
హైదరాబాద్, వెలుగు: సీఎస్ఐఆర్-సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీఆర్ఆర్ఐ) అభివృద్ధి చేసిన స్టీల్ స్లాగ్ అగ్రిగేట్స్ టెక్నాలజీ లైసెన్స్‌ను పొందిన భారతదేశంలోనే మొదటి సంస్థగా అవతరించామని ఆర్సెలార్ మిట్టల్, నిప్పన్ స్టీల్ ఇండియా (ఏఎంఎన్ఎస్) ఇండియా సంస్థ ప్రకటించింది. రోడ్లు వేయడానికి సాధారణంగా వాడే పదార్థాల కంటే, స్టీల్ స్లాగ్‌తో వేసిన రోడ్లు ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి. ఈ స్టీల్ స్లాగ్ రోడ్లు 30 శాతం నుండి 40 శాతం వరకు తక్కువ ఖర్చుతో తయారవుతాయి. ఇవి మామూలు తారు రోడ్ల కంటే మూడు రెట్లు ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి. దీంతో రోడ్ల మరమ్మతులు, నిర్వహణ ఖర్చులు చాలా తగ్గుతాయి. రోడ్లు బలంగా ఉండటం వల్ల తీర ప్రాంతాల నుంచి కఠినమైన పర్వత ప్రాంతాల వరకు ఏ వాతావరణంలోనైనా సరిపోతాయని ఏఎంఎన్ఎస్ తెలిపింది.
బలమైన రోడ్ల నిర్మాణం కోసం భారత ప్రభుత్వ ఉక్కు మంత్రిత్వ శాఖ సీఆర్ఆర్ఐకి ఒక జాతీయ ప్రాజెక్టును అప్పగించింది. రోడ్ల నిర్మాణంలో స్టీల్ స్లాగ్ వాడకంపై శాస్త్రీయ పరిశోధనలు చేయడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఈ పనిలో ఏఎంఎన్ఎస్ ఇండియా స్వచ్ఛందంగా సహకరించింది. దీని ఫలితంగా, భారతదేశపు మొట్టమొదటి ఆల్ స్టీల్ స్లాగ్ రోడ్డును హజీరాలో నిర్మించారు. ఈ రోడ్డును అన్ని పొరలలోనూ సహజ కంకరకు బదులుగా ప్రత్యేకంగా తయారుచేసిన స్టీల్ స్లాగ్ కంకరతో వేశారు.