సివిల్ సొసైటీ లీడర్లతో, మహిళా బృందంతో వేర్వేరుగా సమావేశమయ్యారు. మే 3న అల్లర్లు ప్రారంభమైన తర్వాత తొలిసారి మణిపూర్​లో అమిత్​షా పర్యటిస్తున్నారు. ఆయన వెంట హోం సెక్రటరీ అజయ్ కుమార్ భల్లా, ఐబీ డైరెక్టర్ తపన్ కుమార్ దేకా తదితరులు ఉన్నారు. మహిళా నేతల బృందంతో బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ నిర్వహించారు.

వివిధ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ల ప్రతినిధులతోనూ షా సమావేశమయ్యారు. ‘‘మణిపూర్‌‌లో మహిళా నేతల బృందం (మీరా పైబీ)తో సమావేశమయ్యాను. మణిపూర్ సమాజంలో మహిళల పాత్ర ఎంతో కీలకం. రాష్ట్రంలో శాంతి, శ్రేయస్సు విషయంలో మేం కట్టుబడి ఉన్నాం” అని అమిత్ షా ట్వీట్ చేశారు. ‘‘ఈరోజు ఇంఫాల్‌‌లో వివిధ సివిల్ సొసైటీ సంస్థల సభ్యులతో ఫలవంతమైన చర్చ జరిగింది. శాంతి నెలకొల్పే విషయంలో వారు తమ కమిట్‌‌మెంట్‌‌ను వ్యక్తం చేశారు. మణిపూర్‌‌లో సాధారణ స్థితిని పునరుద్ధరించడానికి సాయపడతామని చెప్పారు” అని ట్వీట్ చేశారు.

మృతుల కుటుంబాలకు10 లక్షల పరిహారం

మణిపూర్ అల్లర్లలో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అలాగే బాధిత కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చింది. అమిత్ షా, మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పెరిగిన ధరలను అదుపులోకి తీసుకొచ్చేందుకు పెట్రోల్, గ్యాస్, బియ్యం, ఇతర ఆహార పదార్థాలను భారీ స్థాయిలో అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. అల్లర్లు, గొడవల్లో దాదాపు 80 మంది దాకా చనిపోయినట్లు అధికారులు తెలిపారు. 

రాష్ట్రపతిని కలిసిన కాంగ్రెస్ నేతలు

మణిపూర్‌‌‌‌లో సాధారణ పరిస్థితులను తీసుకొచ్చేందుకు జోక్యం చేసుకోవాలని కోరుతూ కాంగ్రెస్ నేతలు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కోరారు. సిట్టింగ్ లేదా రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి ఆధ్వర్యంలో దర్యాప్తు చేసేందుకు ఉన్నతస్థాయి ఎంక్వైరీ కమిషన్‌‌ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఈ మేరకు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో కూడిన బృందం.. రాష్ట్రపతిని కలిసింది. 12 పాయింట్లతో కూడిన మెమొరాండం అందజేసింది. 

మణిపూర్‌‌‌‌ పోత.. పర్మిషన్ ఇయ్యండి : మమత

మణిపూర్‌‌‌‌ ప్రజలకు మద్దతుగా, అల్లర్ల బాధితులకు అండగా నిలిచేందుకు తాను అక్కడికి వెళ్తానని, పర్మిషన్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కోరారు. ఈ మేరకు కేంద్రానికి ఆమె లేఖ రాసినట్లు ఓ సీనియర్ అధికారి చెప్పారు.

సవాళ్లు తొలగిపోలేదు : సీడీఎస్

మణిపూర్‌‌లో సవాళ్లు ఇంకా తొలగిపోలేదని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ అనీల్ చౌహాన్ చెప్పారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్‌‌డీఏ) కోర్స్ పాసింగ్ ఔట్ పరేడ్‌‌ను రివ్యూ చేసేందుకు  ఆయన పుణెకు వచ్చారు. ఈ సందర్భంగా సీడీఎస్ మాట్లాడుతూ.. త్వరలో పరిస్థితులు సద్దుమణుగుతాయని ఆశాభావం వ్యక్తంచేశారు. ప్రస్తుత పరిస్థితి రెండు వర్గాలకు సంబంధించిన గొడవ అని, శాంతిభద్రతల అంశమని అన్నారు. సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి తాము సాయం చేస్తున్నట్లు తెలిపారు.