గుజరాత్ లో ఓ వైపు తుఫాన్.. మరోవైపు భూ ప్రకంపనలు

గుజరాత్ లో ఓ వైపు తుఫాన్.. మరోవైపు భూ ప్రకంపనలు

ఓవైపు.. బిపోర్‌జాయ్‌ తుపాను భయపెడుతుంటే.. మరోవైపు గుజరాత్ కచ్ ప్రాంతంలో భూకంపం సంభవించింది. కచ్ జిల్లాలో రిక్టర్ స్కేలుపై 3.5 తీవ్రంతో భూకంపం వచ్చింది. వరుసగా రెండు రోజులుగా దేశంలోని పలు ప్రాంతాల్లో భూకంపాలు సంభవిస్తున్నాయి. బుధవారం (జూన్ 14వ తేదీన) జమ్మూ కాశ్మీర్ లోని నాలుగు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి.

దోడా, కిష్ట్వార్ జిల్లాలో స్కూళ్లను మూసేశారు అధికారులు. కిష్ట్వార్ ప్రాంతంలో 3.3 తీవ్రతతో ఉదయం 8.29 గంటలకు భూకంప వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మోలజీ వెల్లడించింది. దీనికి ముందు దోడాలో బుధవారం తెల్లవారుజామున 3.5 తీవ్రతతో, 4.3 తీవ్రతతో, దీనికి ముందు రియాసి జిల్లాలో 2.8 తీవ్రతతో తెల్లవారుజామున 2.43 గంటలకు భూకంపాలు వచ్చాయి. 

అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపోర్‌జాయ్‌ తుపాను తీరం దిశగా దూసుకొస్తోంది. గురువారం (జూన్ 15వ తేదీ) సాయంత్రం ఈ తుపాను ముందుగా అనుకున్నట్లు జఖౌ దగ్గర కాకుండా.. దిశ మార్చుకుని కచ్ దగ్గరే తీరం దాటనున్నట్లు చెబుతున్నారు. 

జూన్ 14వ తేదీ సాయంత్రం 3 గంటల సమయానికి గుజరాత్ తీరానికి 280 కిలోమీటర్ల దూరంలో ఉన్న తుఫాన్ కేంద్రం.. గంటకు 30 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తుంది. తీరం దాటే సమయంలో 150 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయనున్నట్లు ప్రకటించింది వాతావరణ శాఖ. 

తుపాన్ ప్రభావంతో పలు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. అటు గుజరాత్‌ లోని కచ్‌, ద్వారక, సౌరాష్ట్ర ప్రాంతాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేశారు అధికారులు. కచ్‌, ద్వారక, పోర్‌బందర్‌, జామ్‌నగర్‌, మోర్బీ, జునాగఢ్‌, రాజ్‌కోట్‌ జిల్లాల్లో ఇప్పటికే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. జూన్ 14, 15వ తేదీల్లోనూ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ (IMD) తెలిపింది.  

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో 25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనా ఆశ్చర్యం లేదని పేర్కొంది. లోతట్టు ప్రాంతాలకు వరదముప్పు పొంచి ఉందని హెచ్చరించింది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. తీర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 50 వేల మందిని తరలించారు. 

తుపాను ప్రభావంతో గుజరాత్‌లోని పలు ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. దీంతో చాలా చోట్ల చెట్లు నేలకూలాయి. ఇప్పటికే కొన్ని లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరి.. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రెస్క్యూ ఆపరేషన్‌కు ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్ఎఫ్‌ సిబ్బంది సిద్ధంగా ఉన్నారు. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ఎప్పటికప్పుడూ పరిస్థితిని సమీక్షిస్తున్నాయి. ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే భారత ఆర్మీ బలగాలు రంగంలోకి దిగాయి. 

బిపోర్‌జాయ్‌ తుపాను ఎఫెక్ట్ తో గుజరాత్‌తో పాటు మరో ఎనిమిది రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో కేరళ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, గోవా రాష్ట్రాలతో పాటు డామన్‌డయ్యూ, లక్షద్వీప్‌, దాద్రానగర్‌ హవేలీ కేంద్ర పాలిత ప్రాంతాలు అప్రమత్తమయ్యాయి. 

తుఫాన్ తీవ్రత దృష్ట్యా 95 రైళ్లను రద్దు చేసింది రైల్వే శాఖ.  11 జిల్లాల పరిధిలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రజలు అత్యవసరం అయితేనే ప్రయాణాలు పెట్టుకోవాలని లేకపోతే వాయిదా వేసుకోవాలని రైల్వే శాఖ కోరింది. 

తీరంలో అలలు ఉధృతి ఎక్కువగా ఉంది. ప్రజలు ఎవరూ అటువైపు వెళ్లకుండా కోస్ట్ గార్డ్ సిబ్బంది మైకుల్లో ప్రకటిస్తున్నాయి. తుఫాన్ తీరం దాటే ప్రాంతాల్లోనే కాకుండా.. ఇతర ప్రాంతాల్లోని ప్రజలు కూడా సముద్రం వైపు వెళ్లొద్దని సూచించారు అధికారులు. 

ALSO READ: తుఫాన్ కారణంగానే ఖమ్మం సభ వాయిదా.. అమిత్ షా టూర్ రద్దు : బండి సంజయ్