విశ్లేషణ: జీవో 317తో నిరుద్యోగులకు దెబ్బ

విశ్లేషణ: జీవో 317తో  నిరుద్యోగులకు దెబ్బ

కొత్త జిల్లాల ప్రకారం ఉద్యోగులు, టీచర్ల కేటాయింపునకు సంబంధించి రాష్ట్ర సర్కారు తీసుకొచ్చిన 317 జీవో ఎన్నో వివాదాలకు కారణమైంది. నిరుద్యోగుల బతుకుల్లోనూ ఈ జీవో నిప్పు రాజేస్తోంది. దీని కారణంగా మరో 25 ఏండ్ల వరకూ కొత్త ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు. సుమారు 45 వేల ఉద్యోగాలకు గండి పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే రాష్ట్రంలోని నిరుద్యోగుల జీవితాలు గందరగోళంగా మారతాయి. ఎన్నో కుటుంబాలు పస్తులుండాల్సి వస్తుంది. అధికారుల అనాలోచిత నిర్ణయాల వల్ల రానున్న రోజుల్లో నిరుద్యోగ యువత మరిన్ని ఇబ్బందులకు గురవుతుంది. వారంతా ఉద్యోగాలు రాక వీధుల పాలయ్యే పరిస్థితులు వస్తాయి.

టీఎస్పీఎస్సీలో రిజిస్టర్ చేసుకోని వారితో కలిపితే రాష్ట్రంలో 35 లక్షల మంది నిరుద్యోగులు ఉంటారని అంచనా. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటైన తర్వాత నియామకాలు చేపట్టకపోవడంతోనే నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోయింది. తాజాగా సర్కారు తీసుకొచ్చిన 317 జీవోతో ఇప్పటికే ఉద్యోగాలు లేక లబోదిబోమంటున్న నిరుద్యోగులకు కొత్త సమస్య ఎదురుకానుంది. ఈ జీవో కారణంగా వచ్చే పాతికేండ్ల వరకూ అసలు కొత్త ఉద్యోగాలే రాని పరిస్థితి ఉంటుందని అంటున్నాయి ఉపాధ్యాయ సంఘాలు. ఒకవైపు లోకల్‌‌ వారిని నాన్‌‌ లోకల్‌‌గా మార్చేసి, నాన్‌‌ లోకల్‌‌ వాళ్లంతా గద్ద తన్నుకుపోయిన కోడిపిల్లల మాదిరి ఉన్న ఉద్యోగాలన్నీ తన్నుకుపోయారు. ఈ జీవో కారణంగా రానున్న రోజుల్లో ఆయా జిల్లాల యువత నిరుద్యోగాన్ని ఎదుర్కోవలసి రావచ్చు.
 

స్థానికతకు తూట్లు పడినయ్
317 జీవోతో స్థానికతకు తూట్లు పడుతున్నాయి. దీని వల్ల 95 శాతం లోకల్, 5 శాతం నాన్ లోకల్ నిబంధన అమలు కావడం లేదు. సీనియార్టీ ప్రాతిపదికన జిల్లాలకు టీచర్ల కేటాయింపుల ప్రక్రియ పూర్తయింది. అయితే సీనియార్టీ ప్రకారం చూస్తే ఎక్కువ మంది సీనియర్లు అర్బన్ జిల్లాలకు, సిటీకి దగ్గర ఉండే ప్రాంతాలకు ఇప్పటికే ఆప్షన్లు ఇచ్చుకుని వెళ్లిపోయారు. సర్వీస్ తక్కువగా ఉన్న జూనియర్ టీచర్లు ములుగు, ఆసిఫాబాద్, భూపాలపల్లి, ఆదిలాబాద్ లాంటి రూరల్, గిరిజన ప్రాంత జిల్లాలకు కేటాయించబడ్డారు. దీంతో భవిష్యత్తులో అర్బన్ జిల్లాల్లో రిటైర్మెంట్లు తొందరగా అయ్యే వీలుంటే.. రూరల్ ప్రాంతాల్లో కేటాయించబడిన జూనియర్లతో రిటైర్మెంట్లు ఆలస్యంగా అయ్యే పరిస్థితి ఎదురవుతోంది. లోకల్ పోస్టుల్లో నాన్ లోకల్ వాళ్లు వచ్చి చేరడంతో భవిష్యత్తులో ఖాళీ పోస్టులు ఏర్పడక ఆయా జిల్లాల యువతకు ఉద్యోగ అవకాశాలు సన్నగిల్లుతాయి.
 

తెలంగాణ ఎందుకు సాధించుకున్నం
టీచర్ల కేటాయింపులో 2008, 2012లో డీఎస్సీకి ఎంపికైన వారు, 2017 టీఆర్టీ ద్వారా ఉద్యోగాలు పొందిన వారు జూనియర్లుగా ఉన్నారు. వీరితోపాటు మరికొంత మంది సొంత జిల్లాకు కాకుండా ఇతర జిల్లాలకు అలాట్​ అయ్యారు. ఇలా దాదాపు 22 వేల మంది బలవంతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చింది. ఇక లోకల్ పోస్టుల్లో నాన్ లోకల్ ఉద్యోగులు వచ్చి చేరడంతో 45 వేల ఉద్యోగాలను యువత కోల్పోయే ప్రమాదం ఉంది. వేరే జిల్లాలకు కేటాయిస్తుండటంతో జూనియర్లు సైతం తమ స్థానికతను కోల్పోతున్నారు. పుట్టి పెరిగిన జిల్లాలోనే స్థానికంగా ఇల్లు, పిల్లల చదువులకు ప్రణాళికలు రచించుకున్న జూనియర్ టీచర్లు వాటన్నిటినీ వదిలేసి వేరే జిల్లాలకు వెళ్లవలసి వస్తోంది. మరికొన్ని చోట్ల రిటైర్మెంట్​కు దగ్గరగా ఉన్న సీనియర్లు మాత్రం పట్టణాలను వదిలి గ్రామాలకు వెళ్తున్నారు. ఇందుకోసమేనా కొట్లాడి మరీ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నది.                                                  - రావుల రాజేశం,  ప్రధాన కార్యదర్శి,  తెలంగాణ సామాజిక రచయితల సంఘం