మూడో రోజూ..ఏనుగు టెన్షన్​!

మూడో రోజూ..ఏనుగు టెన్షన్​!
  •     మహారాష్ట్ర వైపు వెళ్లిందన్న అటవీ అధికారులు
  •     ఏనుగు కదలికలను డ్రోన్​తో పర్యవేక్షణ 
  •      మరో ఏనుగు వచ్చిందన్న సమాచారంతో వీడని ఆందోళన

కాగ జ్ నగర్, వెలుగు : కాగ జ్ నగర్ డివిజన్ లో  ఇద్దరిని తొక్కి చంపిన ఏనుగు..  మూడో రోజూ అటవీ అధికారులను టెన్షన్​ పెట్టింది.  అటవీ అధికారులు డ్రోన్​ సాయంతో ఏనుగు కదలికలను పసిగడుతూ ముందుకు కదిలారు.  శుక్రవారం రాత్రి అది ప్రాణహిత నది దాటి ఉంటుందని  అధికారులు అంచనాకు వచ్చారు. కాగా సాయంతం మరో ఏనుగు వచ్చిందనే వార్తలతో అటవీ సమీప  గ్రామాల ప్రజలను ఆందోళన వీడటం లేదు. గురువారం రాత్రి కొండపల్లి చెక్ పోస్ట్ వద్ద రోడ్డు మీదకు వచ్చిన ఏనుగు రాత్రంతా తిరిగింది.

శుక్రవారం ఉదయం పెంచికల్ పేట్ రేంజ్ లోని కమ్మార్ గాం సమీపంలోని పల్లె ప్రకృతి వనం పక్కనుంచి అడవిలోకి వెళ్ళడం గ్రామస్థులు గమనించి, విషయాన్ని పొలీస్, ఫారెస్ట్ ఆఫీసర్లకు చెప్పారు. దీంతో అధికారులు అక్కడికి చేరుకొని ట్రాకింగ్ చేశారు. ఈ క్రమంలో డ్రోన్ కెమెరాలతో కమ్మర్ గాం, మురళి గూడ అడవిలో సెర్చ్ చేశారు. కమ్మర్ గాం , మురళీ గూడ గ్రామాల మధ్యఉన్న ఫారెస్ట్ లో గుట్ట పక్కన లోయలో సేదతీరుతున్న ఏనుగు ను గుర్తించారు. దీంతో ఆ రహదారిలో రాకపోకలను అధికారులు నిలివేశారు. 

ఎన్జీఓల సాయం..

ఏనుగు కదలికలను కనిపెట్టేందుకు ఏనుగుల సంరక్షణ కు పాటు పడుతున్న కోల్ కత్తా కు చెందిన గజే ఫౌండేషన్ డైరెక్టర్ శాడ్నిక్ సేన్ గుప్తా, మెంబర్ రితేష్ చౌదరి సాయాన్ని ఫారెస్ట్​ అధికారులు ఉపయోగించుకున్నారు.  ఎన్జీఓ ప్రతినిధుల సాయంతో... అధికారులు.. ప్రజలకు పలు జాగ్రత్తలు చెప్పారు. అయిదు కిలోమీటర్ల దూరం నుంచే వాసన పసిగట్టే గుణం ఏనుగులకు ఉంటుందని ఎన్జీఓ సభ్యులు చెప్తున్నారు. దాన్ని చూసి భయపడితే ఇంకా భయపెడుతూ దాడి చేస్తుందని అంటున్నారు. సెర్చ్​ ఆపరేషన్​ను డీఎఫ్ఓ నీరజ్ కుమార్ పర్యవేక్షించారు.

కాగా రెండు రోజుల క్రితం ఏనుగు దాడిలో మృతి చెందిన చింతల మానే పల్లి మండలం భూరే పల్లి కి చెందిన అల్లూరి శంకర్ మీద దాడి జరిగిన చోటును పరిశీలించి, ఆయన కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే కోనేరు కోన ప్ప, జడ్పీ మాజీ చైర్మన్ గణపతి, కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్​చార్జి రావి శ్రీనివాస్ పరామర్శించి ధైర్యం చెప్పారు.

మహారాష్ట్ర కు వెళ్తే సేఫ్..

మహారాష్ట్ర నుంచి దారి తప్పి వచ్చిన ఏనుగు   తిరిగి నది దాటి మహారాష్ట్రకు వెళ్తే.. ఊపిరిపీల్చుకోవచ్చని ఇక్కడి ఫారెస్ట్ అధికారులు అంటున్నారు.  కనీసం ఏనుగు ను ఎలా ఎదుర్కోవాలో సరైన అవగాహన లేక దాన్ని వెంబడించడం అరకిలోమీటరు దూరం నుంచి చూస్తూ ఉండడం తప్ప ఏమి చేయలేకపోయారు.  కనీసం దారి మళ్లించి వెళ్లగొట్టేందుకు కూడా యత్నించిన దాఖలాలు లేవు. ఏనుగుకు ఆహారం దొరకడం కూడా కష్టంగా మారిందని తెలుస్తోంది.

ఏనుగు కోసం ఫారెస్ట్ ఆఫీసర్లు వాటర్​మిలన్స్​, అరటి పండ్లు పెద్ద మొత్తంలో తెచ్చినా వాటిని అందించేందుకు మాత్రం ఎవరూ సాహసించలేదు. ఏనుగుకు ఆహారం అందిస్తే అది ఇక్కడే ఉండే అవకాశం ఉందనీ, లాగే ఆహారం ఇవ్వడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నట్లు సమాచారం.

రాత్రంతా తిరిగి.. మధ్యాహ్నం రెస్ట్..

  •     కాగ జ్ నగర్ అడవులకు దారి తప్పి వచ్చిన ఏనుగు రాత్రంతా తిరిగింది. పగలంతా రెస్ట్ తీసుకుంది. 
  •     మూడు రోజుల కింద  చింతల మానే పల్లీ మండలం భూరేపల్లిలో అడుగు పెట్టి, ఆరోజు రాత్రంతా తిరిగింది. 
  •     తెల్లవారుజామున పెంచికల్ పేట్ మండలం కొండపల్లికి చేరి,  దాడి చేసింది. 
  •     ఆతర్వాత కనిపించకుండా పోయిన ఏనుగు మళ్ళీ రాత్రి ఏడు గంటలకు ప్రత్యక్షమైంది. 
  •     కొండపల్లి చెక్ పోస్ట్ వద్ద రోడ్డు మీద బస్సుకు అడ్డంగా వచ్చింది. 
  •      మళ్ళీ తెల్లారి కమ్మర్ గాం కు చేరింది. 
  •     ఉదయం పదింటి వరకు నడుస్తూ వెళ్లిన ఏనుగు ఆతర్వాత గుట్ట పక్కన ఉన్న చెట్ల నడుమ సేద తీరుతూ కనిపించింది. 
  •     మధ్యాహ్నం పూట అసలు ఎటూ తిరగడం లేదు. సాయంత్రం సమయానికి మళ్లీతిరగడం ప్రారంభిస్తోంది.