
- యాదాద్రి జిల్లాలో తాగునీటి సమస్య తీర్చేందుకు రూ. 122.94 కోట్ల కేటాయింపు
- 11 వేల కిలో లీటర్ల సామర్థ్యంతో కూడిన వాటర్ ట్యాంక్‌ల నిర్మాణం
- డెడ్‌లైన్ 2026 మార్చి 31
యాదాద్రి, వెలుగు: ప్రతి కుటుంబానికి స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా అమృత్ 2.0 అమలు చేస్తోంది. వచ్చే ఏడాది ఎండాకాలం సమీపించేనాటికి తాగు నీటిని అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వాలు ముందుకు సాగుతున్నాయి.
సాగునీటి ప్రాజెక్టులు లేని యాదాద్రి
యాదాద్రి జిల్లాలో హైదరాబాద్ నగరం నుంచి వచ్చే మూసీ కాల్వలు తప్ప మరొకటి లేదు. ఈ కాల్వల్లో హైదరాబాద్ మురికి నీరే ప్రవహిస్తుండడం వల్ల దేనికి పనికిరాదు. ఈ నీటితో పండించే పంటలను కొనుగోలు చేయడానికి వ్యాపారులు కూడా వెనుకాడుతారు. ఇక జిల్లాలో చేపట్టిన బస్వాపురం రిజర్వాయర్ పనులు ఇంకా మధ్యలోనే ఉన్నాయి. గంధమల్ల రిజర్వాయర్ సర్వే దశలోనే ఉంది. ఇక్కడి ప్రజలకు చెరువులు, కుంటలతో పాటు బోరు, బావులే దిక్కు. వానలు తక్కువగా కురిస్తే భూగర్భ జలాలు అడుగంటి తాగు నీటికి కరువు ఏర్పడుతోంది.
అమృత్ 2.0 @ రూ.122.94 కోట్లు
జిల్లాకు తాగునీటి అవసరాల కోసం కేంద్రం అమలు చేస్తున్న అమృత్ 2.0 స్కీమ్ దిక్కుగా మారింది. ఈ స్కీమ్ కింద జిల్లాలోని భువనగిరి, ఆలేరు, యాదగిరిగుట్ట, మోత్కూరు, చౌటుప్పల్, భూదాన్ పోచంపల్లి మన్సిపాలిటీల్లో 11 వేల కిలో లీటర్ల సామర్థ్యంతో కూడిన వాటర్ ట్యాంక్‌ల నిర్మాణం చేపట్టింది. దీంతో పాటు పైప్‌లైన్ ఏర్పాటు పనులు చేపట్టింది. ఇందుకోసం రూ. 122.94 కోట్లు మంజూరు చేసింది.
స్పీడ్ అందుకున్న పనులు
2021–-22లో ప్రారంభించిన ఈ స్కీమ్ 2025-–26 ఫైనాన్స్ ఇయర్లో పూర్తి చేయాల్సి ఉంది. అయితే గత ప్రభుత్వం ఈ స్కీమ్‌పై పెద్దగా దృష్టి పెట్టలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతేడాదిలో ఈ పనులు ప్రారంభమయ్యాయి. ఈ స్కీమ్ మధ్య ట్యాంక్‌ల నిర్మాణ పనుల్లో వేగం పుంజుకుంది. వచ్చేఏడాది ఎండాకాలం రాకముందే అంటే 2026 మార్చి 31 వరకూ పూర్తి చేయించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగా ఇటీవలే రూ. 26 కోట్లు కూడా రిలీజ్ అయ్యాయి. తాజాగా నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్న ఆఫీసర్లతో అడిషనల్ కలెక్టర్ ఏ భాస్కర రావు రివ్యూ మీటింగ్ నిర్వహించి, నిర్ణీత సమయంలో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. మెయిన్ పైపు లైన్ల వర్క్స్ ముగిసిన తర్వాత మున్సిపాలిటీల్లో నల్లాల ద్వారా నీటిని పంపిణీ చేయడానికి ఇంటర్నల్ పైపు లైన్లు ఏర్పాటు చేయనున్నారు.
గుట్ట మున్సిపాలిటీకే ఎక్కువ..
ఈ స్కీమ్ కింద జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో ఎక్కువ నిధులు యాదగిరిగుట్ట మున్సిపాలిటీకి మంజూరు అయ్యాయి. మంజూరు చేసిన ఫండ్స్‌లో 30 శాతం కంటే ఎక్కువగా ఈ ఒక్క మున్సిపాలిటీకే కేటాయించారు. పెద్ద మున్సిపాలిటీలైన భువనగిరి, ఆలేరు, చౌటుప్పల్ కంటే ఎక్కువ మొత్తంలో యాదగిరిగుట్టకు రూ.38.64 కోట్లు కేటాయించారు. మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత, తాజా ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య కూడా ఈ మండలం పరిధిలోని వారు కావడం వల్లే ఎక్కువగా కేటాయింపులు చేయించారన్న ప్రచారమూ జరుగుతోంది.
మార్చినాటికి అందుబాటులోకి
ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలన్న లక్ష్యంతో పనులు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది మార్చి నాటికి ట్యాంకుల నిర్మాణంతో పాటు పైపులైన్ల పనులు పూర్తి చేయిస్తాం. ఎండాకాలంలో నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకుంటాం. - ఏ భాస్కర్‌రావు, అడిషనల్ కలెక్టర్, యాదాద్రి
మున్సిపాలిటీల వారీగా ఫండ్స్ కేటాయింపులు, ట్యాంకుల సామర్థ్యం కిలో లీటర్లలో, పైపులైన్లు కిలో మీటర్లలో
మున్సిపాలిటీ సామర్థ్యం మెయిన్ పైప్‌లైన్ పంపిణీ పైప్ లైన్ ఫండ్స్
యాదగిరిగుట్ట 2200 11.56 కి. మీటర్లు 7.6 కిలో మీటర్లు ₹38.64
భువనగిరి 2800 2.58 31.6 ₹21.80
పోచంపల్లి 500 5.6 35.00 ₹17.50
ఆలేరు 1700 4.4 9.7 ₹12.00
మోత్కూరు 1450 5.2 7.42 ₹12.00
చౌటుప్పల్ 2400 2.75 26.00 ₹21 .00