ఇన్ఫోసిస్​ డల్​ రిజల్ట్స్..భారీగా పడ్డ ఏడీఆర్​.. ఇంటెరిమ్​ డివిడెండ్​ రూ. 18

ఇన్ఫోసిస్​ డల్​ రిజల్ట్స్..భారీగా పడ్డ ఏడీఆర్​.. ఇంటెరిమ్​ డివిడెండ్​ రూ. 18
  • భారీగా పడ్డ ఏడీఆర్​.. ఇంటెరిమ్​ డివిడెండ్​ రూ. 18
  •     లాభం రూ. 6,212 కోట్లు
  •     గైడెన్స్​లో మరోసారి మార్పు

ముంబై : పెద్ద ఐటీ కంపెనీలలో ఒకటయిన ఇన్ఫోసిస్ లాభం​ రెండో క్వార్టర్​లో కేవలం 3 శాతం పెరిగింది. ఇదే కాలానికి రెవెన్యూ 7 శాతం అధికమైంది. సెప్టెంబర్​ క్వార్టర్లో కంపెనీకి రూ. 38,994 కోట్ల రెవెన్యూ మీద రూ. 6,212 కోట్ల నికర లాభం వచ్చింది. కంపెనీ ఒక్కో షేర్​కు రూ. 18 చొప్పున ఇంటెరిమ్​ డివిడెండ్​ను ప్రకటించింది. ఈ ఫైనాన్షియల్​ఇయర్​కు గైడెన్స్​ను మరోసారి కంపెనీ సవరించింది. 2023–24 లో రెవెన్యూ 1 నుంచి 2.5 శాతం మాత్రమే పెరగొచ్చని అంచనాలను విడుదల చేసింది. అంతకు ముందు ఇచ్చిన రెవెన్యూ గైడెన్స్​లో రెవెన్యూ గ్రోత్​ 1 నుంచి 3.5 శాతం దాకా ఉండే ఛాన్స్​ ఉన్నట్లు పేర్కొంది. 

సెప్టెంబర్​ క్వార్టర్లో ఆపరేటింగ్​ మార్జిన్స్​ టార్గెట్​(20–22 శాతం)ను ఇన్ఫోసిస్​ నిలబెట్టుకోగలిగింది. సవరించిన ఇన్ఫోసిస్​ గైడెన్స్​ మార్కెట్​ను నిరుత్సాహపరిచింది. న్యూయార్క్​ స్టాక్​ ఎక్స్చేంజ్​ ప్రీ మార్కెట్లో ఇన్ఫోసిస్​ ఏడీఆర్​లు (అమెరికన్​ డిపాజిటరీ రిసీట్లు) 5 శాతం పతనమయ్యాయంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ఎన్​ఎస్​ఈలో నూ గురువారం ట్రేడింగ్​లో ఇన్ఫోసిస్​ షేర్లు 2 శాతం తగ్గి రూ. 1,465.50 వద్ద క్లోజయ్యాయి.శుక్రవారం సెషన్​లో కూడా ఈ షేరు మరింత పడే చాన్స్​లు కనిపిస్తున్నాయి. 

క్యూ2 హైలైట్స్​....

  •     సెక్వెన్షియల్​గా చూస్తే కంపెనీ కన్సాలిడేటెడ్​ రెవెన్యూ దాదాపు 3 శాతం, నికరలాభం 4.5 శాతం ఎక్కువయ్యాయి.
  •     నిలకడైన కరెన్సీ ప్రాతిపదికన రెవెన్యూ సెక్వెన్షియల్​గా 2.3 శాతం అధికమైంది.
  •     తాజా క్వార్టర్లో 7.7 బిలియన్​ డాలర్ల విలువైన పెద్ద డీల్స్​ను చేజిక్కించుకుంది.

తగ్గిన ఉద్యోగుల వలస 

మార్జిన్స్​ పెంచుకునేందుకు అమలు చేస్తున్న ప్లాన్​ ఫలితాలు ఇస్తోందని, క్యూ2 లో ఆపరేటింగ్​ మార్జిన్​ 21.2 శాతం వద్ద నిలబడటమే దీనికి నిదర్శనమని సీఎఫ్​ఓ నీలాంజన్​ రాయ్​ చెప్పారు. టీసీఎస్​లాగే ఇన్ఫోసిస్​లోనూ ఉద్యోగుల వలస తగ్గింది. అంతకు ముందు క్వార్టర్లో 17.3 శాతంగా ఉన్న ఉద్యోగుల వలస, ఈ తాజా క్వార్టర్లో 14.6 శాతానికే పరిమితమైంది. సెప్టెంబర్​ చివరి నాటికి మొత్తం ఉద్యోగుల సంఖ్య 3,28,764 వద్ద నిలిచింది. నార్త్​ అమెరికా బిజినెస్​ ఒక్క శాతం పెరగ్గా, యూరప్​ నుంచి మాత్రం 5.4 శాతం గ్రోత్​ను కంపెనీ సాధించగలిగింది.