బిజినెస్‌‌ అంటే లగ్జరీ కార్లు, స్టార్‌‌ హోటళ్లే కాదు…

బిజినెస్‌‌ అంటే లగ్జరీ కార్లు, స్టార్‌‌ హోటళ్లే కాదు…

ఆవేదన కూడా.. కాఫీ డే సిద్దార్థ జీవితం చెప్పేది ఇదే

వెలుగు బిజినెస్‌‌ డెస్క్​: గౌతమ్‌‌ సిద్ధార్థ  ఆత్మహత్య  దేశీయ   కార్పొరేట్‌‌ రంగాన్ని  నివ్వెరపర్చింది.  వందల కోట్ల రూపాయల ఆస్తులున్నయ్‌‌, సక్సెస్‌‌ఫుల్‌‌ బిజినెస్‌‌మన్‌‌, రాజకీయంగా  పలుకుబడి ఉన్న కుటుంబం… అయినా  సిద్ధార్థ ఇంత దారుణమైన నిర్ణయం ఎందుకు తీసుకున్నట్టు ?  అంటే, ఈజ్‌‌ ఆఫ్‌‌ డూయింగ్‌‌ బిజినెస్‌‌లో  మన ర్యాంకుల పెరుగుదల,  ఉత్త  డప్పుకొట్టుకునేందుకేనా ?  బిజినెస్‌‌ చేసుకుంటే లగ్జరీ కార్లు, స్టార్‌‌ హాటళ్లు… అంటూ  హాయిగా బతికేయవచ్చన్నది ఉత్త  అపోహ యేనా ?   స్వేచ్ఛగా  వ్యాపారం చేసుకోగల వాతావరణం దేశంలో ఇంకా  రాలేదా ?  వ్యాపారులు, పారిశ్రామికవేత్తలకు అవినీతి అధికారుల నుంచి వేధింపులు తప్పడం లేదా ? ఆత్మహత్యకు ముందు సిద్ధార్థ రాసినట్టుగా చెబుతున్న ఉత్తరం చూస్తే ఈ ప్రశ్నలన్నీ  వస్తున్నయ్‌‌. సక్సెస్‌‌తో వచ్చే గుర్తింపు తప్పితే, ఎంట్రప్రెనూర్ల జీవితాలు కష్టాల కడలేనని తేలిపోతోంది.

ఆదాయపు పన్ను అధికారుల వేధింపులపై  తన లెటర్‌‌లో  సిద్ధార్థ  రాయడాన్ని బట్టి ఇండియాలో  వ్యాపారవేత్తలు  ఎదుర్కొంటున్న ఒత్తిడి అర్థమవుతోంది. ఓవైపు ట్యాక్స్‌‌ అధికారుల ఒత్తిళ్లు, మరోవైపు మార్కెట్లో  లిక్విడిటీ సమస్య,  అప్పుల భారం వ్యాపారవేత్తలకు పెద్ద సవాళ్లుగా మారాయి. ఇవన్నీ కలిపి  బిజినెస్‌‌మెన్‌‌పై  తీవ్రమైన ఒత్తిడి కలిగిస్తున్నాయి. చనిపోవడానికి ముందు సిద్ధార్థ రాసిన లెటర్‌‌లో ఇన్‌‌కంటాక్స్‌‌ ఆఫీసర్ల వేధింపులు తాళలేకపోతున్నానని స్పష్టంగా ప్రస్తావించారు. మైండ్‌‌ట్రీ డీల్‌‌ను బ్లాక్‌‌ చేయడానికి  గతంలోని ఇన్‌‌కంటాక్స్‌‌ డీజీ పనిగట్టుకుని వేధించారని వెల్లడించారు. కాఫీ తోటల యజమానికి కొడుకుగా పుట్టి, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్‌‌ ఎం కృష్ణకు అల్లుడైన సిద్ధార్థ  వేల కోట్ల రూపాయల బిజినెస్‌‌  ఎంపైర్‌‌ను నిర్మించిన సంగతి తెలిసిందే. అటువంటి వ్యక్తికి పలుకుబడికి, పరిచయాలకు కొదవేమీ ఉండదు. అలాంటిది సిద్ధార్థే ఒత్తిడిని తట్టుకోలేకపోయారంటే, మిగిలిన వ్యాపారవేత్తల గురించి ఇక చెప్పేదేముంది,

బాబోయ్‌‌ కరప్షన్‌‌….

ఇండియాలో అవినీతి పెచ్చు మీరి పోయింది. ఎంట్రప్రెనూర్లపై ఇన్‌‌కంటాక్స్‌‌, ఈఎస్‌‌ఐ, పీఎఫ్‌‌, పీటీ, జీఎస్‌‌టీ సహా గవర్న్‌‌మెంట్‌‌ డిపార్ట్‌‌మెంట్స్‌‌ వేధింపులు తట్టుకోలేని విధంగా ఉంటున్నాయని ఇన్‌‌గవర్న్‌‌ మేనేజింగ్‌‌ డైరెక్టర్‌‌ శ్రీరామ్‌‌ సుబ్రమణియన్‌‌ చెప్పారు. మల్టిపుల్‌‌ ఫైలింగ్స్‌‌, వాటిమీద స్క్రూటినీలు  స్టార్టప్స్‌‌, ఎంట్రప్రెనూర్ల జీవితాలను దుర్భరం చేస్తున్నాయని అన్నారు. కంపెనీ రిజిస్ట్రేషన్‌‌తో సహా అన్ని విషయాలలోనూ కరప్షన్‌‌ ఎక్కువై పోయిందని శ్రీరామ్‌‌ సుబ్రమణియన్‌‌ విమర్శించారు. అంకెలు, ర్యాంకులు కోసమే ఈజ్‌‌ ఆఫ్‌‌ డూయింగ్‌‌ బిజినెస్‌‌ అన్న చందంగా ఉందని వాపోయారు.

వ్యాపారం మొదలెట్టకుండానే రోజువారీ కార్యకలాపాలలో ఎంట్రప్రెనూర్స్‌‌ కష్టాలు మొదలవుతాయి. ఇందుకు ఉదాహరణ ఆఫీసు రిజిస్ట్రేషన్‌‌. పరిశ్రమకు అవసరమైన స్థలం పొందేందుకు  మూడేళ్లు పడుతోంది, అదికూడా చాలా డబ్బు, శ్రమా పెడితే తప్ప వీలవడం లేదని శ్రీరామ్‌‌ సుబ్రమణియన్‌‌ వ్యాఖ్యానించారు. ఇక ఏదైనా కంపెనీ సక్సెస్‌‌ అయిందంటే చాలు..పొలిటీషియన్స్‌‌, బ్యూరోక్రాట్స్‌‌ తమ వాటా కోసం గద్దల్లా వాలిపోతారని పేర్కొన్నారు. బ్యూరోక్రసీలో రెడ్‌‌టేపిజం పోకపోతే, ఈజ్‌‌ ఆఫ్‌‌ డూయింగ్‌‌ బిజినెస్‌‌లో ర్యాంకుల గురించి చెప్పుకోవడం  వేస్ట్‌‌ అని  అన్నారు. ఇటీవల కాలంలో టాక్స్‌‌ ఆఫీసర్ల వైఖరి కయ్యాలకు దిగేదిగా ఉంటోందని ఇన్ఫోసిస్‌‌ మాజీ సీఎఫ్‌‌ఓ వి బాలక్రిష్ణన్‌‌ విమర్శించారు. స్టారబక్స్‌‌కు దీటైన వ్యాపారాన్ని ఇండియాలో సిద్ధార్థ నిర్మించారు. ఆయన రాసిన లెటర్‌‌లో విషయాలు చాలా డిస్టర్బ్‌‌ చేసేవిగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. టాక్స్‌‌ టెర్రరిజం, వ్యాపార ఒత్తిడి, అప్పుల బాధల గురించి అందులో ప్రస్తావించారు. గతంలో కంటే ఎక్కువగా టాక్స్‌‌ అథారిటీస్‌‌ కయ్యాలకు  కాలు దువ్వుతున్నారని బాలక్రిష్ణన్‌‌ అభిప్రాయపడ్డారు. వారి వేధింపులు నానాటికీ తీవ్రమవుతున్నాయని అన్నారు. నిజానికి ఇండియా ఇప్పుడు ఆర్థికంగా మందగమనాన్ని ఎదుర్కొంటోంది. కంపెనీల మొదటి క్వార్టర్‌‌ రిజల్ట్సే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఇక లిక్విడిటీ కొరత గురించి ప్రత్యేకంగా మాట్లాడక్కర్లేదు. అప్పులిచ్చే పరిస్థితుల్లో బ్యాంకులు లేవని బాలక్రిష్ణన్‌‌ తెలిపారు.

ఇన్‌‌కంటాక్స్‌‌ అధికారుల వేధింపులు ఎదుర్కొన్న సిద్ధార్థ పట్ల సానుభూతినీ, విచారాన్ని వ్యక్తం చేశారు మరో ప్రముఖ వ్యాపారవేత్త టీ వీ మోహన్‌‌దాస్‌‌ పాయ్‌‌. ఇన్‌‌కంటాక్స్‌‌ విషయంలో దర్యాప్తుకు ఆదేశించాల్సిందిగా ఎన్‌‌డీఏ గవర్న్‌‌మెంట్‌‌ను ఆయన డిమాండ్‌‌ చేశారు. ఇండియాలో టాక్స్‌‌ టెర్రరిజం తీవ్రత మరోసారి వెల్లడైందన్నారు. వ్యాపార కారణాల వల్ల అసలు, వడ్డీలు చెల్లించలేని ఎంట్రప్రెనూర్లను దెయ్యాల్లా చూడటం మానెయ్యాలని  ఇన్ఫోసిస్‌‌  మాజీ డైరెక్టర్ మోహన్‌‌దాస్‌‌ పాయ్‌‌ చెప్పారు. సిద్ధార్థ ఉదంతం ప్రభుత్వానికి, పారిశ్రామిక రంగంలోని వారికి కళ్లు తెరిపించాలని అన్నారు. పొరపాట్లు చేసే ప్రతి వ్యక్తీ దుర్మార్గుడు కాదని వ్యాఖ్యానించారు. దర్యాప్తులు కొనసాగాలని, కానీ అది వ్యక్తుల ప్రతిష్ఠకు భంగం కలిగించేలా, వారి వ్యక్తిత్వాలను కించపరిచేలా ఉండకూడదని అభిప్రాయపడ్డారు. చాలా గుణపాఠాలున్నాయి. వాటి నుంచి మనం నేర్చుకోవాలని సూచించారు.

సిద్ధార్థపై ఆనంద్ మహింద్రా ట్వీట్…

వ్యాపారం విఫలమైతే, మీ ఆత్మ స్థైర్యాన్ని కోల్పోవద్దు. ‘ఆయనెవరో నాకు తెలియదు. ఆయన ఆర్థిక సమస్యలపై అవగాహన లేదు. కానీ నాకు తెలిసిందల్లా.. వ్యాపారాలు విఫలం కావడంతో, ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీసుకోకూడదని మాత్రమే. నేను వ్యాపారవేత్తలకు సూచించేది ఇదే’ అని ఆనంద్ మహింద్రా ట్వీట్ చేశారు.