- ద బ్రీజ్ పేరుతో ఎకో టూరిజం
- అడవి మధ్యలో టిఫిన్.. లగ్జరీ టెంట్లలో బస
- కెన్యా, టాంజానియా తరహాలో సఫారీ
- ఆకట్టుకుంటున్న అటవీ అభివృద్ధి సంస్థ కొత్త ప్రాజెక్టు
హైదరాబాద్, వెలుగు: పర్యాటకులకు సరికొత్త అనుభూతిని పంచేలా తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ (టీఎస్ఎఫ్డీసీఎల్) మరో ముందడుగు వేసింది. హైదరాబాద్ నగరానికి సమీపంలో దట్టమైన అడవులు, అందమైన కొండలకు కేంద్ర బిందువైన వికారాబాద్‌లోని అనంతగిరిలో ద బ్రీజ్ పేరుతో సరికొత్త ఎకో -టూరిజం ప్రాజెక్టును ప్రారంభించింది.
పచ్చని చెట్లు, పక్షుల కిలకిలరావాల నడుమ బ్రేక్‌ఫాస్ట్ చేసే అవకాశాన్ని కల్పించింది. ప్రకృతి ఒడిలో సేదతీరడంతోపాటు గడ్డి మైదానాల్లో ఆరుబయట ప్రత్యేకంగా టేబుల్స్‌పై అల్పాహారం వడ్డించేలా ఏర్పాట్లు చేసింది. కెన్యా, టాంజానియా వంటి ఆఫ్రికన్ దేశాల్లో కనిపించే ఇలాంటి సఫారీ అనంతగిరి కొండల్లో పర్యాటకులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. డెక్కన్ వుడ్స్ అండ్ ట్రైల్స్ బ్రాండ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ రిసార్ట్ ప్రకృతి ప్రేమికులకు, సాహస యాత్రికులకు మంచి వీకెండ్ స్పాట్‌గా మారుతోంది.
తెలంగాణ మసాయి మారా..
సాధారణంగా రెస్టారెంట్లలో టిఫిన్ చేయడం మనకు అలవాటు. కానీ, ఇక్కడ బుష్ బ్రేక్‌ఫాస్ట్ కాన్సెప్ట్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఉదయం సఫారీ లేదా ట్రెక్కింగ్ వెళ్లొచ్చిన తర్వాత అడవి ఒడిలో ఇలా టిఫిన్ చేయడం పర్యాటకులకు మధురానుభూతిని కలిగిస్తోంది. ఆఫ్రికాలోని మసాయి మారా అభయారణ్యంలో విశాలమైన గడ్డి భూములు ఉంటాయి.
అలాంటి వాతావరణమే అనంతగిరిలో ఉండటంతో ఈ ప్రాంతాన్ని తెలంగాణ మసాయి మారాగా పిలుస్తున్నారు. ఈ అందాలను పర్యాటకులు ఆస్వాదించేలా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పర్యావరణానికి ఏమాత్రం హాని చేయని విధంగా (ఎకో ఫ్రెండ్లీ) లగ్జరీ టెంట్లు వేశారు. ఉదయం లేవగానే గైడెడ్ నేచర్ వాక్స్, బర్డ్ వాచింగ్, ట్రెక్కింగ్, ఎర్లీ మార్నింగ్ జీప్ సఫారీలు, సూర్యోదయ-, సూర్యాస్తమయాల వీక్షణ వంటివి ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తున్నాయి. కేవలం బ్రేక్‌ఫాస్ట్ మాత్రమే కాదు ఇక్కడ గడిపే ప్రతీ క్షణం ప్రకృతితో మమేకమయ్యేలా డిజైన్ చేశారు.
స్థానిక గిరిజనులే సిబ్బంది
ఈ ప్రాజెక్టులో అనంతగిరి చుట్టుపక్కల ఉండే గిరిజన యువతనే సిబ్బందిగా నియమించుకోవడంతో వారికి ఉపాధి లభిస్తోంది. హాస్పిటాలిటీ, వంట మనుషులు, ట్రెక్కింగ్ గైడ్స్, మెయింటెనెన్స్ అంతా వీరే చూసుకుంటారు. పర్యాటకులకు అడవిలో ఎలా నడుచుకోవాలి, భద్రతా ప్రమాణాలు.. ఇలా పలు అంశాలపై వీరికి నేచురలిస్టులుగా ప్రత్యేక శిక్షణ ఇవ్వగా.. పర్యాటకులకు గైడ్ చేస్తున్నారు.
దీని ద్వారా పర్యాటకంతోపాటు స్థానికుల జీవన ప్రమాణాలు కూడా మెరుగుపడుతున్నాయని ఫారెస్ట్ఆఫీసర్లు అంటున్నారు. కాగా, ఈ రిసార్ట్‌కు మధ్యాహ్నం 3 గంటలకు వెళ్తే మళ్లీ మరుసటిరోజు ఉదయం 10 గంటలకు చెక్ అవుట్చేయాల్సి ఉంటుంది. ప్రకృతి ప్రేమికులు, సాహస యాత్రికులు ఒక్కసారి ఇక్కడికి వస్తే మళ్లీ రావాలనిపించేలా తీర్చిదిద్దామని అధికారులు చెబుతున్నారు.
డెక్కన్ వుడ్స్ అండ్ ట్రైల్స్ ఆధ్వర్యంలో నిర్వహణ
అనంతగిరిలో ఈ ప్రాజెక్టును అటవీ అభివృద్ధి సంస్థ ప్రైవేట్ వ్యక్తులు, కార్పొరేట్ కంపెనీలకు లీజుకు ఇవ్వలేదు. సంస్థ తన సొంత బ్రాండ్ అయిన డెక్కన్ వుడ్స్ అండ్ ట్రైల్స్ ఆధ్వర్యంలోనే నిర్వహిస్తోంది. లాభాపేక్ష కంటే పర్యావరణ పరిరక్షణ, స్థానికులకు ఉపాధి కల్పనే లక్ష్యంగా అటవీశాఖ ఈ నిర్ణయం తీసుకుంది.
కార్పొరేట్ స్థాయి వసతులు కల్పిస్తూనే అడవికి ఎలాంటి హాని కలగకుండా అధికారులే దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. దీన్ని ప్లాస్టిక్ రహిత జోన్‌గా తీర్చిదిద్దారు. పర్యాటకులకు భద్రతతోపాటు అడవిలో సఫారీ, బర్డ్ వాచింగ్ వంటి ప్రత్యేక అనుభూతులను ఈ ప్రాజెక్టు అందిస్తోంది.
