విశ్లేషణ: సర్కారు తప్పులకు ఉద్యోగులు, టీచర్లు బలి కావాలా?

విశ్లేషణ: సర్కారు తప్పులకు ఉద్యోగులు, టీచర్లు బలి కావాలా?

గురువులకు సముచిత గౌరవం ఇవ్వటం మన సంస్కృతిలో అంతర్భాగం. కానీ, తెలంగాణలో టీచర్ల పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. ఎంతోమంది స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, టీచర్లు, ఉద్యోగులు వందల రోజులు జైలు జీవితం గడిపాక సాధించుకున్న తెలంగాణ.. విద్యార్థులు, నిరుద్యోగులు, రైతుల ఆత్మహత్యల రాష్ట్రంగా మారిపోయింది. ఇవి చాలవన్నట్లు టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ మధ్య ఉద్యోగులు, టీచర్ల బదిలీల్లో చేసిన తప్పుల కారణంగా ఇప్పటికే 15 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. గురువులను పూజించే విషయం గురించి చర్చించుకునే స్థాయి నుంచి వారి ఆత్మహత్యలపై చర్చించుకునే స్థాయికి తెలంగాణ రాష్ట్రం దిగజారటం నిజంగా బాధాకరం. రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పులకు టీచర్లు ఎందుకు బలి కావాలి? ఎంతో మంది టీచర్లు, ఉద్యోగుల జీవితాలను బలి తీసుకున్న జీవో 317ను వెంటనే రద్దు చేయాలి. వారిలో నెలకొన్న ఆందోళనలను తొలగించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపైనే ఉంది.

గత నెలలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 317 కారణంగా దాదాపు రెండు లక్షల మంది ఉద్యోగులు, టీచర్లు నానా అవస్థలు పడుతున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు కారణంగా ఉద్యోగులు, టీచర్లు శాశ్వత బదిలీకి ఈ జీవో ద్వారా రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అయితే ఒక ప్రణాళిక ప్రకారం జోనల్, మల్టీ జోనల్, జిల్లాస్థాయి పోస్టులు ఏవి అనేవి నిర్ణయించాల్సి ఉంది. కానీ ప్రభుత్వం ఇవేవీ చేయకుండానే ఆదరాబాదరాగా అలాట్​మెంట్​ చేసేసింది. అయితే ఈ ప్రక్రియ అంతా లోపభూయిష్టంగానే జరిగింది. దీనివల్ల ముఖ్యంగా టీచర్లు బాగా నష్టపోయారని రాష్ట్రంలోని ప్రతి ఒక్క టీచర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీచర్ల బదిలీల్లో అసలు స్థానికత అనే విషయాన్ని పట్టించుకోలేదని, కేవలం సీనియార్టీని పరిగణనలోకి తీసుకొని అలాట్​మెంట్​ చేయటం ఏంటి? అని ప్రశ్నిస్తున్నారు. కేవలం స్థానికతే కాదు, డీఎస్సీ మార్కులు.. గతంలో వారు చేసిన సర్వీసును సైతం పరిగణనలోకి తీసుకోలేదు. స్పౌజ్, విడో అనే విషయాలను కూడా పరిగణనలోకి తీసుకోలేదు. ఇవన్నీ ఒక ఎత్తయితే అసలు బదిలీలకు కావాల్సిన సీనియార్టీ లిస్టును విడుదల చేయకుండానే ఆప్షన్ల ప్రక్రియను ముగించేయడం మరో ఎత్తు. తమ తర్వాత ఉద్యోగాల్లో చేరిన వారికి అధిక సర్వీస్ వచ్చిందని, ఆయా సీనియార్టీ జాబితా అంతా తప్పులతడకగా ఉందని.. దాదాపు 20 రోజులుగా తరగతి గదులను, తమ స్కూళ్లను విడిచిపెట్టి కలెక్టరేట్లు, డీఈవో ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు సైతం చేస్తున్నారు. పోలీసులు వారిని లాక్కెళ్లి అరెస్ట్ చేయడం సిగ్గుపడాల్సిన విషయం. 

టీచర్లతో పాటు స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌..

అయితే ఈ బదిలీల కారణంగా టీచర్లు మాత్రమే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అనుకుంటే పొరపాటే. బదిలీల కారణంగా స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోంది. చాలా స్కూళ్లల్లో ఈ బదిలీల్లో భాగంగా ఉన్న ఐదారుగురు టీచర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. కొన్ని స్కూళ్లలో విద్యార్థులకు దిశానిర్దేశం చేయడానికి బడికి కనీసం ఒక్క టీచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా లేడు. ఆయా స్కూళ్లల్లో చదువుతున్న స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కు.. ప్రైవేటు స్కూళ్లల్లో చదువుకునే స్తోమత ఉండదు. ఈ కారణంగా వారంతా మొత్తానికే చదువుకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతోంది. అయితే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ ఏడేండ్ల తర్వాత చేపట్టిన ఈ బదిలీలు ఎంతో పరిపక్వతతో, ప్రణాళికాబద్ధంగా చేయాల్సి ఉంది. కానీ లోపభూయిష్టంగా ఉన్న ఈ బదిలీలను చూస్తుంటే ప్రభుత్వానికి స్టూడెంట్స్, టీచర్లు, విద్యారంగం మీద ఎంత శ్రద్ధ ఉందో అర్థమవుతోంది.

గందరగోళంలో లక్షా 60 వేల మంది

ఎంతో కష్టపడి ప్రభుత్వ యూనివర్సిటీలైన జేఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీయూ, ఓయూ, కేయూల్లో సీట్లు సాధించినప్పటికీ అక్కడ కూడా రెండు వందల శాతం పెంచిన ఫీజుల కారణంగా స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంతేకాకుండా రెగ్యులర్ కోర్సులను సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుగా మారుస్తూ పేద బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేసే కుట్రలు చేస్తున్నట్లుగా తెలంగాణ సమాజం భావిస్తోంది. ఇది చాలదన్నట్లు ప్రభుత్వం ఉద్యోగులు, టీచర్లను సైతం నిర్వీర్యం చేసే కుట్రకు తెర లేపింది. వాస్తవానికి ఈ ఉపాధ్యాయులే అందరికీ తెలంగాణ ఉద్యమ పాఠాలు నేర్పారు. ఉద్యమ చరిత్రను ఉగ్గు పాల లాగా నూరిపోసింది వారే. అటువంటి టీచర్ల ఆత్మహత్యలు చూడాల్సిన రోజు రావడం ఎంతో బాధ కలిగిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన జీవో 317 వల్ల లక్షా 60 వేల మంది టీచర్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ జీవోను రద్దు చేసి వారందరికీ న్యాయం చేయాలి. కావలసినంత సమయం తీసుకొని పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకొని, స్థానికత ఆధారంగా సీనియార్టీ జాబితాను ముందే సిద్ధం చేసి జిల్లా, జోనల్, మల్టీ జోనల్ స్థాయి పోస్టులు ఏవి అనేది ఖరారు చేసుకుని, ఒక కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసి అందులో కొంతమంది ఉద్యోగులను, టీచర్లను సభ్యులుగా తీసుకొని, వారి ఆలోచనలకు ప్రాధాన్యమిచ్చి విధివిధానాల రూపకల్పన చేయాలి. ఇవే కాకుండా స్పౌజ్, విడో ఆప్షన్లకు కూడా బదిలీల్లో ప్రాధాన్యమిచ్చి నిష్పక్షపాతంగా ప్రక్రియ చేపట్టాలి.

మరో జీవో విడుదల చేయాలి

రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పులకు టీచర్లను బలి చేయడం ఎంతవరకు సమంజసం? ఆత్మహత్యలు వారి జీవితాలకు పరిష్కారం కాదనేది ఉపాధ్యాయ సమాజం కూడా ఆలోచించాలి. కొట్లాడి సాధించుకున్న రాష్ట్రంలో మరో ఉద్యమం చేసైనా సక్రమంగా టీచర్లు, ఉద్యోగుల బదిలీలను చేసుకునేలా తెలంగాణ సమాజం టీచర్లకు ఎప్పుడూ కూడా మద్దతుగా ఉంటుంది. ప్రభుత్వం జీవో 317 విషయంలో పునరాలోచించాలి. దాన్ని రద్దు చేసి, ప్రాయశ్చిత్తంగా టీచర్ల బదిలీలను సక్రమంగా నిర్వహించేలా మరో జీవోను విడుదల చేయాలి. టీచర్ల బదిలీల విషయంలో కొంత మంది అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు తమ నాయకత్వం మెప్పు పొందే క్రమంలో టీచర్లను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం సరికాదు. దేశ భవిష్యత్తును నాలుగు గోడల మధ్య నిర్మించేది టీచర్లే. వారు అన్ని విషయాల్లో ప్రశాంతంగా ఉంటేనే స్కూళ్లల్లో సరైన విద్యా భోదన జరుగుతుంది. తద్వారా నవభారత నిర్మాతలుగా  ఇంజనీర్లు, డాక్టర్లు, సామాజిక కార్యకర్తలు, ఐఏఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, ఐపీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, సైంటిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను సమాజానికి అందించగలరు. వారు తమ తమ రంగాల్లో రాణించి దేశ, రాష్ట్ర ప్రతిష్టను ప్రపంచానికి చాటి చెప్పే అవకాశం ఉంటుంది.

టీచర్​ పోస్టుల భర్తీ తీరని ఆశేనా..

ఒక స్కూల్​లో ఉన్న టీచర్​ను మరో స్కూల్​కు బదిలీ చేశారు. ఇంత వరకు బాగానే ఉంది. కానీ, టీచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోస్టులు ఖాళీగా ఉన్న చోట మన ప్రభుత్వ పెద్దలు రిక్రూట్​మెంట్ చేపట్టి ఉన్న ఖాళీలన్నీ భర్తీ చేస్తారా అంటే అది తీరని ఆశగానే కనిపిస్తోంది. టీచర్లను బదిలీ చేయటం వల్ల పిల్లలు ఎక్కువ సంఖ్యలో బడుల్లో చేరరు. అందువల్ల తక్కువ సంఖ్యతో నడుస్తున్న స్కూళ్లను రేషనలైజేషన్ పేరుతో మూసివేసే కుట్ర ఉందేమో? అనేది ప్రజల్లో ఉన్న అతి పెద్ద సందేహం. ఇప్పటికే వందల కొద్దీ బడులను రేషనలైజేషన్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం మూసివేసింది. మరికొన్నింటిని మూసేసేందుకు సిద్ధమైంది. కేజీ టు పీజీ.. ఉచిత విద్య నా మానస పుత్రిక అని చెప్పి.. మేనిఫెస్టోలో పెట్టి, రెండుసార్లుఎన్నికల్లో నెగ్గాక ముఖం చాటేసిందీ ప్రభుత్వం. ఈ రోజుకీ కేజీ టు పీజీ ఉచిత విద్య దేవుడెరుగు గానీ, కేజీ టు పీజీ వరకు ఫీజుల మోత కారణంగా వేలాది మంది విద్యార్థుల తల్లిదండ్రులు అప్పులు చేసి మరీ తమ పిల్లలను చదివిస్తున్నారు. ఇంకొంత మంది తల్లిదండ్రులు అప్పులు చేయలేక తమ పిల్లలను చదువుకు దూరం చేస్తున్నారు. 

– జవ్వాజి దిలీప్, సామాజిక కార్యకర్త