అమిత్ షా రాష్ట్ర టూర్ ..రేపు రాష్ట్ర బీజేపీ నేతలతో కీలక భేటీ

అమిత్ షా రాష్ట్ర టూర్ ..రేపు రాష్ట్ర బీజేపీ నేతలతో కీలక భేటీ
  • వచ్చే ఎన్నిబీఆర్ఎస్‌‌ను ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై సూచనలు
  • ఇయ్యాల అర్ధరాత్రి హైదరాబాద్‌‌కు షా.. గురువారం రోజంతా బిజీ బిజీ
  • రేపు సాయంత్రం ఖమ్మం బహిరంగ సభకు హాజరు
  • కనీసం లక్ష మంది సమీకరణే లక్ష్యంగా రాష్ట్ర నేతల ఏర్పాట్లు
  • ఎన్నికలపై దిశా నిర్దేశం చేయనున్న కేంద్ర మంత్రి

హైదరాబాద్, వెలుగు: కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాష్ట్ర టూర్ షెడ్యూల్ ఖరారైంది. బుధవారం అర్ధరాత్రి హైదరాబాద్‌‌కు చేరుకోనున్న ఆయన.. గురువారం రాత్రి దాకా బిజీబిజీగా గడపనున్నారు. ప్రధానంగా ఖమ్మం సభకు హాజరయ్యేందుకే అమిత్ షా వస్తున్నప్పటికీ.. పార్టీ నేతలతో సమావేశాలు, భేటీలకే ఎక్కువ సమయం కేటాయించనున్నారు. ఇందులో భాగంగానే గురువారం ఉదయాన్నే రాష్ట్ర బీజేపీ నేతలతో సమావేశం కానున్నారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై నేతలతో చర్చించనున్న ఆయన.. త్వరలోనే ఎన్నికలు జరగనుండటంతో వారికి దిశానిర్దేశం చేయనున్నారు. మరోవైపు ఖమ్మం సభతోనే తెలంగాణలో ఎన్నికల ప్రచార శంఖారావాన్ని అమిత్ షా పూరించనున్నారని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి.

రాబోయే ఎన్నికలే లక్ష్యంగా..

గురువారం ఉదయం పార్టీ ముఖ్య నేతలతో భేటీతోనే అమిత్ షా షెడ్యూల్ ప్రారంభం కానుంది. పార్టీ నేతలతో ఆయన ఏం చర్చించనున్నారు? వారికి ఎలాంటి దిశా నిర్దేశం చేయనున్నారనే దానిపై పార్టీలో ఆసక్తి నెలకొంది. రాబోయే ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం ఎలాంటి ప్రోగ్రామ్ లు చేపట్టాలి? బీఆర్ఎస్ ను బలంగా ఢీ కొనేందుకు ఎలాంటి వ్యూహాలను అమలు చేయాలి? అనే దానిపై అమిత్ షా దిశా నిర్దేశం చేయనున్నారు. మరోవైపు రాష్ట్రంలో ప్రారంభమైన ‘మహా జన సంపర్క్ అభియాన్’ ప్రోగ్రామ్ ఎలా కొనసాగుతోంది? ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది? పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమాలను సక్సెస్ చేసేందుకు ఏ స్థాయిలో కృషి చేస్తున్నారు? అనే దానిపై ఆరా తీయనున్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్‌కు తామే ప్రత్యామ్నాయం అంటున్న కాంగ్రెస్‌ను ఎలా కట్టడి చేయాలనే దానిపై నేతలకు పలు సూచనలు చేయనున్నారు. కొంత కాలంగా పార్టీలో చేరికలు ఆగడంపైనా ఈ భేటీలో చర్చించనున్నారు.

సభ సక్సెస్‌కు భారీ ఏర్పాట్లు

ఖమ్మం సభపై బీజేపీ ఎన్నో ఆశలు పెట్టుకుంది. కనీసం లక్ష మందికి తగ్గకుండా ఈ సభను సక్సెస్ చేయాలని భారీగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు జన సమీకరణపై ఫోకస్ పెట్టింది. 

అమిత్ షా టూర్ షెడ్యూల్ ఇదీ

  •     బుధవారం అర్ధరాత్రి 12 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ప్రత్యేక విమానంలో చేరుకుంటారు.
  •     రాత్రికి అక్కడే నోవాటెల్ హోటల్‌లో బస చేస్తారు.
  •     గురువారం ఉదయం 10 గంటల నుంచి 10.30 వరకు బీజేపీ రాష్ట్ర ముఖ్య నేతలతో భేటీ అవుతారు.
  •     దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఇంటికి వెళ్తారు. ఆయన ఇంట్లో 11.45 నుంచి 12.15 వరకు ఉంటారు.
  •     మధ్యాహ్నం 12.45 నుంచి శంషాబాద్ జేడీ కన్వెన్షన్​లో పార్టీకి చెందిన పాతతరం కార్యకర్తలు, నాయకులతో అరగంటకుపైగా సమావేశం అవుతారు.
  •     ప్రత్యేక హెలికాప్టర్‌‌లో భద్రాచలం చేరుకొని అక్కడ శ్రీరాముడిని దర్శనం చేసుకుంటారు. సాయంత్రం 4 గంటల నుంచి 4.40 వరకు అక్కడే ఉంటారు.
  •     ఆ తర్వాత ఖమ్మం చేరుకుని.. సాయంత్రం 5.40కి ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పిస్తారు.
  •     6 గంటల నుంచి 7 గంటల వరకు ఖమ్మం సభలో పాల్గొంటారు.
  •     సభ తర్వాత సాయంత్రం 7.10 నుంచి 7.40 వరకు ఖమ్మం గెస్ట్ హౌస్​లో స్థానిక నేతలతో భేటీ అవుతారు.
  •     రాత్రి 7.40 గంటలకు ఖమ్మం నుంచి విజయవాడ వెళ్తారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో గుజరాత్ వెళ్తారు.