అంబేద్కర్ సాక్షిగా ఏపీలో కులగణన ప్రారంభం

అంబేద్కర్ సాక్షిగా ఏపీలో కులగణన ప్రారంభం

ఏపీ రాజకీయాల్లో మరో సంచలన నిర్ణయం. కుల గణన ప్రారంభించింది సీఎం జగన్ సర్కార్. బెజవాడ నడిబొడ్డున దేశంలోనే అతి పెద్ద అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ రోజునే.. కుల గణన చేపట్టటం చర్చనీయాంశం అయ్యింది. ఏపీలో కుల గణనపై టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా.. జగన్ మాత్రం తన పనిని తాను చేసుకుపోతున్నారు. ఇప్పటికే ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ ఉంది.. ప్రతి 50 ఇళ్లకు ఓ వాలంటీర్ ఉన్నారు.. గ్రామ సచివాలయాలు ఉన్నాయి.. 4 లక్షల మంది ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందించే వ్యవస్థ.. నాలుగేళ్లుగా పని చేస్తుంది. 

ఈ క్రమంలోనే కుల గణన ప్రారంభం అయ్యింది. వాస్తవంగా చెప్పాలంటే ఇప్పటికే ఏపీలో కులాల లెక్కలపై ప్రభుత్వం దగ్గర స్పష్టమైన డేటా ఉందనే వాదనలు ఉన్నాయి. వాలంటీర్ల ద్వారా ఏ గ్రామంలో.. ఏ పల్లెలో.. ఏ పట్టణంలో.. ఏ వార్డులో ఎంత మంది ఉన్నారు.. వాళ్లు ఏ కులపోళ్లు అనేది స్పష్టమైన సమాచారం ఉంది. కాకపోతే ఇది అధికారికంగా లేదు.. ఇప్పుడు కుల గణన ప్రారంభంతో.. మరో వారం రోజుల్లో ఏ కులం వాళ్లు ఎంత మంది ఉన్నారు అనేది.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారికంగా తేలిపోనుంది. ఇప్పటికే ప్రాథమిక సమాచారం ఆధారంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ జనాభా ఎక్కువ అనే వార్తలు వస్తున్నాయి.. 

ఏపీలో సచివాలయ సిబ్బంది, వాలంటీర్ల ఆధ్వర్యంలో కులగణన జనవరి 19 నుంచి 28 వరకు  అంటే పది రోజుల పాటు జరగనుంది.  ఇప్పటివరకు గ్రామ వాలంటీర్లు సేకరించిన డేటా ప్రకారం..  గ్రామాల్లో 1,23,40,422 కుటుంబాలకు చెందిన 3,56,62,251 మంది నివాసం ఉంటున్నారు. పట్టణ ప్రాంతాల్లో 44,44,887 కుటుంబాలలో 1,33,16,091 మంది నివసిస్తున్నారు.  మొత్తం 1.67 కోట్ల కుటుంబాలకు సంబంధించి 4.89 కోట్ల మంది ఉన్నారు.  ఇందులో ఎంతమంది  ఏ కులాల వారు ఉన్నారో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా డేటా సేకరించనుంది. 

 కులగణన ప్రక్రియలో అత్యంత పారదర్శకంగా వివరాల నమోదు అనంతరం ఆ కుటుంబంలో ఎవరైనా ఒక వ్యక్తి నుంచి ఆధార్‌తో కూడిన ఈ –కేవైసీ తీసుకోనున్నారు. ఈ ప్రక్రియలో బయోమెట్రిక్, ఐరిస్‌ తదితర విధానాలకు అవకాశం కల్పించారు.    మారుమూల పల్లెల్లో సిగ్నల్ లేని ప్రాంతాల్లో ఆఫ్‌లైన్‌లో వివరాలు నమోదు చేయనున్నారు.  ఇళ్ల దగ్గర అందుబాటులో లేనివారికి ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు సచివాలయాల్లో నమోదుకు అవకాశం కల్పించారు. ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌లో సర్వేవివరాలు నమోదు చేస్తారు.