ఆనంద్‌‌.. ఓ మనసున్న మాస్టర్‌‌

ఆనంద్‌‌.. ఓ మనసున్న మాస్టర్‌‌

సూపర్‌‌ 30.. సినీ వర్గాల్లో, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ సినిమా ట్రైలర్‌‌ గురించే చర్చ జరుగుతోంది.  బాలీవుడ్‌‌ హ్యాండ్సమ్‌‌ హంక్ హృతిక్‌‌ రోషన్ లీడ్‌‌ పాత్రలో వికాస్‌‌ బాల్‌‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.  ప్రపంచ మీడియా దృష్టిని ఆకర్షించిన ఎడ్యుకేషన్‌‌ ప్రోగ్రాం ‘సూపర్‌‌–30’.. దాని సృష్టికర్త ఆనంద్‌‌ కుమార్‌‌ జీవితం ఆధారంగా ఈ సినిమాని తీశాడు వికాస్‌‌. ట్రైలర్‌‌ మొత్తం ప్రామిసింగ్‌‌గా ఉండగా..  హృతిక్ డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. ఇంతకీ ఈ సినిమాకి మూలమైన ఆనంద్‌‌ ఎవరు?.. అతను ఎందుకు అంతలా పాపులర్‌‌ అయ్యాడో తెలుసుకుందాం.

బీహార్‌‌, పాట్నాకు చెందిన ఆనంద్ కుమార్‌‌ ఒక లెక్కల మాస్టర్‌‌.  1992 నుంచి రామానుజన్‌‌  స్కూల్‌‌ ఆఫ్‌‌ మ్యాథమెటిక్స్‌‌ (ఆర్‌‌ఎస్‌‌ఎం) కోచింగ్‌‌ సెంటర్‌‌ని నిర్వహిస్తున్నాడు.  ఒకరోజు ఒక పేద విద్యార్థి తనకూ కోచింగ్‌‌ నేర్పించాలని ఆనంద్ కాళ్ల మీద పడ్డాడు. అతని పరిస్థితికి చలించిపోయిన  ఆనంద్ 2002 నుంచి ‘సూపర్‌‌–30’ అనే ప్రోగ్రాంను మొదలు పెట్టాడు.  ఆర్థిక స్థోమత లేని ముప్ఫై మంది పేద విద్యార్థులకు ఐఐటీ–జేఈఈ ఎంట్రన్స్‌‌ ఎగ్జామ్‌‌కి ఉచితంగా శిక్షణ ఇవ్వడం ‘సూపర్‌‌–30’ ఉద్దేశం.  ఏడాది శిక్షణ కాలంలో విద్యార్థుల వసతి, భోజనం, కోచింగ్‌‌ ఖర్చులన్నీ ఆనంద్‌‌ కుటుంబమే భరిస్తుంది.  ఆనంద్ తల్లి జయంతి వంట పనులు, సోదరుడు ప్రణవ్‌‌ హాస్టల్ నిర్వహణ చూసుకుంటారు. ఆర్‌‌ఎస్‌‌ఎం నిర్వహణ ద్వారా వచ్చే డబ్బుని సూపర్‌‌–30 ప్రాజెక్టు కోసం ఖర్చు చేస్తోంది ఆ కుటుంబం. డిస్కవరీ చానెల్‌‌ ఆనంద్‌‌ చేస్తున్న కృషి గురించి ఒక డాక్యుమెంటరీ తీసి.. ఒక గంటపాటు టెలికాస్ట్‌‌ చేసింది.  ప్రపంచం మొత్తానికి ఆనంద్‌‌ చేస్తున్న కృషి గురించి.. సూపర్‌‌ 30 ప్రోగ్రాం గురించి తెలిసింది అప్పుడే..

అప్పడాలు అమ్ముకున్నడు…

మధ్య తరగతి కుటుంబంలో 1973లో పుట్టాడు ఆనంద్‌‌. తండ్రి పోస్టల్ డిపార్ట్‌‌మెంట్‌‌లో క్లర్క్‌‌.  గవర్నమెంట్‌‌ స్కూల్లో హిందీ మీడియంతోనే స్కూల్‌‌ చదువులు పూర్తి చేశాడు ఆనంద్‌‌. ఆ సమయంలోనే లెక్కల మీద ఇంట్రెస్ట్‌‌ పెంచుకున్నాడు.  డిగ్రీ చదువుతున్నప్పుడు ‘నెంబర్‌‌ థియరీ’ మీద అతను రాసిన వ్యాసాలు ‘మ్యాథమెటికల్ స్పెక్ట్రమ్‌‌’, ‘ది మ్యాథమెటికల్‌‌ గెజిట్‌‌’లో ప్రచురితం అయ్యాయి.  గ్రాడ్యుయేషన్‌‌ పూర్తయ్యాక కేంబ్రిడ్జి యూనివర్సిటీలో అడ్మిషన్‌‌ దొరికినప్పటికీ..  సరిగ్గా అదే టైంలో తండ్రి మరణం, ఆర్థికంగా పరిస్థితులు బాగోలేకపోవటంతో ఆగిపోయాడు. తర్వాత చాలా సంవత్సరాలు స్పాన్సర్ల కోసం ఎదురు చూసినా లాభం లేకపోయింది.  పగలంతా లెక్కలతో కుస్తీ పడుతూ..  సాయంత్రం వేళలో సైకిల్‌‌ మీద తిరుగుతూ అప్పడాలు అమ్మేవాడు.  ఇంకోవైపు లెక్కల ట్యూషన్లు చెబుతూ కుటుంబానికి ఆసరాగా నిలిచాడు.  పాట్నాలో ఫారిన్‌‌ జర్నల్స్‌‌ లైబ్రరీ అందుబాటులో లేకపోవడంతో వారాంతంలో ఆరుగంటలు ప్రయాణం చేసి వారణాసికి వెళ్లి మరీ చదువుకునేవాడు.

గ్లోబల్‌‌ గుర్తింపు…

2009లో డిస్కవరీ డాక్యుమెంటరీ ప్రసారం అయ్యాక అంతర్జాతీయ మీడియా చానెళ్లన్నీ ఆనంద్‌‌ గురించి వరుసగా కథనాలు ప్రచురించాయి. మన దేశానికి చెందిన ఒక టీచర్‌‌ గురించి ‘ది న్యూయార్క్ టైమ్స్‌‌’ పత్రిక సగం పేజీని కేటాయించడం అప్పట్లో ఆసక్తికరమైన చర్చకు దారితీసింది. యూరోపియన్‌‌ మ్యాగజైన్‌ ‘ఫోకస్‌‌’, యూకే మ్యాగజైన్‌‌ ‘మోనోక్లె’ ఆనంద్‌‌ను హైలెట్‌‌ చేస్తూ  స్టోరీలు రాశాయి. జపాన్‌‌ నటి నొకిరా ఫుజివర స్వయంగా పాట్నాకు వచ్చి ఆనంద్‌‌ గురించి ఒక డాక్యుమెంటరీ తీసింది.
2010 కి గానూ టైమ్‌‌ మ్యాగజైన్‌‌ ‘బెస్ట్ ఆఫ్‌‌ ఏషియా’ లిస్ట్‌‌లో సూపర్‌‌–30 ప్రాజెక్ట్‌‌ని చేర్చింది. ఆ సమయంలో అమెరికా అధ్యక్షుడిగా ఉన్న బరాక్‌‌ ఒబామా ప్రత్యేక అధికారి రషద్‌‌ హుస్సేన్‌‌, ఆనంద్‌‌కి  ప్రత్యేకంగా ప్రశంసలు తెలియజేశాడు. బీహార్‌‌తో పాటు పలు రాష్ట్రాలు, ఆ మాటకొస్తే విదేశీ ప్రభుత్వాలు ఆనంద్‌‌ను ప్రత్యేక పురస్కారాలతో సత్కరించాయి. రికార్డు స్థాయిలో విద్యార్థులకు కోచింగ్‌‌ ఇచ్చినందుకు లిమ్కా బుక్‌‌ ఆఫ్‌‌ రికార్డ్స్‌‌లో ఆనంద్ పేరు నమోదయ్యింది.
మస్సాచుసెట్‌, హార్వర్డ్‌‌ యూనివర్సిటీలతో పాటు పలు అంతర్జాతీయ వేదికలపై ప్రసంగించే అవకాశం దక్కింది ఆనంద్‌‌కి.

ఛీటింగ్‌‌ ఆరోపణలు?…

సూపర్‌‌–30 ప్రాజెక్టులో భాగంగా 2003-–17 మధ్యకాలంలో 450 మంది విద్యార్థులకుగానూ 391 మంది ఐఐటీ సీట్లు సాధించారు. 2010లో ఏకంగా బ్యాచ్‌‌ మొత్తం సీట్లు సాధించింది.  మొదట్లో ఒక్కడే బ్యాచ్‌‌ మొత్తానికి కోచింగ్‌‌ ఇచ్చేవాడు. తర్వాతి కాలంలో ఆనంద్‌‌ ప్రయత్నానికి మరికొందరు లెక్చరర్లు తోడయ్యారు.
ప్రభుత్వం, ఎన్జీవోలు, ప్రజలు ఎవరు విరాళాలు ఇచ్చినా ఆనంద్ తీసుకోడు.  కాకపోతే అతని టీమ్‌ సాయంత్రం పూట స్పెషల్ క్లాసులు చెప్పి కావాల్సిన డబ్బును సమీకరిస్తుంది. ఇదిలా ఉంటే కిందటేడాది జులైలో ఒక ప్రముఖ దినపత్రికలో ఆనంద్ కుమార్‌‌ గురించి ఒక నెగెటివ్‌‌ స్టోరీ పబ్లిష్‌‌ అయ్యింది. ‘బ్యాచ్‌‌లో ఐఐటీకి సెలక్ట్‌‌ అయ్యింది ముగ్గురే అయితే.. 26 మంది అని ఆనంద్ ప్రచారం చేస్తున్నాడని, పైగా సూపర్‌‌–30 ప్రాజెక్ట్‌‌ ముసుగులో చీకటి దందా నడుస్తోందని’ ఆ కథనంలో ఆరోపణలు చేసింది. అయితే ఆనంద్‌‌ ఆ ఆరోపణలపై స్పందించలేదు. ఆ విమర్శలు ఆనంద్‌‌పై, సూపర్‌‌–30 ప్రాజెక్ట్‌‌పై ఎలాంటి ప్రభావం చూపించలేదు. పైగా ఆనంద్ అంటే గిట్టని కొన్ని ప్రైవేట్‌‌ ఎడ్యుకేషన్‌‌ సంస్థలు పుట్టించిన పుకార్లే అనుకున్నారు చాలా మంది .

శెభాష్‌‌ హృతిక్‌‌….

బాలీవుడ్‌‌ నటుడు హృతిక్‌‌ రోషన్‌‌పై కెరీర్‌‌ ప్రారంభం నుంచి ఒక విమర్శ ఉంది. నత్తి సమస్య వల్ల అతని డైలాగ్‌‌ డెలివరీ సరిగా ఉండదని కొత్త సినిమా రిలీజ్‌‌ అయిన ప్రతీసారి విమర్శలతో ఏకిపడేసేవారు. అయితే ‘సూపర్‌‌–30’ ట్రైలర్ రిలీజ్‌‌ అయ్యాక అదే విమర్శకులు హృతిక్‌‌పై ప్రశంసలు గుప్పించారు. డీగ్లామర్‌‌ రోల్‌‌, లెంగ్తీ డైలాగుల్ని.. అంతే ఎమోషనల్‌‌గా హృతిక్‌‌ చెప్పిన తీరు సెలబ్రిటీలను సైతం ఆకట్టుకుంది.  డైలాగుల కోసం ఎంతో  సాధన చేసినట్లు హృతిక్‌‌ ఈ మధ్య కొన్ని ఇంటర్వ్యూలలో చెప్పాడు కూడా. ‘ది ఇండియన్‌‌ స్టామెరింగ్‌‌ అసోసియేషన్‌‌’ (తడబడుతు మాట్లాడేవాళ్ల కోసం ప్రత్యేక సంస్థ) కూడా హృతిక్‌‌ను పొగుడుతూ ట్వీట్‌‌ చేయడం విశేషం. అయితే ఆనంద్‌‌కి ‘సూపర్‌‌ 30’ సినిమా కంటే ముందే బాలీవుడ్‌‌తో  కనెక్షన్‌‌ ఉంది. ప్రకాశ్‌‌ ఝా ‘ఆరక్షణ్‌‌’ సినిమాలో ప్రిన్సిపాల్ పాత్ర కోసం అమితాబ్‌‌ బచ్చన్,  ఆనంద్ కుమార్‌‌ నుంచి కొన్ని టిప్స్‌‌ తీసుకున్నాడు.

స్టోరీ ఏంటంటే..

పేద విద్యార్థుల్ని ‘సూపర్‌‌–30’ ద్వారా వెలుగులోకి తేవాలన్నది ఆనంద్‌‌ కుమార్‌‌ కల. ఎన్నో కార్పోరేట్ కంపెనీల ఆఫర్లు..విదేశాల్లో డబ్బు సంపాదించే అవకాశం ఉన్నా అవన్నీ వదులుకొని పాట్నాలోనే  ఉండిపోతాడు.  ఆనంద్ టాలెంట్ గురించి తెలుసుకొని ఆయనను ట్రైనర్ గా పెట్టుకుని ఒక వ్యాపారవేత్త  కోచింగ్ సెంటర్‌‌ మొదలుపెడతారు. అయితే అదంతా.. డబ్బున్నవాళ్ల కోసం కావడంతో ఆనంద్ ఆ పని నుంచి తప్పుకుంటాడు. కోచింగ్ కోసం డబ్బు చెల్లించలేని పేద విద్యార్థులకోసం స్వయంగా కోచింగ్ ఇవ్వడం మొదలు పెడతాడు. ఈ ప్రయత్నంలో ఎదురయ్యే ఆటంకాల్ని ఎలా అధిగమిస్తాడు?, చివరకు తన ఆశయాన్ని ఎలా నెరవేర్చుకుంటాడు? అన్నదే ‘సూపర్‌‌ 30’ సినిమా కథ. ఈ సినిమా కోసం పది కోట్ల రూపాయల ఖర్చుతో పాట్నా సెట్‌‌ను ముంబైలో వేయడం విశేషం.