
- టెస్టు కెప్టెన్‌గా రోహిత్ కొత్త ఇన్నింగ్స్
- నేటి నుంచి శ్రీలంకతో తొలి మ్యాచ్
- ఉ. 9.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో
మొహాలీ: ఇండియా క్రికెట్ ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో శుక్రవారం మొదలయ్యే తొలి టెస్టు అటు కోహ్లీకి వందో మ్యాచ్‌కాగా.. ఇటు టెస్టు కెప్టెన్‌గా రోహిత్‌కు తొలి పోరు. బలహీనంగా ఉన్న లంకను ఓడించి ఈ మ్యాచ్‌ను మధురజ్ఞాపకంగా మార్చుకోవాలని ఈ ఇద్దరితో పాటు ఇండియా మొత్తం ఆశిస్తోంది. టీ20ల్లో వైట్‌వాష్ అయిన లంక నుంచి పెద్దగా పోరాటాన్ని ఆశించలేం. రోహిత్‌సేన జోరు చూపిస్తే మ్యాచ్ ఐదు రోజుల వరకూ కూడా వెళ్లకపోవచ్చు. ఈ మ్యాచ్‌లో ఫోకస్ మొత్తం కోహ్లీ, రోహిత్‌పైనే ఉంది.
కొడతాడా వందలో వంద
1932లో క్రికెట్ మొదలైనప్పుడే టెస్టు ప్రయాణం మొదలు పెట్టిన ఇండియా టీమ్ నుంచి ఎంతో మంది స్టార్లు, సూపర్ స్టార్లు, మెగా స్టార్స్ వచ్చారు. వాళ్లలో విరాట్ మరింత ప్రత్యేకం. అన్ని ఫార్మాట్లలో ఖతర్నాక్ ఆటతో పాటు కెప్టెన్సీ రికార్డులతో ఈ తరంలో అతిపెద్ద సూపర్ స్టార్ అయ్యాడు. సగం కెరీర్‌తోనే లెజెండ్ హోదా సంపాదించాడు. క్రికెట్‌కు ప్రాణం ఇచ్చే ఇండియాలో విరాట్ పాపులారిటీ ఓ రేంజ్‌లో ఉంది. వాస్తవానికి కరోనా నేపథ్యంలో ఖాళీ స్టేడియంలోనే మ్యాచ్ నిర్వహించాలని అనుకున్న బీసీసీఐ అతని ఫ్యాన్స్ డిమాండ్‌కు తలొగ్గి ప్రేక్షకులను అనుమతించాలని నిర్ణయించింది. ఫ్యాన్స్ కేరింతల మధ్య ఈ మ్యాచ్ ఆడనున్న విరాట్‌కు ఇది అసలైన టెస్ట్ కాబోతోంది. రెండేళ్లుగా అతను మూడు ఫార్మాట్లలోనూ సెంచరీ చేయలేదు. ఈ మ్యాచ్‌లో నూరు కొడతాడని అభిమానులంతా వేయి కండ్లతో ఎదురు చూస్తున్నారు. తనపై ఇప్పుడు కెప్టెన్సీ భారం కూడా లేదు. లక్మల్, కుమార, ఎంబుడ్దెనియాతో పసలేని లంక బౌలింగ్ ఎదురుగా ఉంది. దీన్ని సద్వినియోగం చేసుకొని తన ట్రేడ్‌మార్క్ కవర్స్, ఆన్ డ్రైవ్స్, ఫ్లిక్స్, పుల్స్‌తో సెంచరీ కొడితే బాగుంటుంది. కోహ్లీకి నిశ్శబ్దం అస్సలు నచ్చదు. ఫ్యాన్స్ నుంచే అతను శక్తి కూడదీసుకుంటాడు. స్టాండ్స్‌లోని ప్రేక్షకుల కేరింతలతో సౌండ్ చేస్తుంటే విరాట్ ఫోర్లు, సిక్సర్లతో రీసౌండ్ చేస్తుంటాడు. మరి, మొహాలీలో ఏం చేస్తాడో చూడాలి.
రోహిత్ టీమ్ ఆట షురూ..
కోహ్లీతో పాటు రోహిత్‌కు కూడా ఈ మ్యాచ్ కీలకమే. విరాట్ నుంచి ఇప్పటికే వన్డే, టీ20 పగ్గాలు అందుకున్న హిట్‌మ్యాన్ ఇప్పుడు టెస్టు కెప్టెన్‌గా మారాడు. పైగా, పుజారా, రహానె, ఇషాంత్ కెరీర్ ముగింపునకు చేరడంతో సంధి దశలో ఉన్న టీమ్‌ను నడిపించడం అతనికి సవాలే కానుంది. వాళ్ల స్థానాల్లో యంగ్‌స్టర్స్‌ను పరీక్షించి భవిష్యత్ టీమ్‌ను తయారు చేసే బాధ్యత అతనిపై ఉంది. ఈ నేపథ్యంలో ఐదు రోజుల ఆటలో అతను ఎలాంటి కాంబినేషన్‌తో బరిలోకి దిగుతాడో చూడాలి.
కాంబినేషన్ ఎట్ల
రాహుల్ లేకపోవడంతో మయాంక్‌తో కలిసి రోహిత్ ఇన్నింగ్స్ ఓపెన్ చేయనున్నాడు. వన్‌డౌన్‌లో శుభ్‌మన్ గిల్‌ను ఆడించడం ఖాయమే. మిడిలార్డర్‌లో కీలక బాధ్యతలు మోసిన రహానె స్థానాన్ని భర్తీ చేసేందుకు హనుమ విహారి, శ్రేయస్ అయ్యర్ మధ్య పోటీ ఉంది. పక్కా టెస్టు ప్లేయర్‌గా.. ఫైటర్‌గా పేరు తెచ్చుకోవడంతో పాటు స్పిన్నర్లను బాగా డిఫెండ్ చేయగలడనే పేరున్న హైదరాబాదీకే మొగ్గు కనిపిస్తోంది. ఆరో నంబర్‌లో అతన్ని బ్యాటింగ్‌కు దింపే చాన్సుంది. అదే టైమ్‌లో కీపర్ రిషబ్ పంత్‌ను ఐదో నంబర్‌లో ఆడించాలన్నది టీమ్ ప్లాన్‌గా కనిపిస్తోంది. మరోవైపు శ్రీలంక బ్యాటింగ్ భారం మొత్తం కెప్టెన్ కరుణరత్నె, చండిమల్, మాథ్యూస్‌పైనే ఉంది. మొహాలీలో టర్నింగ్ వికెట్‌పై వీళ్లు ఇండియా స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాను ఏ మేరకు ఎదుర్కుంటారో చూడాలి. మూడో స్పిన్నర్‌గా జయంత్, కుల్దీప్‌తో పాటు కొత్త ప్లేయర్ సౌరభ్ కుమార్‌లో రోహిత్ ఎవరికి మొగ్గు చూపుతాడో చూడాలి. పేసర్లలో వైస్ కెప్టెన్ బుమ్రాకు తోడు సిరాజ్, షమీలో ఒకరు బరిలో దిగనున్నారు.
జట్లు (అంచనా)
ఇండియా: రోహిత్ (కెప్టెన్), మయాంక్, గిల్, కోహ్లీ, పంత్ (కీపర్), విహారి/శ్రేయస్, జడేజా, అశ్విన్, జయంత్/కుల్దీప్, సిరాజ్/షమీ, బుమ్రా.
శ్రీలంక: దిముత్ కరుణరత్నె (కెప్టెన్), లాహిరు తిరిమన్నె, నిసాంక, మాథ్యూస్, ధనంజయ, చండిమల్/అసలంక, డిక్‌వెలా (కీపర్), సురంగ, ఎంబుల్దెనియ, జయవిక్రమ/విశ్వ ఫెర్నాండో, లాహిరు కుమార.
చాలా శ్రమించా..
నిజాయతీగా చెప్పాలంటే వంద టెస్టులు ఆడతానని నేను అస్సలు అనుకోలేదు. ఇదో సుదీర్ఘ ప్రయాణం. ఈ ఘనత సాధించడం గొప్పగా అనిపిస్తోంది. ఇంత దూరం రావడానికి ఫిట్ నెస్ కోసం చాలా శ్రమించా. నాకు, నా ఫ్యామిలీకి ఇది గొప్ప సందర్భం.
‑ విరాట్ కోహ్లీ
క్రెడిట్ కోహ్లీదే
టెస్టుల్లో ఇండియా ఇంత మంచి స్థితిలో ఉన్నందుకు కోహ్లీకి క్రెడిట్ ఇవ్వాలి. అతడు ఎక్కడైతే ముగించాడో అక్కడి నుంచే నేను టీమ్ ను ముందుకు తీసుకెళ్తా. రహానె, పుజారా స్థానాలను భర్తీ చేయడం అంత సులభం కాదు. వారు టీమ్ కోసం చేసిన కృషిని మాటల్లో చెప్పలేం. బయటి దేశాల్లో విజయాలు, టెస్టుల్లో ఇండియా నంబర్ వన్ టీమ్ గా ఎదగడంలో వారిద్దరిదీ కీలక పాత్ర. ఇప్పటికి మాత్రమే వారిని పక్కన పెట్టాం.
‑ కెప్టెన్ రోహిత్
కోహ్లీ టెస్టు కెరీర్ హైలైట్స్
- తొలి టెస్టు జూన్ 20, 2011న కింగ్‌స్టన్‌లో వెస్టిండీస్‌పై ఆడాడు. రెండు ఇన్నింగ్స్ ల్లో
- 4, 15 స్కోర్లు సాధించాడు.
- తొలి సెంచరీ 2012లో ఆస్ట్రేలియాపై చేశాడు.
- 2019లో బంగ్లాదేశ్ పై పింక్ బాల్ టెస్టులో చివరిసారిగా సెంచరీ సాధించాడు.
- కెప్టెన్‌గా తొలి మ్యాచ్ 2014లో అడిలైడ్‌లో ఆస్ట్రేలియాపై ఆడాడు.
- గ్రెగ్ చాపెల్ తర్వాత కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే రెండు సెంచరీలు కొట్టిన రెండో ప్లేయర్ కోహ్లీ.
- కెప్టెన్‌గా 68 టెస్టులు ఆడి ఇండియాకు 40 విక్టరీలు అందించాడు.
- ఆస్ట్రేలియాపై అత్యధికంగా 7 సెంచరీలు చేశాడు.
- ఇంగ్లండ్ పై అత్యధికంగా 1960 రన్స్ సాధించాడు
- కెప్టెన్‌గా 20 సెంచరీలు కొట్టాడు. గ్రేమ్ స్మిత్ (25) తర్వాత కెప్టెన్‌గా ఈ ఫార్మాట్‌లో ఎక్కువ సెంచరీలు తనవే.