300 రూపాయలతో కోట్ల సంపాదన

300 రూపాయలతో కోట్ల సంపాదన

తండ్రితో గొడవపడి.. ఓ బ్యాగు బట్టలు, మూడొందల రూపాయలతో ఇల్లు దాటింది చిను కాలా. అప్పటికి ఆమె వయసు పదిహేనేండ్లు. ఎక్కడికెళ్లాలో తెలియదు. ఆ మూడొందలు ఎన్ని రోజులు కడుపునింపుతాయో తెలియదు. అయినా సరే భయపడలేదు. రేయింబవళ్లు కష్టపడింది. ఇప్పుడు ఇండియాలోనే టాప్​ యాక్సెసరీస్​ బ్రాండ్స్​లో ఒకటైన రుబాన్స్​​కి ఓనర్ అయింది​. అక్షరాల ఏడాదికి ముప్పై కోట్లు సంపాదిస్తోన్న ముంబైకి చెందిన ఈ సక్సెస్​ఫుల్​ ఎంట్రప్రెనూర్​ గురించి..

ఎనిమిదేండ్ల  కిందట మూడు లక్షల పెట్టుబడితో రుబాన్స్​ని​ మొదలుపెట్టింది చిను. ఇప్పుడు​ హైదరాబాద్​తో పాటు బెంగళూరు, కొచ్చి లాంటి సిటీల్లోనూ ఐదు స్టోర్స్​ తెరిచింది. తన అఫీషియల్​ వెబ్​సైట్​కి తోడు  ఫ్లిప్​కార్ట్​, మింత్రా లాంటి ఆన్​లైన్​ స్టోర్స్​లోనూ నగలు​ అమ్ముతోంది. దీనంతటికి కారణం ఓ ఫ్యాషన్​ షో అంటూ తన బ్రాండ్​ వెనకున్న కథ చెప్పుకొచ్చింది చిను. 

ఇంకేం పని దొరకలేదా ?

అమ్మ అమెరికాలో ఉద్యోగం చేస్తోంది. నాన్న ముంబైలో ఉంటూ నన్నూ, నా ఇద్దరు తోబుట్టువుల్ని చూసుకుంటున్నాడు. ఒక రోజు ‘నేను చెప్పినట్టు వినకపోతే..నా ఇంట్లోంచి వెళ్లిపో’ అన్నాడు నాన్న. అమాయకత్వమో, మొండితనమో,  ఆత్మాభిమానమో తెలియదు. ఏం ఆలోచించకుండా ఇంట్లోంచి బయటకు వచ్చేశా. కానీ, నాలుగు జతలు బట్టలు, మూడొందల రూపాయలతో ఎక్కడికెళ్లాలో తెలియక మేముంటున్న  బిల్డింగ్ కిందే చాలాసేపు కూర్చున్నా. చీకటి పడటంతో పక్కనే ఉన్న  రైల్వే స్టేషన్​కి వెళ్లి పడుకున్నా. తెల్లారి సేల్స్​ గర్ల్​ కావాలన్న పోస్టర్​ కనిపించింది. కాంటాక్ట్​ అయితే ఇంటింటికి వెళ్లి కత్తులు, సాసర్లు అమ్మాలన్నారు. రోజుకి ఇరవై రూపాయలు ఇస్తామన్నారు.  ఒక పూటైనా కడుపు నిండుతుందని ఒప్పుకున్నా. హాస్టల్​లో ఉంటూ... సిటీ అంతా తిరుగుతూ వస్తువులు అమ్మా. అయితే చాలామంది ‘ఇంకేం పని దొరకలేదా నీకు!’ అంటూ తిట్టారు. ముఖం మీదే డోర్లు వేశారు.  
అయినా సరే అన్నింటినీ ఓర్చుకున్నా. ఆ తర్వాత చాలా ఉద్యోగాలు మారా. 2004లో పెండ్లి చేసుకుని ముంబై నుంచి బెంగళూరు షిఫ్ట్​ అయ్యా. అలా సాగిపోతున్న  లైఫ్​కి ఒక టర్నింగ్​ పాయింట్​ ఇచ్చారు నా​ ఫ్రెండ్స్. మోడలింగ్​పై నాకున్న ఇంట్రెస్ట్​ తెలుసుకుని ‘గ్లాడ్రాగ్స్​ మిసెస్​ ఇండియా–2008’ కాంటెస్ట్​కి వెళ్లమన్నారు. అదృష్టం కొద్దీ ఆ కాంటెస్ట్​లో టాప్​–10 వరకు వెళ్లా. దాంతో పెద్ద పెద్ద బ్రాండ్స్​ నుంచి మోడలింగ్​ ఆఫర్స్​ వచ్చాయి.  ఆ తర్వాత ఫాంటే కార్పొరేట్​ సొల్యూషన్స్​పేరుతో ఒక మోడలింగ్​ ఏజెన్సీ  స్టార్ట్​ చేశా. ఎయిర్​టెల్​, సోనీ లాంటి పెద్ద పెద్ద కంపెనీలకి పనిచేశా. అవన్నీ చూస్తున్నప్పుడే ఫ్యాషన్​ ఇండస్ట్రీలో జువెలరీకి ఉన్న ఇంపార్టెన్స్​ అర్థమైంది. అయితే అప్పటికే  ఇండియన్​ మార్కెట్​లో స్టైలిష్​  జువెలరీ కొరత ఉందని అర్థమైంది. ఈ విషయంపై మరింత రీసెర్చ్​ చేస్తే.. చాలామంది తాము కోరుకున్నట్టుగా జువెలరీ డిజైన్లు దొరకట్లేదని చెప్పారు. ఆ గ్యాప్​ని అవకాశంగా మార్చుకోవాలనుకున్నా. అందుబాటు ధరలో క్వాలిటీ జువెలరీ తీసుకురావాలనుకున్నా. అందుకోసం ఫాంటె సొల్యూషన్స్​ని క్లోజ్​ చేసి.. మూడు లక్షల పెట్టుబడితో 2014 లో రుబాన్స్​​​ మొదలుపెట్టా .

140  కోట్ల టర్నోవర్​ సాధించాలి

మొదట్లో ఇబ్బందులొచ్చాయి. చాలా పొరపాట్లు జరిగాయి. రోజుకో సవాలు ఎదురైంది. అన్నింటినీ దాటాం. ప్రస్తుతం బెంగళూరుతో పాటు హైదరాబాద్​, కొచ్చిలోనూ స్టోర్స్​ తెరిచా.  2017లో 3.34 కోట్ల రెవెన్యూ వచ్చింది. పోయిన ఏడాది 30 కోట్ల టర్నోవర్​ దాటాం.  2024కి 140 కోట్ల టర్నోవర్​ లక్ష్యంగా పనిచేస్తున్నాం. ప్రస్తుతం  రెండువేలకి పైగా డిజైన్లు ఉన్నాయి మా స్టోర్స్​లో. ప్రతి 15 రోజులకి ఒకసారి కొత్త కలెక్షన్​ తీసుకొస్తున్నాం. నా అచీవ్​మెంట్​కిగాను ‘బిజినెస్​ వరల్డ్స్​ మ్యాగజైన్​’ లోనూ చోటు దక్కింది. పెద్దగా చదువుకోలేదు. ఆర్థికంగానూ ఇబ్బందులున్నాయి. బిజినెస్​ ఎన్విరాన్​మెంట్​ తెలియదు. కానీ, రుబాన్స్​ని​ ఒక బ్రాండ్​గా తీర్చిదిద్దాలన్న గట్టి లక్ష్యం ఉంది. ఆ ప్రయత్నంలో చాలాసార్లు ఫెయిలయ్యా. కానీ, ప్రతిసారి రెట్టింపు ఉత్సాహంతో మళ్లీ లేచి పరిగెత్తా. ఎందుకంటే నాకు ప్లాన్​- బి లేదు. చిన్నప్పట్నించీ సక్సెస్​ ఒక్కటే నాకు సర్వైవల్​ మంత్రం. అందుకే చాలా కష్టపడ్డా.. నాలా బిజినెస్​ వైపు రావాలనుకుంటున్న వాళ్లకి ఒక్క విషయం చెప్తా.. బిజినెస్​లో సక్సెస్​ అవ్వాలంటే  డబ్బు కంటే టైంని ఎక్కువ ఇన్వెస్ట్​ చేయాలి. కస్టమర్స్​ ఏం కోరుకుంటున్నారో అర్థం చేసుకోవాలి. ఇప్పటికీ నా కంపెనీలో తయారయ్యే ప్రతి ప్రొడక్ట్​ని నేను ట్రై చేస్తా.  నచ్చకపోతే  మార్కెట్​లోకి తీసుకురాను.