అమిత్ షా చెప్పింది నిజమే.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మమతా బెనర్జీ

అమిత్ షా చెప్పింది నిజమే.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మమతా బెనర్జీ

ప్రతిపక్షాల 'INDIA(ఇండియా)' కూటమిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గట్టి కౌంటర్ ఇచ్చారు. లోక్ సభలో ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లును ప్రవేశపెట్టిన అమిత్ షా.. మీ ఇండియా కూటమి గురించి కాకుండా ఢిల్లీ గురించి ఆలోచించమని, వచ్చే ఎన్నికల్లో మళ్లీ మోదీ ప్రభుత్వమే వస్తుందని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్స్ పై తాజాగా మమతా బెనర్జీ స్పందించారు. తెలిసి అన్నారో, తెలియక అన్నారో తెలియదు కానీ.. అమిత్ షా చెప్పింది నిజమేనని వ్యాఖ్యానించారు. ఢిల్లీలోనే పార్లమెంట్ ఉంది కాబట్టి రాబోయే ఎలక్షన్లలో ఢిల్లీలో ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని చెప్పుకొచ్చారు.

పార్లమెంటు సమావేశాల అనంతరం విపక్ష కూటమిలో ప్రధాన సభ్యురాలైన మమతా బెనర్జీ విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. అమిత్ షా చెప్పింది వాస్తవమేనని, ఇక్కడ రానున్నది ఇండియా కూటమేనని, మాతృభూమిని కాపాడుకోవడం కోసమే ఈ కూటమి ఏర్పడిందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఎన్డీయే బలహీనమైందన్న మమతా.. అందులోని వారంతా కూటమిని విడిచిపెట్టి ఎప్పుడో వెళ్లిపోయారన్నారు. దేశంలో నిరుద్యోగం సమస్య ఇంకా దిగజారకముందే, మతపరమైన విద్వేషాలు చెలరేగకుండా ఉండాలంటే తమ కూటమి అధికారంలోకి రావల్సిందేనని చెప్పారు. వారు దేశమంతా కాషాయమయం చేస్తామంటున్నారు.. మాక్కూడా కాషాయమంటే ఇష్టమే.. కానీ మిగతా రంగుల పరిస్థితి ఏంటని మమతా ఈ సందర్భంగా ప్రశ్నించారు.