
అన్నయ్య అడుగుల్లో అడుగులు వేస్తూ వచ్చినా.. హీరోగా తనకంటూ ఓ ఇమేజ్ సంపాదించుకోవాలని ఆరాట పడుతున్నాడు ఆనంద్ దేవరకొండ. దొరసాని, మిడిల్‌క్లాస్ మెలొడీస్, పుష్పకవిమానం చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం మూడు డిఫరెంట్ మూవీస్‌లో నటిస్తున్నాడు. నిన్న తన పుట్టినరోజు కావడంతో మూడు సినిమాల టీమ్స్ విషెస్ చెబుతూ కొత్త పోస్టర్లను విడుదల చేశాయి. ఎస్‌కెఎన్ నిర్మాణంలో సాయి రాజేష్ తెరకెక్కిస్తున్న ‘బేబీ’ పోస్టర్‌లో ఎర్ర గులాబీని పట్టుకుని సీరియస్‌గా చూస్తున్నాడు ఆనంద్. దాంతో ఇది కాస్త సీరియస్ కాన్సెప్ట్ అని అర్థమవుతోంది. ఈ మూవీ షూటింగ్ చివరి స్టేజ్‌లో ఉంది. అలాగే సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్ డైరెక్ట్ చేస్తున్న ‘హైవే’ మూవీ పోస్టర్‌లో కొండ అంచున కూర్చుని ప్రకృతిని ఆస్వాదిస్తున్నాడు ఆనంద్. ఈ సైకో థ్రిల్లర్‌లో మానస రాధాకృష్ణన్ హీరోయిన్. మూవీ విడుదలకు సిద్ధంగా ఉందని చెప్పారు నిర్మాత వెంకట్ తలారి. వీటితో పాటు ‘గం గం గణేశా’ అనే యాక్షన్ ఎంటర్‌టైనర్‌లోకూడా నటిస్తున్నాడు ఆనంద్. ఈ మూవీ కాన్సెప్ట్ పోస్టర్‌లో పగిలిన కళ్లద్దాలు, నోట్లో సిగరెట్, తలకు బ్యాండేజ్‌తో ఉన్నాడు ఆనంద్. తనని ఇప్పటి వరకు చూడని ఓ కొత్త క్యారెక్టర్‌లో చూడబోతున్నారని చెబుతున్నారు దర్శకుడు ఉదయ్ శెట్టి, నిర్మాతలు కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి.