ఆ ఖర్చుతో పేద పిల్లలకు ఫీజులు కట్టండి: లారెన్స్

ఆ ఖర్చుతో పేద పిల్లలకు ఫీజులు కట్టండి: లారెన్స్

కోలీవుడ్ హీరో రాఘవా లారెన్స్ క్రేజే వేరు. సాయం చేయడంలో ముందుండే లారెన్స్ కు సినీ ఇండస్ట్రీలో మంచి పేరుంది. ఆయన సినిమాలు వస్తే ఫ్యాన్స్ కి పండగే. ఏ హీరోకు చేయని వేడుకలు చేస్తారు. లేటెస్ట్ గా ఆయన నటించిన కాంచన-3 ఇటీవల రిలీజై మంచి టాక్ తెచ్చుకుంది. సినిమా హిట్ కావడంతో ఫ్యాన్స్ సందడి అంతాఇంతా కాదు. భారీ కటౌట్స్ కు పాలాభిషేకం చేశారు. అయితే మాములుగా పోస్టర్లకు పాలాభిషేకం చేయడం కామన్. కానీ..రాఘవా లారెన్స్ బిగ్ కటౌట్లకు క్రేన్లతో పాలాభిషేకం చేసి అభిమానం చాటుకున్నారు. భారీ క్రేన్ సహాయంతో తన చేతుల మీదుగా లారెన్స్ కటౌట్‌ కి పూలమాల వేసి పాలాభిషేకం చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ లారెన్స్ దృష్టికి వెళ్లింది. దీంతో వెంటనే స్పందించిన లారెన్స్.. ఇలాంటి ఘటనలు తనకు నచ్చవంటూ అసంతృప్తి వ్యక్తంచేశాడు. దీనిపై ఫ్యాన్స్ కు రిక్వెస్ట్ చేశాడు లారెన్స్. దయచేసి ప్రాణాలకు తెగించి ఇలాంటి పనులు చేయకండి అని తెలిపాడు.

దయచేసి ఇలాంటి రిస్క్‌ లను తీసుకోవద్దన్నాడు. మీ ప్రాణాలను రిస్క్‌ లో పెట్టి.. తనపై ఉన్న ప్రేమను చూపడం సరికాదని తెలిపాడు. మీ కోసం ఇంటి దగ్గర ఫ్యామిలీ ఎదురు చూస్తుంటుందని.. వారిని మనసులో ఉంచుకుని మెదలండన్నాడు. నిజంగా మీకు నాపై ఉన్న ప్రేమను నిరూపించుకోవాలని ఉంటే.. పేద పిల్లలకు పుస్తకాలు కొనివ్వండి, ఫీజులు కట్టలేని వారికి ఫీజులు కట్టండి, ఆహారం లేక ఇబ్బంది పడుతున్న వృద్ధులకు అన్నం పెట్టండి. అదే నాకు సంతోషాన్నిస్తుందని సూచించాడు లారెన్స్. హార్రర్ థ్రిల్లర్‌ గా ప్రేక్షకుల ముందుకొచ్చిన  ‘కాంచన 3’ సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని విజయవంతంగా ప్రదర్శించబడువుతోంది.