"సెంగోల్" వివాదం.. ఫేక్ అంటున్న కాంగ్రెస్..అమిత్ షా ఖతర్నాక్ కౌంటర్

"సెంగోల్" వివాదం.. ఫేక్ అంటున్న కాంగ్రెస్..అమిత్ షా ఖతర్నాక్ కౌంటర్

కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవంపై ప్రభుత్వానికి, ప్రతిపక్షాలకు మధ్య వివాదం నడుస్తుండగా..రాజదండం (సెంగోల్)పై కూడా కేంద్ర ప్రభుత్వానికి, కాంగ్రెస్కు మధ్య  వివాదం చెలరేగింది. తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకు బ్రిటీష్ వైశ్రాయ్ ఇచ్చిన రాజదండాన్ని తిరిగి బయటికి తీసి స్పీకర్ స్ధానం పక్కన పెట్టాలన్న  కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పుబడుతోంది. అసలు సెంగోల్ కు  సంబంధించి బీజేపీ చెప్తున్న స్టోరీ.. కట్టు కథే అని కొట్టిపారేస్తోంది. 

సెంగోల్ పై బీజేపీ ఏం చెప్తోందంటే..

స్వాతంత్య్రం సమయంలో  బ్రిటీష్ పాలకుల నుంచి  రాజగోపాలచారి సూచనతో తొలి ప్రధాని నెహ్రూ ఓ రాజదండం తయారు చేయించి.. దాన్ని బ్రిటీష్ చివరి వైశ్రాయ్ లార్డ్ మౌంట్ బాటెన్ నుంచి అందుకున్నారని బీజేపీ చెప్తోంది. అప్పట్లో అధికార మార్పిడికి గుర్తుగా నాటి ప్రదాని నెహ్రూ దీన్ని అందుకున్నారని అంటోంది.  ఆ తర్వాత కాంగ్రెస్ హాయంలో  దీన్ని చేతికర్రగా వాడి అనంతరం మ్యూజియంలో పెట్టేశారని బీజేపీ ఆరోపిస్తోంది.

అలాంటి ఆధారాల్లేవ్..

సెంగోల్ పై బీజేపీ చెప్తోందంతా కట్టు కథే అని కాంగ్రెస్ కొట్టిపారేస్తోంది. మ్యూజియంలో ఉన్న రాజదండాన్ని తీసుకొచ్చి దాన్ని నెహ్రూకు అంటగట్టి  బీజేపీ స్టోరీలో  ప్రచారం చేస్తోందని కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ మండిపడ్డారు. తమిళనాడులో తమ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రధాని, బీజేపీ లీడర్లు సెంగోల్ పై ఈ స్టోరీని తెరపైకి తెచ్చారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేష్‌ విమర్శించారు.  మద్రాసు ప్రావిన్స్‌లోని ఒక మఠం ద్వారా తయారు చేయించిన రాజదండం.. నెహ్రూకు బహుకరించారని వెల్లడించారు. బీజేపీ చెప్తున్నట్లుగా  మౌంట్ బాటన్, రాజాజీ, నెహ్రూలు ఈ రాజదండాన్ని భారతదేశానికి బ్రిటీష్ అధికార బదిలీకి చిహ్నంగా అభివర్ణించటానికి ఎలాంటి ఆధారాలు లేవని తెలిపారు. 

సంప్రదాయాలంటే కాంగ్రెస్ కు ధ్వేషం ఎందుకు..

సెంగోల్పై కాంగ్రెస్ వాదనను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఖండించారు. కాంగ్రెస్ పార్టీకి  భారతీయ సంప్రదాయాలు,  సంస్కృతి అంటే ధ్వేషం ఎందుకు అని ప్రశ్నించారు. భారతదేశ స్వాతంత్య్రానికి ప్రతీకగా తమిళనాడుకు చెందిన ఒక పవిత్ర శైవ మఠం పండిట్ నెహ్రూకు పవిత్రమైన రాజదండాన్ని అందించిందన్నారు. కానీ ఆ తర్వాత సెంగోల్ ‘వాకింగ్ స్టిక్’గా మ్యూజియంలోకి మూలన పడేశారని మండిపడ్డారు. రాజదండాన్ని కేంద్రం గౌరవిస్తుంటే..కాంగ్రెస్ మాత్రం అవమానిస్తోందన్నారు.   తిరువడుతురై అధీనం స్వయంగా భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో సెంగోల్ ప్రాముఖ్యత గురించి మాట్లాడిందని గుర్తు చేశారు. కానీ  కాంగ్రెస్ మాత్రం ఈ  చరిత్రను బోగస్ అంటోందని మండిపడ్డారు. 

హాజరవుతారా.. లేదా.?

మరోవైపు మే 28వ తేదీన కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని మోడీ ప్రారంభిస్తారు. అయితే ఈ కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి 25 పార్టీలు హాజరవనున్నాయి. బీజేపీలో నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో 18 పార్టీలతో పాటు.. ఏడు ఎన్డీయేతర పార్టీలు ఈ వేడుకకు హాజరు కానున్నాయి. బీఎస్పీ,  శిరోమణి అకాలీదళ్, జనతాదళ్ (సెక్యులర్), లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్), వైఎస్సార్ కాంగ్రెస్, బీజేడీ, టీడీపీలు ఈ వేడుకకు హాజరవుతాయ్యే అవకాశం ఉంది. అయితే  20 ప్రతిపక్షాలు ఈ కార్యక్రమాన్ని బహిష్కరించాయి.