300 సీట్లు మావే..అమిత్ షా ధీమా

300 సీట్లు మావే..అమిత్ షా ధీమా

బీజేపీ హ్యాట్రిక్ విజయాన్ని సాధిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 300 సీట్లు గెలుచుకుని మూడోసారి అధికారాన్ని దక్కించుకుంటుందన్నారు. అస్సాంలోనూ 14 లోక్‌సభ స్థానాలకు గానూ 12 స్థానాల్లో గెలుస్తామన్నారు.  అస్సాంలోని డిబ్రూగఢ్‌ జిల్లాలో పర్యటించారు.  బీజేపీ కార్యాలయానికి శంకుస్థాపన చేసిన అనంతరం.. బహిరంగసభలో ప్రసంగించారు. 

కాంగ్రెస్ పని ఖతమే..

గతంలో ఈశాన్య రాష్ట్రాలు కాంగ్రెస్‌ కు కంచుకోటగా ఉండేవని... కానీ ఇప్పుడు ఈ రాష్ట్రాల్లో బీజేపీ పాగా వేసిందన్నారు. మేఘాలయ, త్రిపుర, నాగాలాండ్ రాష్ట్రాల్లో బీజేపీయే అధికారంలో ఉందని గుర్తు చేశారు. మరో రెండు రాష్ట్రాల్లో మిత్ర పక్షాలతో ప్రభుత్వాలను ఏర్పాటు చేశామన్నారు. 1958 నాటి ఆర్మ్‌డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్‌ను తొలగించిన తర్వాత అస్సాంలో శాంతి సామరస్యాలు నెలకొన్నాయన్నారు. గతంలో ఆందోళనలు, తీవ్రవాదానికి మారుపేరుగా ఉంటే.. ఇప్పుడు బిహూ సంగీతంపై నృత్యాలు చేస్తున్నారని షా చెప్పుకొచ్చారు.

యాత్ర చేసినా పట్టించుకోలేదు..

రాహుల్ గాంధీ  భారత్‌ జోడో యాత్ర పేరుతో పాదయాత్ర చేసినా.. మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను ప్రజలు పట్టించుకోలేదని  అమిత్‌షా అన్నారు. లండన్ లో రాహుల్‌ గాంధీ భారత్‌ను అవమానపరిచారని మండిపడ్డారు.  ఆయన ఇలాగే ప్రవర్తిస్తే.. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌  తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీపై ఎన్ని ఎక్కువ విమర్శలు చేస్తే.. అదే స్థాయిలో బీజేపీ  వృద్ధి చెందుతుందన్నారు.

అమిత్ షా ధీమా వెనుక..

1980లో రెండు లోక్‌సభ సీట్లతో మొదలైన బీజేపీ ప్రస్థానం 2019 ఎన్నికల్లో 303 సీట్లకుకు చేరుకుంది. తొలిసారిగా 2014 లోక్‌సభ ఎన్నికల్లో మోడీ పోటీ చేయగా..ఆ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 282 స్థానాల్లో విజయం సాధించింది. మ్యాజిక్ ఫిగర్ కంటే 10  స్థానాలను ఎక్కువ సాధించింది. 1984 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 7.74 శాతం ఓట్లను సాధించగా.. 2014లో 31.34 శాతం ఓట్లను దక్కించుకుంది. ఇక 2019 ఎన్నికల్లో 37.46 శాతానికి పెంచుకుంది.