జమ్మూకాశ్మీర్ కు ఆర్టికల్ 370 తాత్కాలికమే: అమిత్ షా

జమ్మూకాశ్మీర్ కు ఆర్టికల్ 370 తాత్కాలికమే: అమిత్ షా
  • ఈ విషయాన్ని ఇండెక్స్ లో పేర్కొన్నారు: అమిత్ షా
  •  రాజ్యాంగ నిర్మాతలు దానిని తెలివిగా చేర్చారు
  • చట్టాలను స్పష్టంగా రాస్తే గందరగోళం ఉండదని వెల్లడి

న్యూఢిల్లీ : జమ్మూకాశ్మీర్ కు ప్రత్యేక హోదా ఇచ్చిన ఆర్టికల్  370 తాత్కాలికమని కేంద్ర హోం మంత్రి అమిత్  షా అన్నారు. మన రాజ్యాంగ నిర్మాతలు తెలివిగా దానిని రాజ్యాంగంలో చేర్చారని పేర్కొన్నారు. ఢిల్లీలో సోమవారం లెజిస్లేటివ్  డ్రాఫ్టింగ్ పై నిర్వహించిన ఓ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. చట్టాన్ని సరిగ్గా రాస్తే, ఏ కోర్టు కూడా ఏ చట్టానికీ వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉండదన్నారు. ‘‘డ్రాఫ్టింగ్  సులభంగా, స్పష్టంగా ఉంటే దాని గురించి ప్రజలకు అవగాహన కల్పించడం ఈజీగా ఉంటుంది. ఫలానా అంశం గురించి పూర్తిగా వివరించకుండా సగం సగం వివరిస్తే, అర్థం చేసుకోవడంలో ఇబ్బందులు కలుగుతాయి” అని షా వ్యాఖ్యానించారు. ఆర్టికల్  370 రద్దుపై స్పందిస్తూ.. దేశమంతా ఆ ఆర్టికల్​ను రద్దు చేయాలని కోరుకుందని తెలిపారు. ‘‘ఆర్టికల్​ 370పై జరిగిన చర్చలు  కూడా రాజ్యాంగ పరిషత్తు చర్చల రికార్డుల్లో లేవు. అసలు ఏం చర్చించారో కూడా ప్రింట్లు లేవు. ఆర్టికల్ 370ని డ్రాఫ్ట్  చేసిన వారు, రాజ్యాంగ పరిషత్తులో భాగమైన వారు ఎంత తెలివిగా దానిని రాజ్యాంగంలో చేర్చి ఉంటారో  ఊహించవచ్చు. ఎన్నో ఆలోచనల తర్వాత ‘తాత్కాలికం’ అన్న పేరు చేర్చారు. అయితే, రాజ్యాంగంలో ఆర్టికల్  టెంపరరీగా ఉండకూడదు. దానిని సవరించవచ్చు” అని షా వివరించారు.

చట్టాల స్పూర్తిని కాపాడేలా డ్రాఫ్టింగ్  ఉండాలి

చట్టం అనేది కేబినెట్ లేదా పార్లమెంటు సంకల్పాన్ని ప్రతిఫలింపచేయాలని అమిత్ షా అన్నారు. చట్టం సులభంగా, స్పష్టంగా ఉన్నపుడే దానిపై వివాదం జరగకుండా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. చట్టాల స్పూర్తిని కాపాడేలా డ్రాఫ్టింగ్  చేయడం ముఖ్యమని ఆయన సూచించారు. ఇక, మోడీ ప్రభుత్వం చట్టాల్లో చాలా మార్పులు చేసిందని షా తెలిపారు. తమ ప్రభుత్వం దాదాపు 2 వేల అసందర్భమైన చట్టాలను రద్దుచేసిందని, అంతేకాకుండా కొత్త చట్టాలను రూపకల్పన చేసేందుకూ వెనుకాడలేదని ఆయన చెప్పారు.