భారత క్రికెట్‌లో చిచ్చుపెట్టిన బంగారు విగ్రహం.. లీగల్ నోటీసులు

భారత క్రికెట్‌లో చిచ్చుపెట్టిన బంగారు విగ్రహం.. లీగల్ నోటీసులు

భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) మాజీ అడ్మినిస్ట్రేటర్, సెక్రటరీ అమితాబ్ చౌదరి మరణం జార్ఖండ్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్(జేఎస్‌సీఏ)ను వివాదంలోకి నెట్టింది. ఆయన సేవలకు గుర్తుగా బంగారు విగ్రహాన్ని ఏర్పాటుచేయాలన్న జేసీఏ నిర్ణయాన్ని అమితాబ్ చౌదరి కుటుంబసభ్యులు తప్పుబట్టినట్లు తెలుస్తోంది. విగ్రహ ఏర్పాటు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాల్సిందిగా జేఎస్‌సీఏకి లీగల్ నోటీసులు పంపినట్లు సమాచారం.

అసలు విషయం ఏంటంటే..?

బీసీసీఐ మాజీ సెక్రటరీ అమితాబ్ చౌదరి గతేడాది ఆగష్టు 16న మరణించారు. ఈ క్రమంలో రేపు అనగా ఆగష్టు 16న ఆయన మొదటి వర్ధంతి జరగనుంది. ఈ తరుణంలో ఆయన సేవలకు గుర్తుగా జార్ఖండ్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్(జేఎస్ సీఏ) కోటి రూపాయల విలువైన బంగారు విగ్రహాన్ని ఏర్పాటు చేయదలుచుకుంది. ఇప్పటికే విగ్రహ నిర్మాణం పూర్తవగా.. రేపు ఆవిష్కరించనున్నారు. అయితే ఈ నిర్ణయంపై అమితాబ్ చౌదరి కుటుంబసభ్యులు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. 

ఇలా నివాళులర్పించడం తన తండ్రి చేసిన ప్రతి త్యాగానికి అవమానం అవుతుందని అమితాబ్ చౌదరి కుమారుడు అభిషేక్ చౌదరి ఓ జాతీయ ఛానెల్‌కు వెల్లడించినట్లు సమాచారం. విగ్రహ ప్రతిష్ఠాపనను ఆపాల్సిందిగా జేఎస్‌సీఏకు లీగల్ నోటీసులు పంపినట్లు తెలుస్తోంది. విగ్రహ ఏర్పాటుకు ముందుగా కుటుంబసభ్యుల అనుమతి తీసుకోకపోవడం కూడా ఈ వివాదానికి ఒక కారణమవుతోంది. ఈ విషయం ఇప్పటికే బీసీసీఐకి చేరినట్లు సమాచారం.