ఆనందయ్య కరోనా మందుపై 27న హైకోర్టు విచారణ

ఆనందయ్య కరోనా మందుపై 27న హైకోర్టు విచారణ

అమరావతి: ఆనందయ్య మందు పంపిణీ చేయాలని దాఖలైన రెండు పిటిష‌న్ల‌పై ఏపీ హైకోర్టు విచారణకు అనుమతించింది. ఈ నెల 27న హైకోర్టు డివిజన్ బెంచ్ విచారణ చేపట్టనుంది. కరోనా సోకి తీవ్రంగా అస్వస్థతకు గురైన వేలాది మందిని తన ఆయుర్వేద వనమూలికల మందుతో నయం చేస్తున్న ఆనందయ్య మందును ఆయుష్, ఐసీఎంఆర్ శాస్త్రీయ తనిఖీలు చేస్తున్న విషయం తెలిసిందే. ఏపీకి చెందిన ఆయుష్ విభాగం వైద్యులు జరిపిన ప్రాథమిక విచారణలో ఎలాంటి దుష్ప్రభావాలు లేవని తేలిన విషయం తెలిసిందే.

అయితే కనీసం 500 మందిపై క్లినికల్ ట్రయల్స్ చేసి.. వారి ఆరోగ్య పరిస్థితిపై రికార్డు చేసిన తర్వాత అధికారికంగా నివేదిక ఇవ్వడానికి చాలా సమయం పడుతుంది. అలాగే ఐసీఎంఆర్ విచారణ, తనిఖీకి కూడా చాలా కాలం పట్టే అవకాశం ఉంది. ఈ నేపధ్యంలో నెల్లూరు కృష్ణపట్నానికి తీవ్ర అస్వస్థతకు గురైన రోగులు వస్తూనే ఉన్నారు. మందుల పంపిణీని నిలిపేశారని పోలీసులు అడ్డుకుని చెబుతుంటే.. రోగుల బంధువులు వాగ్వాదాలకు దిగుతూ.. మందు కావాలంటూ జనం ప్రాధేయపడుతున్నారు. మా వారి ప్రాణాలు పోతుంటే.. మా ఇష్టమొచ్చిన మందు తినిపించుకుంటాం.. మీకేం అభ్యంతరం.. ఆనందయ్య మందుతో ఎంతో మంది బాగైపోవడం చూస్తున్నాం.. వింటున్నాం.. మా వాళ్ల ప్రాణాలు మీరు కాపాడతారా.. అంటూ వాగ్వాదాలకు దిగుతున్నారు. ఈ నేపధ్యంలో పోలీసులు, అధికారులు అభ్యంతరం చెప్పకుండా ఆనందయ్య మందును యధావిధిగా పంపిణీ జరిగేలా చూడాలని ఓ న్యాయవాది ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలుచేశారు. అత్యవసర పరిస్థితుల్లోని రోగులు వారి అభీష్టం మేరకు ఇష్టమొచ్చిన చికిత్స చేయించుకునే అవకాశం కల్పించాలని కోరారు. ఇప్పటి వరకు వేల మందికి నయం అయిందని.. 70 వేల మందికి వైద్యం చేస్తే ఒక్కరు తప్ప ఎవరూ వ్యతిరేకంగా చెప్పలేదంటూ పిటిషనర్ కోర్టు తలుపుతట్టారు. ఈ నేపధ్యంలో హైకోర్టు కేసును అత్యవసర విచారణకు అంగీకరించింది. ఈనెల 27న ఆనందయ్య మందు పంపిణీపై విచారణ చేపట్టనుంది.