ప్రజలు కోరుకున్న తెలంగాణ ఇది కాదు

ప్రజలు కోరుకున్న తెలంగాణ ఇది కాదు
  • ఆత్మగౌరవం మీదనే దెబ్బ పడ్డది: ప్రొఫెసర్ కోదండరాం
  • ముఖ్యమంత్రే రాష్ట్రానికి అన్యాయం చేస్తుండు: వివేక్ వెంకటస్వామి
  • ఉమ్మడి రాష్ట్రం కన్నా దారుణంగా అణచివేసే పరిస్థితులు: పొన్నం ప్రభాకర్
  •  ప్రజాస్వామ్య విలువల్లేవు: ప్రొఫెసర్ హరగోపాల్
  •  హక్కులను హరించే ప్రయత్నం: ఈటల రాజేందర్
  •  మనవాళ్లే మనల్ని నిర్బంధిస్తున్నారు: కపిలవాయి దిలీప్ కుమార్
  • పెత్తందార్లకు, ఆధిపత్య వర్గాలకు పెట్టని కోట: దాసోజు శ్రవణ్
  •  ఎనిమిదేండ్లలో తెలంగాణ 80 ఏండ్లు వెనక్కి: తీన్మార్ మల్లన్న


తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ‘8 ఏండ్ల తెలంగాణ ఏమిచ్చింది?’ అనే అంశంపై ‘వీ6’ చర్చ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ నేతలు, మేధావులు పాల్గొన్నారు. కొట్లాడి సాధించుకున్న రాష్ట్రంలో అమరులు, ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరాయా? ‘నీళ్లు, నిధులు, నియామకాలు’ నినాదానికి న్యాయం జరిగిందా? ప్రజలు కోరుకున్న తెలంగాణ ఆవిష్కృతమైందా? వంటి విషయాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. 

సొంత రాష్ట్రంలోనూ నిర్బంధకాండ

తెలంగాణ ఏర్పడ్డ తర్వాత రిలీఫ్ వచ్చిందనుకున్నా. కానీ చివరికి ప్రజాస్వామ్య విలువలు లేకుండా పోయాయి. సభలు.. సమావేశాలు పెట్టుకోలేం.. ఉమ్మడి రాష్ట్రంలోని నిర్బంధకాండ తెలంగాణలోనూ కొనసాగుతోంది. ఆత్మగౌరవం గురించి మాట్లాడేటట్లు లేదు. ‘రాజకీయంగా, ఆర్థికంగా నష్టపోతే భరించొచ్చు.. కానీ అస్థిత్వం, ఆత్మగౌరవం కోల్పోతే ప్రమాదం’ అని ప్రొఫెసర్ జయశంకర్ అనే వారు. ఆయన చెప్పినట్లుగా రాష్ట్రంలో అసలు అస్థిత్వాన్నే మరచిపోయారు. అందెశ్రీ రాసిన పాటను విస్మరించారు. దాన్ని ప్రార్థనా గీతంగా ఉంచాలి. రైతులకు వ్యతిరేకంగా చట్టాలు చేస్తే ముందు మాట్లాడింది లేదు.. మద్దతు కూడా ఇచ్చారు. తర్వాత వ్యతిరేకంగా మాట్లాడారు. ‘కేంద్రాన్ని ఎదుర్కొంటాం.. జాతీయ స్థాయిలో ఎదుర్కొంటాం’ అంటున్న సీఎం.. తెలంగాణ ఆత్మగౌరవం గురించి ఎప్పుడైనా మాట్లాడారా? కేంద్ర ప్రభుత్వాన్నే తమిళనాడు ఢీకొడుతోంది. నాడు మహబూబాబాద్ జిల్లాకు జగన్ వస్తే తీవ్రంగా వ్యతిరేకించారు.. కానీ ఇప్పుడు రాజశేఖర రెడ్డి కూతురు రాష్ట్రమంతా తిరుగుతున్నా, తీవ్రంగా విమర్శించినా తెలంగాణ ప్రజలు ప్రతిఘటించలేదు.. అందెశ్రీ చెప్పినట్లు తెలంగాణ అస్థిత్వం ప్రజల చేతుల్లో ఉంటే ఇలా జరిగేదా. గతంలో టీఆర్ఎస్ ఉత్సవాల్లో తెలంగాణ తల్లి విగ్రహం కాకుండా తెలుగు తల్లి విగ్రహం పెట్టుకున్నారు. ఉమ్మడి రాష్ట్రం కన్నా ఎక్కువగా నిర్బంధం కొనసాగుతోంది. మంత్రులు స్వతంత్రంగా పనిచేసే పరిస్థితి లేదు. తెలంగాణ ఉద్యమంలో జరిగిన చర్చ కృష్ణానదిపైన. జూరాల నుంచి నీళ్లు కిందికి పోయాక మళ్లీ పైకి తీసుకురావడం ఏంటో? పాలమూరు– రంగారెడ్డి వదిలి కాళేశ్వరానికి ఎందుకు పోయారు. లక్ష ఉద్యోగాలు అన్నరు.. తర్వాత విస్మరించడంతో పిల్లలు ప్రాణాలు తీసుకున్నరు. విద్య విషయంలో జరిగిన విధ్వంసం గతంలో ఎప్పుడూ జరగలే.
- ప్రొఫెసర్ హరగోపాల్

ఆత్మగౌరవం కోసం మళ్లీ కొట్లాడాలె

ఈ ఎనిమిదేండ్లళ్ల ఏం జరిగిదంటే.. ఆత్మగౌరవం మీదనే దెబ్బ పడ్డది. ‘తెలంగాణ సమాజంలో ఇన్ని పైసలు ఇచ్చినం. ఇంత అభివృద్ధి జరిగింది’ అని వ్యాసాలు రాశారు. ఇదంతా కాదు. తెలంగాణ ఆత్మగౌరవం ఇనుమడింప చేయడానికి నువ్వు ఏం చేసినవు. ప్రజల భాగస్వామ్యం ఎంత పెంచినావు. వారి అభిప్రాయ వ్యక్తీకరణకు ఇచ్చిన అవకాశం ఎంత? ఉద్యమకారులకు ఇచ్చిన గౌరవం ఏంది ? తెలంగాణ అభివృద్ధితో ఎంతమందికి బతుకుదెరువు చూపించినవు? ఏ గణాంకాలు తీసుకొచ్చినా.. అవన్నీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోయేటివే. ఆత్మగౌరవం కోసమే మళ్లీ కొట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. జయశంకర్ సార్ పదే పదే చెప్పినట్లు.. 
‘తెలంగాణ వచ్చే దాకా రాష్ట్ర సాధన కోసం.. తెలంగాణ ఏర్పడిన తరువాత అభివృద్ధి కోసం ఉద్యమం జరగాలె’. అభివృద్ధి అంటే ఫలితాలు అందరికీ దక్కాలి. కానీ ఏం జరుగుతోంది. అధికారాన్ని విచ్చలవిడిగా వాడుకుంటున్నారు. నాయకులు ఆస్తులు పెంచుకుంటున్నారు తప్ప ప్రజల సంక్షేమం గురించి పట్టించుకోవడం లేదు. ప్రగతి భవన్ డోర్లు ఆంధ్రా కార్పొరేట్ శక్తుల కోసం తెరుచుకుంటున్నాయి. కానీ తెలంగాణ ప్రజలకు అక్కడ ప్రవేశానికి అవకాశం లేదు. తెలంగాణ ద్రోహులకు ఎర్ర తివాచీ పరుస్తారు. ప్రజలు కష్టం చెప్పుకుందామంటే గేట్ దాకా కూడా రానివ్వరు. పొరపాటున ఎవరైనా గేట్ ముట్టుకుంటే కేసు అయితది. ప్రగతి భవన్ దగ్గరకు వెళ్లినందుకు నామీదకు రెండు కేసులు పెట్టినారు. కష్టం చెప్పేందుకు లేదు.. నిరసన తెలిపేందుకు వేదికలు లేవు. మనం మాట్లాడానికి అవకాశం లేదు. తెలంగాణ కోరుకున్నది ఈ నిరంకుశ పాలన కాదు. తెలంగాణ ఉద్యమానికి దిక్సూచిగా నిలిచిన ఓయూకు కొన్నిరోజులు వీసీ లేడు. సగం పోస్టులు ఖాళీ. పిల్లలకు చదువు చెప్పే టీచర్లు లేరు. అన్ని యూనివర్సిటీల్లో అదే పరిస్థితి. ఉద్యోగం రాలేదని గతేడాది 18 మంది పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. ఇంతకంటే దుస్థితి ఏముంటది. ఇది 8 ఏండ్ల తెలంగాణలో ఏం జరిగిందనడానికి చెప్పడానికి ఉదాహరణ. రూ.1,000 కోట్లు ఇస్తే ప్రాజెక్ట్ అయిపోతది.. కానీ ఇవ్వరు. ఎక్కడ కమీషన్లు వస్తాయో అక్కడ ఇస్తున్నరు. 
- ప్రొఫెసర్ కోదండరాం

అన్ని రకాలుగా మోసం

ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఉమ్మడి రాష్ట్రంలో కాకా వెంకటస్వామి ఎన్నో ఇబ్బందులు పడ్డారు. వాటిని చూసే ఎంపీలందరం కలిసి ఒత్తిడి తీసుకువస్తే ఫలితం ఉంటుందని నిర్ణయించాం. కానీ ‘ఇచ్చిన మాటను కేసీఆర్ నిలుపుకోడు. మీరు ఉద్యమంలో పాల్గొనకుంటేనే మంచిది’ అని చాలా మంది సూచించారు. అయినప్పటికీ పోరాటం చేశాం.. రాష్ట్రం వస్తే తెలంగాణకే అన్యాయం జరుగుతుందన్న అపోహలపై కాంగ్రెస్ లీడర్లకు నేను ప్రజెంటేషన్ ఇస్తే గులాం నబీ ఆజాద్ ప్రశంసించారు. మేం తెలంగాణ కోసం నినాదాలు చేశాం.. నిరాహారదీక్షలు చేశాం. దీనిపై చాలా మంది ఎంపీలు మమ్మల్ని ప్రశంసిస్తూనే పెద్దలను ఒప్పించాలన్న సూచన చేశారు. జగన్నాథం, కేశవరావు, నేను కాంగ్రెస్ పార్టీని ఒప్పించడం, సోనియాగాంధీకి వివరించడం వంటివి చేశాం. అప్పట్నుంచి తెలంగాణ ఎట్ల ఇవ్వాలని ఆమె ఆలోచన చేశారు. ఆ సమయంలో సుష్మాస్వరాజ్ చాలా సాయం చేశారు. ఇంటింటికో ఉద్యోగం, డబుల్ బెడ్రూం వంటి హామీలపై ప్రజలకు అట్రాక్షన్ ఉండేది. కానీ అంతకుముందు ఉన్నోళ్లకే కాంట్రాక్టులు ఇవ్వడం, 60 వేల కోట్ల అప్పును 6 లక్షల కోట్ల అప్పులుగా మార్చడం, ప్రాణహిత పేరుతో 36 వేల కోట్లు అంటూ మభ్యపెట్టడం, పాత ప్రాజెక్టు నీళ్లు తీసుకుని కాళేశ్వరం నిర్మించామంటూ బీరాలు పలకడం చేస్తున్నారు. ప్రపంచంలో అత్యంత అవినీతితో, రాంగ్ డిజైనింగ్‌‌‌‌తో నిర్మించడంలో కాళేశ్వరం నంబర్ వన్. మేఘా కృష్ణారెడ్డిని మాత్రమే నంబర్ వన్ చేశారు. తెలంగాణ ఉద్యమం ఎప్పుడూ గోదావరిపై లేకుండె. 3 వేల టీఎంసీలతో సర్ ప్లస్ ఉండె. పోరాటం చేసింది కృష్ణా నీళ్లపైనే. కానీ పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుపై ఇప్పటిదాకా ఎలాంటి నిర్ణయం రాలె. తెలంగాణ సీఎంగా ఉండి తెలంగాణకు అన్యాయం చేసేలా సంగమేశ్వర ప్రాజెక్టును తెరపైకి తెచ్చారు. తెలంగాణ వచ్చాక ఉద్యమకారులను పక్కనపెట్టి  కుటుంబంపై కేసీఆర్ దృష్టిపెట్టారు. కొడుకు, బిడ్డ, అల్లుడు అందరూ ప్రభుత్వంలో భాగమయ్యారు. మన రాష్ట్రంలో మన ప్రభుత్వం ఉంటుందని ప్రజలు అనుకున్నరు. కానీ కేసీఆర్ కల్వకుంట్ల రాష్ట్రంగా మార్చారు. అన్ని రకాలుగా మోసం చేశారు.

- వివేక్ వెంకటస్వామి

తెలంగాణ సాధించుకున్నది ఎందుకు

శవాల మీద పేలాలు ఏరుకుంటున్నరు. ఉద్యమంలో ఎవరైనా, ఎక్కడైనా చనిపోతే అక్కడ టీఆర్ఎస్ జెండాలు కప్పి మాపై ఒత్తిడి తెచ్చారు. ప్రాణ త్యాగాలు చేసిన వారి వివరాలను తెలంగాణ వచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్‌‌‌‌‌‌‌‌లో మార్చారు. ఇప్పటికైనా అమరవీరులను గుర్తించాలి. అమరుల కుటుంబాలను ఆదుకోవాలి. వారికి ప్రభుత్వం ఇయ్యాల్సిన సాయం.. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం నాడు ఇచ్చిన వెండి ప్లేట్ల ఖర్చంత కూడా కాదు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని సంతోషంగా జరుపుకోలేకపోతున్నారు. ఉమ్మడి రాష్ట్రం కన్నా దారుణంగా మమ్మల్ని అణచివేసే పరిస్థితులున్నాయి. తెలంగాణ సాధించుకున్నది ఎందుకు? నాడు మేం చేసిన ఉద్యమంపై ప్రశ్నించిన సహచరులే ‘ఇప్పుడు ఏం జరిగిందో చూశావా?’ అంటూ అని అంటున్నారు. మాట్లాడితే మీడియా వారినీ టార్గెట్ చేస్తున్నరు. కరీంనగర్ నుంచి జగిత్యాలకు పోవాలంటే మంత్రులు హెలికాప్టర్‌‌‌‌‌‌‌‌లో పోతున్నరు. టీఆర్ఎస్ పార్టీలో చీము నెత్తురున్నోడు వీటన్నింటినీ ప్రశ్నించాలె. మా పార్టీలోనే మేం కొట్లాడి సస్పెండ్ అయినం.. కానీ టీఆర్ఎసోళ్లకు సోయి కూడా లేదు. ఆనాడు పార్టీ మాకు స్వేచ్ఛనిచ్చింది. కానీ ఇయ్యాల మమ్మల్ని నిర్బంధిస్తున్నరు. బంగారు తెలంగాణ పోయి.. ఉద్యమ తెలంగాణ పోయి.. ఇక ఏం తెలంగాణ వస్తదో చూడాలి.
- పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ

జయశంకర్ సార్ చెప్పిన ‘నాలుగో దశ’లో ఉన్నం
ఆనాడు ఏపీ ఎన్జీఓ మీటింగ్‌‌‌‌లో గజల్ శ్రీనివాస్ తెలంగాణ ఆస్థిత్వాన్ని కించపరిచి మాట్లాడారు. అది తట్టుకోలేకనే జై తెలంగాణ నినాదాలు చేశాను. రాష్ట్రం వచ్చాక కేసీఆర్ నన్ను పిలిపించుకున్నరు. ప్రమోషన్ ఇస్తనన్నరు. కానీ తర్వాత పెద్దాఫీసర్లు అకారణంగా నన్ను సస్పెండ్ చేశారు. ఇప్పుడు ఉద్యోగంలో చేరిన.. నా సస్పెన్షన్ పీరియడ్‌‌‌‌పై ఫైట్ చేస్తున్న. ‘అవ్వాల్సిన చోట ఘనం కావాలి. ఇంకాల్సిన చోట ద్రవం కావాలి. పీల్చాల్సిన చోట వాయువు అవ్వాలి. రగలాల్సిన చోట నిప్పు కావాలి’ అని జయశంకర్ సార్ చెప్పారు. ఇప్పుడు అందరం నాలుగో దశలో ఉన్నం. 
- శ్రీనివాస్ గౌడ్, కానిస్టేబుల్

రాష్ట్రంలో పుట్టే బిడ్డపై రూ.1.25 లక్షల అప్పు

తెలంగాణ రాష్ట్రం.. నిధులు, ఉద్యోగాలు, నీళ్లకోసమే అయినా ఆత్మగౌరవం ప్రధానమైంది. ఆంధ్రా పాలకుల హయంలో కొంచెం స్వేచ్ఛగా మాట్లాడుకునేది ఉండేది. కానీ కేసీఆర్ వచ్చాక ఆత్మగౌరవాన్ని కించపరుస్తున్నరు. హక్కులను హరించే ప్రయత్నం చేస్తున్నరు. తెలంగాణ ప్రజలు ఆకలినైనా భరిస్తారు కానీ.. ఆత్మగౌరవాన్ని కోల్పోరు. రాష్ట్రంలో రాచరిక పద్ధతి.. నిజాం సర్కార్‌‌‌‌‌‌‌‌ను తలపించే పద్ధతి ఉంది. కొండగట్టులో 67 మంది పేద ప్రజలు ఆర్టీసీ బస్సు ప్రమాదంలో చనిపోతే రూ.5 లక్షల ఇచ్చేందుకు చేతులు రాలేదు. కానీ రాజకీయాలు, పేరు ప్రతిష్టల కోసం వేరే రాష్ట్రాల్లో ఇస్తున్నారు. పదుల కోట్ల రూపాయలు పెట్టి.. దేశం మొత్తం యాడ్స్ ఇచ్చిన్రు. ఇంట్లో ఈగల మోత.. బయట పల్లకీ మోతలాగా సర్కారు తీరును ప్రజలు అసహ్యించుకుంటున్నరు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా అని ఎదరుచూస్తున్నారు. సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ను ఓడగొట్టడమే జనం ఎజెండా. రాష్ట్రంలో రూ.4.50 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసిన్రు. పుట్టే బిడ్డ కూడా రాష్ట్రంలో రూ1.25 లక్షల అప్పుతో పుడుతున్నారంటే.. పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాలి. తనకున్న మమకారం, ఆలోచన, భావన తెలంగాణ పట్ల ఇంకెవరికైనా ఉంటదా అని సీఎం మాట్లాడుతారు. కానీ రాష్ట్రంలో లిక్కర్ అమ్మకాలతోనే రూ.45 వేల కోట్ల ఆదాయం వస్తున్నది. ఎంతమంది ఆడబిడ్డల పసుపు తాళ్లు తాగుడు వల్ల తెగిపోతున్నాయి.
- ఈటల రాజేందర్​

హామీలేమైనయ్
నిరుద్యోగులకు లక్ష ఉద్యోగాలు ఇస్తామన్నారు. తెలంగాణ సర్‌‌‌‌‌‌‌‌ప్లస్ స్టేట్ అయితందన్నారు. కార్పొరేట్ విద్యా వ్యవస్థను రద్దు చేస్తామన్నరు. ఉచిత విద్య, వైద్యం అందిస్తామన్నరు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తమన్నరు. పేదలకు భూములు పంచుతామన్నరు. ఎన్నో హామీలు. ఒక్కటీ నేరవేరలేదు. కార్పొరేట్ విద్యా వ్యవస్థను రద్దు చేస్తామన్నరు. కానీ ఇయ్యాల ఎల్‌‌‌‌కేజీకి పిలగాడికి రూ.లక్ష ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. ఏ వ్యవస్థను అయితే వ్యతిరికేంచినామో.. ఆ వ్యవస్థలో ఇప్పుడు పాలకులు షేర్ హోల్డర్స్ అయ్యారు. ఇప్పటికీ సర్కారు దవాఖాన్లలో డాక్టర్లు ఉండరు. మందులు ఉండవు. భూమి అయినా అమ్ముకోవాలి. ఇళ్లు అయినా అమ్మాలి. లేదా పుస్తెలు తాకట్టు పెట్టాలి. సీఎం కేసీఆర్ పంటి ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌కు ఢిల్లీకి పోతున్నరు. రాష్ట్రంలో రోజుకో జిల్లాకు జీతాలు ఇస్తున్నారు.. ఇక 2 లక్షల ఖాళీలు నింపడానికి ఆస్కారం ఉందా? హోం మినిస్టర్‌‌‌‌‌‌‌‌ ప్రగతి భవన్ దగ్గరకు పోతే.. కానిస్టేబుల్ లోపలకు పోనీయడు. అంత గొప్ప ఆత్మగౌరవం ఉంది మన దగ్గర.
- విఠల్, బీజేపీ నేత

కేసీఆర్ జైల్లనే ఉన్నడు

తెలంగాణ మోడల్ అంటే ఏంది? కాంట్రాక్టులు, కమీషన్లు, దోపిడీ, అణచివేతలు, కుట్రలు, కుతంత్రాలు.. ఇవా? ఇవన్నీ దేశమంతా అప్లై చేయాలని అంటే.. అది దేశం కర్మ. జీతాలు ఇవ్వడం లక్కీ డ్రా లాగా మారింది. సీఎం, ఆయన కొడుకు ఏ జిల్లా పర్యటనకు పోతుంటే.. ఆ జిల్లాకు ముందు రోజు జీతాలు వేస్తున్నారు. రాష్ట్ర సాధనలో సోనియా గాంధీ, సుష్మాస్వరాజ్, కోదండరాం పాత్ర లేదా? మంత్రులు ఉద్యమంలో నుంచి వచ్చిన వాళ్లేనా? ఉద్యమ ఆకాంక్షలు నేరవేర్చే వాళ్లేనా? ద్రోహులను దగ్గర తీసుకుని సంపద అంతా దోచుకుంటూపోతున్నారు. ఆంధ్రా పాలన కంటే.. ఇప్పుడే ఎక్కువ అణచివేత ఉంది. కేసీఆర్ నిజంగా ప్రజల మనిషైతే ప్రగతి భవన్‌కు 15 ఫీట్ల కంచెలు ఎందుకు? కేసీఆర్ జైల్లనే ఉన్నడు మరి. ప్రగతి భవన్ అంటే అంతర్జాతీయ స్థాయి జైలు. ప్రగతి భవన్‌‌‌‌కు ఫాంహౌస్‌‌‌‌కు తిరిగిన ఖర్చులు రూ.79.40 కోట్లు అయినయి. వీటితో 26,400 స్కూళ్లలో లెట్రిన్లు, టాయ్​లెట్స్ కట్టించొచ్చు. ఈ ఎనిమిదేండ్లలో తెలంగాణ 80 ఏండ్లు వెనక్కి పోయింది
- తీన్మార్ మల్లన్న

డబ్బున్నోడు రూ.25 కోట్లతో విల్లా కొంటే అభివృద్ధి చెందినట్లా?

2014లో ప్రజల్లోకి బలంగా వెళ్లడంతోనే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. కానీ అన్ని రంగాల్లో పూర్తిస్థాయిలో ఫెయిల్ అయింది. ఆనాడు జై తెలంగాణ నినాదం ఒక గర్వం. కానీ ఇవాళ పొద్దున నుంచి ఒక నిర్వేదం. మనం తెలంగాణ సాధన కోసం కొట్లాడి ఏమైనా తప్పు చేసినామా అన్న భావన ఉండింది. కేసీఆర్‌‌‌‌‌‌‌‌ది రియల్ ఎస్టేట్ మైండ్‌‌‌‌సెట్. బాగా డబ్బున్నోడు రూ.25 కోట్లు పెట్టి విల్లా కొంటే బాగా అభివృద్ధి చెందినట్లు. పేద, మధ్య తరగతి వాడు ఆగమైనా ఫర్వాలేదు. డబ్బున్నోడు కొనుక్కుంటే అభివృద్ధి అయినట్లే. రాష్ట్రంలో లిటరసీ కూడా పెంచలేకపోయారు. ప్రభుత్వ స్కూళ్లు బంద్ చేశారు. 8 ఏండ్ల తర్వాత కుంభకర్ణుడి మాదిరి ఇప్పుడు నిద్ర లేచి మన ఊరు మన బడి అంటారా? ధనిక రాష్ట్రం అని చెప్పి.. ప్రజలకు విద్య, వైద్యం అందించడం లేదు. ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వరు. ప్రైవేట్ ఉద్యోగాలు కల్పించరు. సెల్ఫ్​ ఎంప్లాయిమెంట్‌‌‌‌కు సాయం చేయరు. తెలంగాణ కోసం చనిపోయిన 1,500 మంది అమరులు పేదింటి బిడ్డలు. అలాంటి వాళ్లను ప్రభుత్వం గుర్తించలేదు. కేవలం 500– 600 మందిని గుర్తించి.. పూర్తి స్థాయిలో సాయం చేయలేదు. ఎవడి రాజ్యం ఇది. తెలంగాణ వస్తే సామాజిక న్యాయం వస్తదని నమ్మినం. పెట్టుబడిదారులకు, పెత్తందార్లకు, ఆధిపత్య వర్గాలకు పెట్టని కోటగా మారిపోయింది.
- దాసోజు శ్రవణ్

పదవుల కోసం మేధావులే సాగిలపడ్డరు
జరుగుతున్న పరిణామాల్లో దారుణమైన కుట్ర ఉంది. రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ కుటుంబాన్ని వ్యతిరేకించాల్సిన మేధావులే పదవుల కోసం సాగిలపడ్డరు. తెలంగాణ బిల్లు పాస్ కాగానే ‘టీఆర్ఎస్ ఉద్యమ పార్టీ కాదు’ అని అన్నప్పుడు సరిగా అర్థం చేసుకోలేకపోయాం. కేసీఆర్ కుటుంబానికి, వందిమాగధులకే నిధులు పంచిపెడ్తున్నరు. కార్పొరేట్ బ్యాచ్ దిగింది. వంద కోట్లు ఇస్తే ఎంపీ టికెట్.. ఇంకా ఎక్కువ ఇస్తే రాజ్యసభ టికెట్ అన్నట్లుగా మారింది. ప్రజల్లో మళ్లీ ఆవేశం పెరుగుతోంది.. మంత్రినే తరిమికొట్టిన సందర్భం చూసినం.. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కడ తిరుగుతున్నా సామాన్య జనం తరిమికొట్టే రోజు త్వరలోనే వస్తుంది.
- యెన్నం శ్రీనివాస్ రెడ్డి

వీ6.. ప్రజల గళం

తెలంగాణ ప్రజల రుణాన్ని వీ6 ఎప్పుడో తీర్చుకుంది. ప్రజల గళం, చూపు అయింది. ఉద్యమకారులు కష్టంలో ఉన్నప్పుడు ప్రజల హృదయమైంది. రాష్ట్ర సాధనలో వీ6 ముఖ్యమైన సాధనంగా ఉంది. ఆనాడు అది ఫీల్ అయిన కాబట్టే.. వీ6 ఆఫీస్‌‌‌‌కు వచ్చిన. 
- డాక్టర్ ప్రవీణ్ కుమార్, సైకియాట్రిస్ట్

సొమ్మంతా తిమింగళాలపాలు

ఇతర రాష్ట్రాలతో పోలిస్తే పాలన విలక్షణంగా ఉంటుందని విశ్వసించాం. వంద ఖర్చు పెట్టాల్సిన చోట 500 ఖర్చు పెట్టారు. సొమ్మంతా తిమింగళాల పాలయింది. సమైక్యవాదులు కూడా ముట్టుకోవడానికి భయపడిన పరిస్థితులకు భిన్నంగా ఇప్పుడు ఎవర్నయినా అరెస్టు చేసి జైలుకు పంపుతున్నరు. ఉమ్మడి రాష్ట్రంలో పోలీసుల నుంచి గౌరవం దక్కింది. కానీ సెప్టెంబరు 17న ధర్నా చేసి అరెస్టయితే పోలీస్ స్టేషన్‌‌‌‌లో సాయంత్రం వరకు మంచినీళ్లు కూడా ఇవ్వలేదు. మనవాళ్లే మనల్ని నిర్బంధిస్తున్నారు. కాళేశ్వరాన్ని బీబీసీ ప్రసారం చేసిందంటున్నారు. కానీ అక్కడకు వెళ్లి పరిశీలిస్తే మంథని నుంచి కాళేశ్వరం వరకు పరిస్థితి భిన్నం. అవినీతిని వెలుగులోకి తెస్తున్న మీడియా ప్రతినిధులను అరెస్టు చేయడం, నిర్బంధంలోకి తీసుకోవడం సాధారణంగా మారింది. పోలీసు యంత్రాంగం మరీ తాపీదార్లలాగా మారింది.

- కపిలవాయి దిలీప్ కుమార్