మేడిగడ్డ పిల్లర్ ఘటనపై విచారణ జరపాలి : తమ్మినేని వీరభద్రం

మేడిగడ్డ పిల్లర్ ఘటనపై విచారణ జరపాలి :   తమ్మినేని వీరభద్రం

హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తిపోతల పథకంలో కీలకమైన మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్‌ కుంగుబాటుపై సమగ్ర విచారణ జరిపించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. నాణ్యతా లోపాలపై వాస్తవాలను ప్రజలకు బహిర్గతం చేయాలన్నారు. డ్యామ్ సేఫ్టీ ఆఫీసర్స్ రిపోర్ట్ ఆధారంగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం మూడేండ్లలోనే పూర్తి చేశారన్న సంతోషం.. మూణ్ణాళ్ల ముచ్చటగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల గోదావరి వరదలకు బ్యారేజీలో ఏడు పంపులు నీట మునిగాయని గుర్తుచేశారు. ఆ ఘటన మరిచిపోకముందే, బ్యారేజీకి చెందిన 18 నుంచి 21 వరకు పిల్లర్లు అడుగున్నర లోతు కుంగిపోయాయని తెలిపారు. ఇంత పెద్ద నష్టం జరిగినా ఇప్పటివరకు ప్రభుత్వం, ఇంజినీర్లు నుంచి స్పందన లేదని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇప్పటికై సమగ్ర విచారణ జరిపాలని డిమాండ్ చేశారు. అంతేగాక, నష్టానికి  బాధ్యులు ఎవరో ప్రకటించి, కఠిన చర్యలు తీసుకోవాలని తమ్మినేని పేర్కొన్నారు.