నిమిష ప్రియ ఉరి వాయిదా..చివరి నిమిషంలో బిగ్ రిలీఫ్

నిమిష ప్రియ ఉరి వాయిదా..చివరి నిమిషంలో బిగ్ రిలీఫ్
  • బాధిత కుటుంబంతో ‘బ్లడ్ మనీ’పై కొనసాగుతున్న చర్చలు
  • భారత్ కాస్త గడువు కోరడంతో యెమెన్ అంగీకారం

సనా (యూఏఈ): యెమెన్ పౌరుడిని హత్య చేసిన ఆరోపణలతో ఉరిశిక్ష ఎదుర్కొంటున్న కేరళ నర్సు నిమిష ప్రియకు తాత్కాలిక ఉపశమనం లభించింది. బుధవారం(జులై 16న) అమలు కావాల్సిన ఆమె ఉరిశిక్షను ప్రభుత్వం వాయిదా వేసింది. భారత ప్రభుత్వం, యెమెన్ జైలు అధికారులు జరిపిన చర్చలతో ఈ నిర్ణయం వెలువడింది. 

నిమిష ప్రియ ప్రస్తుతం హౌతీల ఆధీనంలో ఉన్న సనాలో జైలులో ఉంది. నిమిష ఉరిశిక్ష వాయిదాపై ఆమె తల్లి ప్రేమకుమారి, భర్త టోమీ థామస్‌‌‌‌లు సంతోషం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని భారత ప్రభుత్వం స్వాగతించింది. నిమిషను రక్షించేందుకు సాధ్యమైన అన్ని ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు తెలిపింది. యెమెన్‌‌‌‌లో హౌతీ రెబల్స్ నియంత్రణ, భారత్‌‌‌‌తో అధికారిక దౌత్య సంబంధాలు లేకపోవడం వంటి సవాళ్లు ఉన్నప్పటికీ షరియా చట్టం ప్రకారం..‘బ్లడ్ మనీ’ (దియా) చెల్లింపు ద్వారా ఆమెను కాపాడేందుకు ట్రై చేస్తున్నామని వివరించింది. దీనిపై బాధిత కుటుంబంతో  యెమెన్‌‌‌‌ ప్రభుత్వం చర్చలు జరిపేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొంది.

‘బ్లడ్ మనీ’కి బాధిత కుటుంబం అంగీకరిస్తే నిమిష ప్రియ ఉరిశిక్ష రద్దు అవుతుందని ఉందని కేంద్రం తెలిపింది. తాము ఇప్పటిదాకా యెమెన్ జైలు అధికారులు, ప్రాసిక్యూటర్ ఆఫీసుతో జరిపిన చర్చల ఫలితంగానే నిమిష ప్రియ ఉరిశిక్ష అమలు చివరి నిమిషంలో వాయిదా పడిందని కేంద్రం స్పష్టం చేసింది. బాధితురాలి కుటుంబం, నిమిష ప్రియ కుటుంబం మధ్య ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనడానికి యెమెన్‌‌‌‌ ప్రభుత్వాన్ని 
మరింత గడువు కోరామని వెల్లడించింది.

సానుకూలంగా సాగుతున్న చర్చలు!

ఈ కేసులో ‘బ్లడ్ మనీ’ అంగీకరించేలా బాధిత కుటుంబాన్ని ఒప్పించేందుకు కేరళ మత గురువు కాంతాపురం ఏపీ అబూబకర్ ముస్లియార్ ఇప్పటికే ప్రయత్నాలు మొదలు పెట్టారు. యెమెన్​లోని బాధిత కుటుంబంతో అబూబకర్ చర్చలు సానుకూలంగా సాగుతున్నట్లు సమాచారం. 1 మిలియన్ డాలర్లు(దాదాపు 8.6 కోట్లు) క్షమాధనాన్ని ఇచ్చేందుకు నిమిష ప్రియ ఫ్యామిలీ సిద్ధమైంది. సేవ్ నిమిష ప్రియ ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో విరాళాల సేకరణ జరుగుతోంది.