సాంస్కృతిక కేంద్రాలకు మోదీ పునరుజ్జీవం .. ప్రధానిపై అమిత్ షా ప్రశంసలు

సాంస్కృతిక కేంద్రాలకు మోదీ పునరుజ్జీవం ..  ప్రధానిపై అమిత్ షా ప్రశంసలు

మైసూరు: ప్రధాని నరేంద్ర మోదీని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రశంసించారు. భారతదేశ సాంస్కృతిక వారసత్వానికి  ప్రపంచ వేదికపై గౌరవం కల్పించేందుకు మోదీ కృషి చేశారని కొనియాడారు. ఆదివారం  మైసూరులో జరిగిన సుత్తూరు జాతరలో అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. “అయోధ్య రామ మందిరం, కాశీలోని కాశీ విశ్వనాథ్ కారిడార్, మహాకాల్ కారిడార్, కేదార్ నాథ్, బద్రినాథ్ తో సహా అనేక సాంస్కృతిక కేంద్రాలకు మోదీ పునరుజ్జీవనం పోసేందుకు కృషి చేశారు” అని అమిత్ షా తెలిపారు.

ఈ సందర్భంగా 12వ శతాబ్దానికి చెందిన సంఘ సంస్కర్త బసవేశ్వరునికి నివాళులు అర్పించారు. అయోధ్యలో సుత్తూరు మఠం కొత్త కేంద్రాన్ని ప్రారంభించాలని నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని షా చెప్పారు. ఈ కార్యక్రమంలో సుత్తూరు మఠం జగద్గురు శివరాత్రి దేశికేంద్ర మహాస్వామిజీ, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, మాజీ సీఎం బొమ్మై, కర్నాటక అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఆర్. అశోక, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై. విజయేంద్ర తదితరులు పాల్గొన్నారు.