ఇంటర్ బోర్డు పరిణామాలపై విచారణ చేయించాలె : ఇంటర్ విద్యా జేఏసీ ఛైర్మన్

ఇంటర్ బోర్డు పరిణామాలపై విచారణ చేయించాలె : ఇంటర్ విద్యా జేఏసీ ఛైర్మన్

ఇంటర్ బోర్డు పరిణామాలపై ఇంటెలిజెన్స్ విభాగంతో సమగ్ర విచారణ జరిపించాలని ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల అసోసియేషన్ అధ్యక్షుడు, ఇంటర్ విద్యా జేఏసీ ఛైర్మన్ మధుసూదన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇంటర్ పరీక్షా పత్రాల ఆన్ లైన్ వాల్యుయేషన్ చేయాలన్న ఇంటర్ బోర్డ్ నిర్ణయాన్ని ఆయన తప్పుపట్టారు. జూనియర్ లెక్చరర్లకు ఆన్ లైన్ వాల్యుయేషన్ పై ముందస్తుగా అవగాహన కల్పించలేదని విమర్శించారు. 25 లక్షల పేపర్లను ఆన్ లైన్ లో వాల్యుయేషన్ చేయడం కష్టమని అన్నారు. 

గతేడాది ఆన్ లైన్ వాల్యుయేషన్ ను తిరస్కరించిన బోర్డు.. ఈ ఏడాది ఎవరికి లబ్ది చేకూర్చేందుకు ఆమోదించిందని మధుసూదన్ ప్రశ్నించారు. గతంలో గ్లోబరినా సంస్థ వల్ల ఇంటర్ బోర్డుకు చెడ్డపేరు వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. మళ్లీ ఇదే తరహా సంస్థలకు టెండర్లను కేటాయించడాన్ని తప్పుబట్టారు. విద్యాశాఖ మంత్రి కూడా ఈ అంశాన్ని పట్టించుకోకుండా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ ఏడాది ప్రయోగాత్మకంగా ఒక్క సబ్జెక్టుకు ఆన్ లైన్ వాల్యుయేషన్ చేసి, సప్లమెంటరీ ఎగ్జామ్స్ నుంచి పూర్తిస్థాయిలో అమలు చేయాలని కోరారు.