టీచర్ రిక్రూట్​మెంట్ ​లేక ఓ నిరుద్యోగి గోస

టీచర్ రిక్రూట్​మెంట్ ​లేక ఓ నిరుద్యోగి గోస

కాగజ్ నగర్, వెలుగు: ఎంఏ బీఈడీ చదివి పశువుల కాపరిగా మారాడో నిరుద్యోగి. టీచర్ కావాలనే లక్ష్యంతో ఉన్నత చదువులు చదివినా.. రాష్ట్ర సర్కార్​ ఇప్పటి వరకు టీచర్ రిక్రూట్​మెంట్​చేపట్టకపోవడంతో బతుకుదెరువు కోసం కాపరి వృత్తిని ఎంచుకున్నాడు. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని చింతలమానెపల్లికి చెందిన 32 ఏండ్ల చెంద్రీ సాయినాథ్ ఎంఏ బీఎడ్ పూర్తిచేశాడు. గతంలో మూడేండ్లు డబ్బాగ్రామ ప్రభుత్వ పాఠశాలలో విద్యా వలంటీర్​గా పనిచేశాడు. 

ప్రభుత్వం గత విద్యా సంవత్సరానికి సంబంధించి 3 నెలల జీతం ఇవ్వకపోవడంతో పాటు స్కూల్​లో టీచర్లను సర్దుబాటు చేయడంతో సాయినాథ్​కు ఉన్న ఆధారమూ పోయింది. దీంతో కుటుంబ పోషణకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో పశువుల కాపరిగా మారాడు. ప్రస్తుతం గ్రామస్తులకు చెందిన పదిహేను పశువులను కాస్తున్నాడు. ఒక్కో పశువును కాసినందుకు నెలకు రూ.500 చొప్పున తీసుకుంటున్నాడు. భార్య, కొడుకు, తల్లిని పోషించడానికి పశువుల కాపరి పని చేయడం తప్పడం లేదని సాయినాథ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.