V6 News

Ram Pothineni: ఓటీటీలోకి 'ఆంధ్ర కింగ్ తాలూకా'.. రామ్ రొమాన్స్ డ్రామా స్ట్రీమింగ్ ఎప్పుడు , ఎక్కడంటే?

Ram Pothineni: ఓటీటీలోకి 'ఆంధ్ర కింగ్ తాలూకా'..  రామ్ రొమాన్స్ డ్రామా స్ట్రీమింగ్ ఎప్పుడు , ఎక్కడంటే?

టాలీవుడ్  ఎనర్టిటిక్ యంగ్ హీరో రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే  జంటగా నటించిన రొమాంటిక్ చిత్రం 'ఆంద్ర కింగ్ తాలూకా'. ఈ మూవీ నవంబర్ 27న థియేటర్లలో విడుదలైంది. తొలి రోజు నుంచే ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందనను అందుకుంది.  అయితే బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది. థియేట్రికల్ రన్ ముగింపు దశకు చేరుకోవడంతో ఇప్పుడు ఓటీటీ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయింది.

క్రిస్మస్ కానుకగా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల?

లేటెస్ట్ సమాచారం ప్రకారం.. 'ఆంధ్ర కింగ్ తాలూకా' సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. ఈ చిత్రాన్ని క్రిస్మస్ స్పెషల్ కానుకగా డిసెంబర్ 25, 2025న నెట్‌ఫ్లిక్స్‌లో ప్రీమియర్‌ కానుంది. ఈ మేరకు నిర్మాతలు ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయనప్పటికీ, ఈ అప్‌డేట్ ఆన్‌లైన్‌లో ఇప్పటికే ప్రకంపనలు సృష్టిస్తోంది. ఓటీటీ విడుదల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

సినిమా కథా నేపథ్యం

సాగర్‌‌ (రామ్) దారి తీరు లేని ఓ లంక గ్రామం నుంచి వచ్చి టౌన్‌లో పాలిటెక్నిక్ చదివే సాదాసీదా కుర్రాడు. కానీ స్టార్ హీరో సూర్య (ఉపేంద్ర)కు వీరాభిమాని. అలాంటి ఓ సాధారణ అభిమాని.. థియేటర్‌‌ ఓనర్‌‌ పురుషోత్తం (మురళీ శర్మ) కూతురు మహాలక్ష్మి (భాగ్యశ్రీ బోర్సే) ఇష్టపడతాడు. ఏ క్రమంలో వీరిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటారు. కానీ తన థియేటర్‌‌లో టికెట్ల కోసం పడిగాపులు గాచే ఓ అభిమానికి తన కూతురును ఎలా ఇస్తానంటూ ఎద్దేవ చేస్తాడు పురుషోత్తం. తన ప్రేమను గెలుచుకోవడం కోసం కరెంట్, రోడ్డు సహా కనీస అవసరాలు లేని తన ఊర్లో AC థియేటర్ కట్టి తన అభిమాన హీరో 100వ సినిమాతో ఓపెనింగ్‌ చేస్తానని ఛాలెంజ్ చేస్తాడు సాగర్. అలా తాను విసిరిన ఛాలెంజింగ్ కోసం సాగర్ ఏం చేశాడు అనేది మిగతా కథ. మరోవైపు మారుమూల గ్రామంలో ఉన్న ఈ అభిమాని కోసం స్టార్ హీరో సూర్య ఎందుకు వెతుక్కుంటూ రావల్సి వచ్చింది. అంతలా ఆ హీరో కోసం సూర్య ఏం చేశాడు అనే ప్రశ్నకు సమాధానమే ఈ సినిమా. 

ALSO READ : OTT Thriller: ఓటీటీలోకి సైకో థ్రిల్లర్ సిరీస్.. సీక్రెట్స్ చూసే కళ్ల డాక్టర్ కథ.. 
 
ఈ సినిమాలో రామ్ సరసన భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించింది. వీరిద్దరి ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీకి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. రామ్ ఎనర్జిటిక్ యాక్టింగ్, భాగ్యశ్రీ అందం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై వై రవిశంకర్, నవీన్ యెర్నెనీ నిర్మించారు.  రావు రమేశ్, మురళీ శర్మ, తులసి, సింధు తులానీ, రాహుల్ రామకృష్ణ, సత్య, వీటివీ గణేష్ లు ఈ మూవీలో నటించారు. 

బాక్సాఫీస్ వసూళ్లు..

'ఆంధ్ర కింగ్ తాలూకా' బాక్సాఫీస్ వద్ద సుమారు రూ 30  కోట్లు మాత్రమే వసూలు చేసినట్లు ట్రెడ్ వర్గాలు వెల్లడించాయి.  రామ్ గత చిత్రాల అంచనాలకు ఈ సంఖ్యలు అనుగుణంగా లేకపోయినా, ఈ సినిమాకు లభిస్తున్న స్థిరమైన ప్రేక్షకాదరణ కారణంగా..  ఓటీటీలో విడుదల ద్వారా మరింత  ప్రేక్షాదరణకు  అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నెట్‌ఫ్లిక్స్‌లో క్రిస్మస్ రోజున విడుదల కావడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులను ఈ చిత్రం సులభంగా చేరుకోగలదని భావిస్తున్నారు.