విశ్లేషణ: కోచ్ ఫ్యాక్టరీపై రాజకీయం

విశ్లేషణ: కోచ్ ఫ్యాక్టరీపై రాజకీయం

కాజీపేట రైల్వే జంక్షన్​కు దక్షిణ భారతం ముఖద్వారంగా పేరుంది. కాజీపేట రైల్వేస్టేషన్ అత్యంత పురాతనమైనది. నిజాం కాలంలోనే దీనిని ఏర్పాటు చేశారు. కాజీపేట, వరంగల్ రైల్వేస్టేషన్ల మీదుగా ఎక్స్​ప్రెస్, పాసింజర్, గూడ్స్ కలిపి 250కి పైగా రైళ్లు ప్రయాణిస్తాయి. వరంగల్ కు సమీపంలోనే అపారమైన బొగ్గు నిల్వలు కలిగిన భూపాలపల్లి, మణుగూరు, రామగుండం, కొత్తగూడెం వంటి ప్రాంతాలు ఉండడంతో కాజీపేట జంక్షన్​కు ఇతర జంక్షన్లతో పోలిస్తే ఎక్కువ ఆదాయం ఉంటుంది. ఈ జంక్షన్ కేంద్రంగా రైల్వే పరిశ్రమలను ఏర్పాటు చేయాలని, ఇక్కడి రైల్వే సౌకర్యాలను అభివృద్ధి పర్చాలని ఎన్నో దశాబ్దాల నుంచి డిమాండ్ ఉంది. కాజీపేట ప్రాధాన్యాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు రైల్వే పరిశ్రమల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నా.. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా స్థానిక ప్రజాప్రతినిధుల అలసత్వం కారణంగా వచ్చిన పరిశ్రమలు తరలిపోయి ఈ ప్రాంత వాసులకు అన్యాయం జరిగింది.
అఖిలపక్షం పేరుతో దొంగ డ్రామాలు
1982లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీని ప్రకటించింది. 1983లో కాజీపేట సమీపంలోని కడిపికొండ ప్రాంతంలో భూ సర్వే కూడా జరిగింది. కానీ, పంజాబ్ లో పెరుగుతున్న తీవ్రవాదాన్ని, అక్కడి నిరుద్యోగ సమస్యను, రాజకీయ అస్థిరతను బూచిగా చూపి దానిని పంజాబ్​కు తరలించారు. దీనిపై ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు అప్పుడు గొంతు విప్పలేదు. పైగా మాజీ ప్రధాని పీవీ నరసింహారావును బీజేపీ అభ్యర్థి చందుపట్ల జాంగారెడ్డి హనుమకొండలో ఓడించడంతో వరంగల్ పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం మరింత నిరాసక్తత చూపింది. కాజీపేట కేంద్రంగా కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని ఎన్నో ఏండ్ల నుంచి ఉన్న డిమాండ్ ను పట్టించుకోని యూపీఏ ప్రభుత్వం 2007లో మరో కోచ్ ఫ్యాక్టరీని సోనియాగాంధీ ప్రాతినిధ్యం వహించే రాయిబరేలీకి ప్రకటించింది. యూపీఏ 2 హయాంలో మమతాబెనర్జీ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు 2010-–11 బడ్జెట్ లో కాజీపేటకు వ్యాగన్ ఫ్యాక్టరీని ప్రకటించి రూ.15 కోట్లను కేటాయించారు. కానీ, వ్యాగన్ ఫ్యాక్టరీకి కావాల్సిన భూమిని సేకరించడంలో రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ప్రజాప్రతినిధులు విఫలమయ్యారు. న్యాయపరంగా  చిక్కులు లేని భూమిని సేకరించలేని నిస్సహాయ స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్న కారణంగా వ్యాగన్ ఫ్యాక్టరీ కాస్తా కర్నాటకకు తరలిపోయింది. ఇది కాంగ్రెస్, అప్పుడు కేంద్రంలో భాగస్వామిగా ఉన్న టీఆర్ఎస్ చేతగాని తనం వల్ల కలిగిన నష్టమే ఇది. కానీ ఇప్పుడు అఖిలపక్షం అంటూ కాజీపేట కోచ్​ ఫ్యాక్టరీ పేరు మీద కాంగ్రెస్, టీఆర్ఎస్ దొంగ డ్రామాలు ఆడుతున్నాయి.
రాజకీయ అస్త్రంగా మార్చుకునే ప్రయత్నాలు
2019 లోక్​సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ 4 ఎంపీ స్థానాలు గెలవడంతో రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు మొదలయ్యాయి. బీజేపీని నిలువరించేందుకు టీఆరెఎస్ నేతలు కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని రాజకీయ అస్త్రంగా మార్చే ప్రయత్నం చేస్తూ వచ్చారు. కాజీపేట రైల్వే ఓవర్ ​హాలింగ్ ఫ్యాక్టరీకి కేంద్రం కట్టుబడి ఉందని, త్వరితగతిన భూసేకరణ చేసి అందించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తూ వచ్చారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ నిర్లక్ష్యంపై బీజేపీ ఎదురుదాడికి దిగడంతో రాజకీయంగా నష్టపోతామని భావించి ఆగమేఘాల మీద మెట్టుగుట్ట రామలింగేశ్వరస్వామి దేవాలయం భూములను మార్పిడి చేసి రైల్వే అధికారులకు ఇచ్చారు. అయితే కేంద్రం 160 ఎకరాలు అడిగితే 150 ఎకరాలే సేకరించి ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం కారణంగా ఓవర్​హాలింగ్ యూనిట్ మంజూరై 5 ఏండ్లు గడిచినా ఎటువంటి పురోగతి లేకుండాపోయింది. దేవాలయ భూముల్లో ప్రాజెక్టులకు కేంద్రం నిబంధనలు అంగీకరించవు. అలాంటి భూములను సగం ఇచ్చి కేంద్రం పనులను ప్రారంభించడం లేదని నిందలు వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తోంది.
స్థానిక ప్రజాప్రతినిధుల అసమర్థత
2009 నుంచి హనుమకొండ ఎమ్మెల్యేగా వినయ్ భాస్కర్ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే భూమి అడిగితేనే చొరవ తీసుకుని చూపించడంలో ఆయన విఫలమయ్యారు. 2014లో తెలంగాణ వచ్చాక టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా వినయ్ భాస్కర్ గెలిచారు. 2016లో కాజీపేటకు ఓవర్​హాలింగ్ ఫ్యాక్టరీని ప్రకటించినా, అప్పుడైనా భూసేకరణ దిశగా వినయ్ భాస్కర్ ఆలోచన చేయలేదు. వరంగల్​ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా రైల్వే సమస్యలను పట్టించుకున్న దాఖలాలు లేవు. దీంతో ఓరుగల్లు ప్రజల చిరకాల కోరిక నెరవేరడం లేదు.
వరంగల్ పై కేసీఆర్ కుటుంబం కుట్రలు
వరంగల్​ను రాజకీయంగా అణగదొక్కాలని, అభివృద్ధి పరంగా వెనక్కి నెట్టాలని మొదటి నుంచీ కేసీఆర్ కుటుంబం అనేక కుట్రలు చేస్తూ వచ్చింది. ఎంతో చారిత్రక నేపథ్యం, రాజకీయ ప్రాధాన్యం ఉన్న ఓరుగల్లు జిల్లాను ఆరు ముక్కలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ చేపట్టినా.. నీటి విషయంలో వరంగల్ కు అన్యాయం చేశారు. ఏడాదికి రూ.300 కోట్లు ఇస్తామని చెప్పి చిల్లి గవ్వ ఇవ్వకుండా ప్రజల నోట్లో మట్టికొట్టారు. 2010–-11లో యూపీఏ ప్రభుత్వం కాజీపేటకు వ్యాగన్ ఫాక్టరీని ఇవ్వాలని ఆలోచించినప్పుడు కూడా దానిని మనోహరాబాద్ కు తరలించాలని కేంద్ర మంత్రిగా కేసీఆర్ ప్రయత్నాలు చేశారు. చివరకు కాజీపేట వ్యాగన్ ఫ్యాక్టరీ కర్నాటకకు తరలిపోతున్నా యూపీఏలో కేంద్ర మంత్రిగా ఉన్నా కూడా కేసీఆర్ నోరు మెదపలేదు. చిత్తశుద్ధి ఉంటే 160 ఎకరాల భూమిని సేకరించడం రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లెక్కనా? 100 ఎకరాల్లో రూ.800 కోట్లతో మేధా కంపెనీతో ప్రైవేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీని రంగారెడ్డి జిల్లా శంకరపల్లిలో పెట్టించి దానికి కేటీఆర్ 2020లో శంకుస్థాపన చేశారు. వరంగల్ అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉంటే, వరంగల్ ప్రజలపై ప్రేమ ఉంటే మేధా కోచ్ ఫ్యాక్టరీని వరంగల్​లో ఎందుకు పెట్టించలేదు? ఇకనైనా టీఆర్ఎస్ నాయకులు అభివృద్ధి అంశాలను రాజకీయాలతో ముడిపెట్టకుండా, చిత్తశుద్ధితో వ్యవహరిస్తే ప్రజల మనసులను గెలుచుకుంటారు. లేదంటే కాజీపేట విషయంలో దశాబ్దాలుగా అన్యాయం చేసిన కాంగ్రెస్ సరసన చేరాల్సి వస్తుంది.
ఎన్ని లెటర్లు రాసినా పట్టించుకోలే
2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే వరంగల్ ప్రాంతం నుంచి ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ గెలవకపోయినా, ఇక్కడి ప్రజల మనోభావాలను గౌరవించి 2015లో రూ.383 కోట్లతో కాజీపేటకు రైల్వే పిరియాడిక్ ఓవర్ హాలింగ్ యూనిట్ ను ప్రకటించింది. 2016-17లో రూ.198 కోట్లను బడ్జెట్​లో కేటాయించింది. కానీ, ఏండ్లు గడిచినా, రైల్వే అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని లెటర్లు రాసినా పట్టించుకున్నది లేదు. రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే భూసేకరణ చేయడంలో విఫలమయ్యారు. కేంద్రానికి స్థలం అందించలేదు. 2018-19లో మళ్లీ కాజీపేటకు కేంద్రం రూ.10 కోట్ల అదనపు బడ్జెట్ ను కేటాయించింది. అయినా భూసేకరణ చేయలేదు. నెలకు 200 వ్యాగన్లకు మరమత్తులు చేసే సామర్థ్యం కలిగిన ఈ ఓవర్​ హాలింగ్ యూనిట్​వేలాది మంది స్థానిక యువతకు ఉపాధి కల్పించగలిగేది. కానీ, రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా స్థానిక యువతకు అన్యాయం జరిగింది. 
అప్పుడెందుకు మాట్లాడలేదు
కాజీపేటకు ఓవర్​ హాలింగ్ యూనిట్ వద్దు.. కోచ్ ఫ్యాక్టరీ కావాలని టీఆర్ఎస్ నేతలు రచ్చ చేస్తున్నారు. ఓవర్​హాలింగ్ కోసం భూమి ఇచ్చి.. ఇప్పుడు మళ్లీ కోచ్ ఫ్యాక్టరీ కావాలంటే ఎలా? అసలు వీళ్ల వాదనలో పస ఉందా? ఓవర్​ హాలింగ్ యూనిట్​కు భూమి ఇచ్చారంటేనే దానికి ఒప్పుకున్నట్లు కదా? లేదంటే ఆనాడే మేం ఓవర్ ​హాలింగ్​ యూనిట్​కు భూమి ఇవ్వం, కోచ్ ఫ్యాక్టరీ అయితేనే ఇస్తామని తెగేసి చెప్పాల్సింది. ఓవర్ హాలింగ్ యూనిట్​కు ఒప్పుకోకపోతే దానికి రాబోయే బడ్జెట్ లో నిధులు కేటాయించాలని టీఆర్ఎస్ ఎందుకు డిమాండ్ చేస్తున్నట్లు? కాంగ్రెస్ తప్పిదాల వలన రైల్వే వ్యవస్థలో తీవ్ర నష్టాలు వాటిల్లాయి. ఫలితంగా, ప్రైవేట్ రంగంలో కోచ్ ఫ్యాక్టరీలు పెరిగాయి. దీంతో మోడీ ప్రభుత్వం కోచ్ ఫ్యాక్టరీలవైపు కాకుండా ఓవర్​ హాలింగ్ యూనిట్లు, వ్యాగన్ ఫ్యాక్టరీలవైపు ఆలోచించి, వాటి నిర్మాణాల ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించి రైల్వే అభివృద్ధికి తోడ్పడుతోంది. దానికి అనుగుణంగానే కాజీపేటకు ఓవర్​హాలింగ్ యూనిట్​ను ప్రకటించింది. కానీ, టీఆర్ఎస్ పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికి కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కావాలంటూ అఖిలపక్షం పేరుతో రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. అంతే తప్ప వరంగల్ ప్రజల చిరకాల కోరిక తీర్చి.. స్థానిక యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని మాత్రం టీఆర్ఎస్ నేతలు ఆలోచించడం లేదు.- ఏనుగుల రాకేష్​ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి, బీజేపీ