మణిపూర్లో భూకంపం

మణిపూర్లో భూకంపం

మణిపూర్లో భూకంపం సంభవించింది.  మొయిరాంగ్‌లో మార్చి 23వ తేదీ  గురువారం సాయంత్రం 6:51 గంటలకు స్వల్పంగా భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై 3.8 తీవ్రతగా నమోదైనట్లు  నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. భూకంప కేంద్రం మొయిరాంగ్‌కు 60 కిమీ దూరంలో...67 కిలోమీటర్లు లోతులో ఏర్పడిందని పేర్కొంది. దీని వల్ల ఎలాంటి మరణాలు, ఆస్తి నష్టం జరగలేదని వెల్లడించింది. మంగళవారం నుంచి భారత్‌లో భూకంపం రావడం ఇది మూడోసారి.

మార్చి 21న  దేశ రాజధాని ఢిల్లీలో భూకంపం సంభవించింది.  పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 6.6గా నమోదైంది. ఢిల్లీతో పాటు ఉత్తర భారతంలోని పలు రాష్ట్రాల్లో భూమి కంపించింది. ఢిల్లీతో పాటు పంజాబ్, జమ్మూకశ్మీర్లోనూ భూప్రకంపనలు వచ్చాయి. దీంతో జనం తీవ్ర భయాందోళనకు గురయ్యారు. భూకంపం ధాటికి ఇండ్లలోని వస్తువులు కింద పడ్డాయి. ఫ్యాన్లు ఊగిపోయాయి. హర్యానా, ఉత్తరప్రదేశ్ లోనూ భూమి కంపించింది. నోయిడా, ఘజియాబాద్, వసుంధర ప్రాంతాల్లో భూప్రకంపనలతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. 

అదే భారత్ సరిహద్దు దేశం అప్ఘానిస్తాన్ లోని ఫైజాబాద్లో భూకంపం ఏర్పడింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6.6గా నమోదైంది. అప్ఘానిస్తాన్ ఫైజాబాద్లో భూకంపం ప్రభావం మనదేశంపై పడింది. దీని కారణంగా ఉత్తర భారతంలోని పలు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు వచ్చాయి. కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది.